
భారత్ లో చైనా ఉత్పత్తుల్ని బ్యాన్ చేసి ప్రధాని మోడీ మంచి పనిచేశారని అంటున్నారు వ్యాపారులు. ఎల్ఏసీ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్) వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు కేంద్రం..,డ్రాగన్ కంట్రీకి చెందిన ఉత్పత్తుల్ని మనదేశంలో బ్యాన్ చేసింది. దీంతో ఫెస్టివల్ సీజన్ లో ఇండియన్ మార్కెట్లు భారీ స్థాయిలో లాభపడినట్లు తెలుస్తోంది. ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) లెక్కల ప్రకారం దీపావళి పండుగ సందర్భంగా 72వేల కోట్లు అమ్మకాలు జరిగాయి. చైనా ఉత్పత్తుల్ని మనదేశంలో బ్యాన్ చేయడం ద్వారా చైనాకు సుమారు దీపావళికి 40వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
సీఏఐటీ వివరాల ప్రకారం…ఇండియాకు చెందిన 20 ప్రధాన నగరాల్లోని జరిగిన అమ్మకాల ఆధారంగా దీపావళితో కలుపుకొని 72వేల కోట్లు అమ్మకాలు జరిగాయని, అందులో చైనాకు 20వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు సీఏఐటీ తన ప్రకటనలో తెలిపింది.
దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ ఎం సీజీ) బొమ్మలు, గాడ్జెట్స్, వంటింట్లో ఉపయోగించే వస్తువులు , గిఫ్ట్ లు , మిఠాయి వస్తువులు, స్వీట్లు, గృహోపకరణాలు , డ్రెస్ లు , స్టీల్ గిన్నెలు, బంగారం మరియు ఆభరణాలు, చెప్పులు, గడియారాలు, ఫర్నిచర్, ఫ్యాషన్ దుస్తులు, ఇంటి అలంకరణ వస్తువులను ఎక్కువ కొనుగోలు చేశారు.
తద్వారా రాబోయే రోజుల్లో ఇండియాలో బిజినెస్ ఎలా పెరుగుతుందో ఈ అమ్మకాలను చూసి చెప్పొచ్చని ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.