తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసిన్రు : డీకే అరుణ

తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసిన్రు : డీకే అరుణ

గద్వాల, వెలుగు: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను పదేండ్ల బీఆర్ఎస్  పాలనలో లూటీ చేశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఆదివారం గద్వాల పట్టణంలోని పలు కాలనీల్లో బీజేపీ అభ్యర్థి బలిగేరా శివారెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం ఇప్పటికే సర్వనాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్  గెలిస్తే తెలంగాణ ప్రజల బతుకులు ఆగమైపోతాయన్నారు.

పోటీ పడి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అమలు సాధ్యం కానీ హామీలు ఇస్తుందని మండిపడ్డారు. పక్కనే ఉన్న కర్నాటక రాష్ట్రంలో రూ.4 వేల పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అన్నివర్గాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించడానికి కొందరు రాజకీయాల్లోకి వస్తున్నారని విమర్శించారు. సమస్యలపై పోరాటాలు, నిరాహార దీక్షలు, పాదయాత్రలు, నిరసన కార్యక్రమాలు చేసి ప్రజల ఆశీస్సులతో పదవులు పొందానని చెప్పారు. ప్రజల సమస్యలు తెలిసిన బీజేపీ అభ్యర్థి శివారెడ్డిని గెలిపించాలని కోరారు.