జొకోవిచ్‌‌ ఏడోసారి.. ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌ ఫైనల్లోకి

జొకోవిచ్‌‌ ఏడోసారి.. ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌ ఫైనల్లోకి

పారిస్‌‌: ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌లో ఆసక్తిగా ఎదురుచూసిన పోరులో సెర్బియా సూపర్‌‌ స్టార్‌‌ నొవాక్‌‌ జొకోవిచ్‌‌ విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ సెమీస్‌‌లో థర్డ్‌‌ సీడ్‌‌ జొకో 6–3, 5–7, 6–1, 6–1తో వరల్డ్‌‌ నంబర్‌‌ వన్‌‌, టాప్‌‌సీడ్‌‌ కార్లోస్‌‌ అల్కరాజ్‌‌ (స్పెయిన్‌‌)కు షాకిచ్చి.. రోలాండ్‌‌ గారోస్‌‌లో ఏడోసారి టైటిల్‌‌ ఫైట్‌‌కు అర్హత సాధించాడు. ఓవరాల్‌‌గా ఇది 34వ గ్రాండ్‌‌స్లామ్‌‌ ఫైనల్‌‌ కావడం విశేషం. ఇక రఫెల్‌‌ నడాల్‌‌తో సంయుక్తంగా 22 గ్రాండ్‌‌స్లామ్స్‌‌తో ఉన్న సెర్బియన్‌‌ ప్లేయర్‌‌ రికార్డు స్థాయిలో 23వ స్లామ్‌‌కు అడుగు దూరంలో నిలిచాడు. 3 గంటల 23 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌‌లో స్టార్టింగ్‌‌లో జొకో జోరు చూపెట్టినా.. రెండో సెట్‌‌లో అల్కరాజ్‌‌ అనూహ్యంగా పుంజుకున్నాడు.

బలమైన ఫోర్‌‌, బ్యాక్‌‌హ్యాండ్‌‌ షాట్లతో రెచ్చిపోయాడు. కేవలం నిమిషాల వ్యవధిలో సెట్‌‌ను ముగించి సూపర్‌‌ ఫామ్‌‌లోకి వచ్చాడు. కానీ కీలకమైన థర్డ్‌‌ సెట్‌‌లో స్కోరు 1–1 ఉన్న సమయంలో అల్కరాజ్‌‌ చెయ్యి, కాలి కండరాలు పట్టేశాయి. మెడికల్‌‌ టైమౌట్స్‌‌ తీసుకున్నా అతను కోలుకోలేకపోయాడు. దీన్ని ఆసరాగా తీసుకున్న జొకో వరుసగా 10 గేమ్‌‌లు గెలిచి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌‌ మ్యాచ్‌‌లో జొకో 8 ఏస్‌‌లతో చెలరేగాడు. మూడుసార్లు డబుల్‌‌ ఫాల్ట్‌‌ చేసినా, 12 బ్రేక్‌‌ పాయింట్లలో ఏడింటిని కాచుకున్నాడు. 39 విన్నర్లు, 36 అన్‌‌ఫోర్స్‌‌డ్‌‌ ఎర్రర్స్‌‌తో మ్యాచ్‌‌ ముగించాడు. ఇక మూడు ఏస్‌‌లు మాత్రమే కొట్టిన అల్కరాజ్‌‌ 12 బ్రేక్‌‌ పాయింట్లలో రెండు మాత్రమే కాపాడుకున్నాడు. 35 విన్నర్స్‌‌, 50 అన్‌‌ఫోర్స్‌‌డ్‌‌ ఎర్రర్స్‌‌తో మ్యాచ్‌‌ను కోల్పోయాడు.