
- తీర్పు చెప్పిన సంగారెడ్డి స్పెషల్ పోక్సో కోర్టు
- మారుతీ హోంలో బాలికపై రేప్.. మృతి
- 2020లో సంచలనంగా మారిన ఘటన
రామచంద్రాపురం, వెలుగు: అమీన్పూర్, మారుతీ హోంలో బాలికపై అత్యాచారం, మృతికి సంబంధించిన కేసులో ముగ్గురు దోషులకు గురువారం సంగారెడ్డి జిల్లా స్పెషల్ పోక్సో కోర్టు జీవిత ఖైదు, రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించింది. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతీ హోంలో 2020లో ఓ బాలికపై అత్యాచారం చేశారు. ఆపై బాలిక మృతికి కారణమైన ఘటనలో ప్రధాన నిందితుడు నరెడ్ల వేణుగోపాల్ రెడ్డి (51), అతడికి సహకరించిన హోం నిర్వాహకురాలు చిలుకూరి విజయ (46), స్వర్ణపురికాలనీకి చెందిన సూరపనేని జయదీప్(42)లను దోషులుగా నిర్దారిస్తూ స్పెషల్ కోర్టు జడ్జి సుదర్శన్ తీర్పు చెప్పారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఓ బాలికను అమీన్‌పూర్‌లోని మారుతీ హోంలో బంధువులు చేర్పించారు. 2020 జులై 9న బాలికకు అస్వస్థతగా ఉందని హోం నిర్వాహకులు ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో చైల్డ్వెల్ఫేర్సొసైటీ సభ్యులు నిలోఫర్దవాఖానలో జాయిన్ చేయగా12న ఆరోగ్యం క్షీణించి చనిపోయింది. కొన్ని రోజులుగా లైంగిక దాడి జరగడం వల్లే ఆమె అనారోగ్యంతో చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించడంతో విషయం సంచలనంగా మారింది.
హోం నిర్వాహకురాలు చిలుకూరి విజయ సహకారంతో మదీనగూడకు చెందిన వేణుగోపాల్ రెడ్డి బాలికపై లైంగిక దాడి చేసినట్లుగా విచారణలో తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వేణుగోపాల్‌రెడ్డి హోం నిర్వహణకు సహకరిస్తూ తరచూ అక్కడికి వచ్చేవాడని గుర్తించారు. ఇందులో సూరపనేని జయదీప్ ప్రమేయం కూడా ఉందని పోలీసుల విచారణలో తేలింది. దీంతో దోషులు ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ స్పెషల్ పోక్సో కోర్టు తీర్పు చెప్పింది.