FIDE Women’s World Cup: చరిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్..19 ఏళ్లకే FIDE మహిళల ప్రపంచ కప్ సొంతం

FIDE Women’s World Cup: చరిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్..19 ఏళ్లకే FIDE మహిళల ప్రపంచ కప్ సొంతం

భారత చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ 19 ఏళ్ళ వయసులో ఫిడే మహిళల ప్రపంచ కప్ 2025ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. నాగ్‌పూర్‌కు చెందిన ఈ మహిళ సోమవారం (జూలై 28) జార్జియాలోని బటుమిలో జరిగిన మ్యాచ్ లో సహచర భారత ప్లేయర్ కోనేరు హంపీని ఓడించి గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచింది. అనుభవజ్ఞురాలు కోనేరు హంపిని ఫైనల్‌లో టైబ్రేక్‌ల ద్వారా ఓడించడం విశేషం. ఈ విజయంతో దివ్య గ్రాండ్‌మాస్టర్ గెలుచుకున్న నాలుగో మహిళగా నిలిచింది. ఓవరాల్ గా ఇండియాలో 88వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించింది.  

శనివారం (జూలై 26), ఆదివారం (జూలై 27) జరిగిన రెండు క్లాసికల్ గేమ్‌లు డ్రాగా ముగిసిన తర్వాత దివ్య దేశ్‌ముఖ్ విజయం ఖాయమైంది. సోమవారం (జూలై 28) ముగిసిన ఈ పోరులో దివ్య రెండుసార్లు ప్రపంచ రాపిడ్ ఛాంపియన్‌ కోనేరు హంపీని 2.5-1.5 తేడాతో అధిగమించి విజయం సాధించింది. ఆమె విజయాన్ని అంతర్జాతీయ చెస్ సమాఖ్య తమ అధికారిక ఎక్స్ లో ఈ విధంగా రాసుకొచ్చింది. “కేవలం 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ 2025 ఫిడే మహిళల ప్రపంచ కప్ విజేత!” అని రాసింది. ఈ విజయంతో నాగ్‌పూర్‌కు చెందిన ఈ చెస్ క్రీడాకారిణి వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో స్థానం సంపాదించింది.

ALSO READ : IND vs ENG 2025: నేనే టీమిండియా కెప్టెన్ అయితే అలా చేసేవాడిని: ఇంగ్లాండ్‌కు అశ్విన్ కౌంటర్

విజయం తర్వాత దివ్య తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయింది. పక్కనే ఉన్న ఆమె తల్లిని కౌగిలించుకొని గట్టిగా ఏడ్చేసింది. "నేను ఈ విధంగా గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను పొందడం విధి అని నేను అనుకుంటున్నాను" అని దివ్య తన విజయం తర్వాత భావోద్వేగంతో చెప్పింది.