ఎనిమిదేండ్లలో టీఆర్ఎస్​ చేసిందేమీ లేదు : డీకే అరుణ

ఎనిమిదేండ్లలో టీఆర్ఎస్​ చేసిందేమీ లేదు : డీకే అరుణ

గద్వాల, వెలుగు: ఎనిమిదేండ్లలో టీఆర్ఎస్ సర్కారు చేసిందేమీ లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ప్రజాగోస, బీజేపీ భరోసా యాత్రలో భాగంగా ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటీ దొడ్డి మండలం చింతలకుంట నుంచి బైక్ ర్యాలీతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సోంపురం, ఎస్సన్ దొడ్డి, మల్లాపురం, నందిన్నె గ్రామాల్లో ఆమె యాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేవలం ఓట్ల కోసమే సీఎం స్కీములు ప్రవేశ పెట్టి, తర్వాత పక్కన పెడుతున్నారన్నారు. డబుల్ బెడ్ రూమ్​ ఇండ్లు ఇస్తామని ఇప్పటివరకు గద్వాల నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు. రైతు బంధు పేరిట రూ.17వేల కోట్లు ఇస్తూ 80% పెద్ద రైతులకే లబ్ధి చేకూరుస్తున్నారన్నారు.

ధరణి పోర్టల్ తో ప్రతి గ్రామంలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తమ భూములు ఎప్పుడు  ఎవరు గుంజుకుంటారోననే ఆందోళనలో రైతులు ఉన్నారన్నారు. ధరణి పోర్టల్ వల్ల కేవలం కేసీఆర్ ఫ్యామిలీకి మాత్రమే లబ్ధి జరిగిందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండల పద్మావతి, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, సీనియర్ లీడర్ నందిన్నె ప్రకాశ్​రావు, రామాంజనేయులు, తిరుమలరెడ్డి, త్యాగరాజు, కబీర్​దాస్, నరసింహులు, మహానంది రెడ్డి, కృష్ణవేణి, రజక జయశ్రీ పాల్గొన్నారు.