గ్రూపు రాజకీయాల్లో నన్ను లాగొద్దు

గ్రూపు రాజకీయాల్లో నన్ను లాగొద్దు
  • అంబుడ్స్‌‌‌‌మన్‌‌గా కొనసాగుతా
  • హెచ్‌‌‌‌సీఏ గ్రూపు  రాజకీయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు
  • జస్టిస్‌‌ దీపక్‌‌ వర్మ స్పష్టం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ (హెచ్‌‌సీఏ) అంబుడ్స్‌‌మన్‌‌గా కొనసాగుతానని జస్టిస్‌‌(రిటైర్డ్​) దీపక్‌‌ వర్మ స్పష్టం చేశారు. తాను పదవి నుంచి వైదొలిగినట్టు వచ్చిన  ఊహాగానాల్లో నిజం లేదన్నారు. హెచ్‌‌సీఏలో రెండు గ్రూపుల మధ్య రాజకీయాల్లో, గొడవల్లో కల్పించుకోనని తాను పంపించిన ఈమెయిల్‌‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. తన పదవీకాలం పూర్తయ్యేంతవరకూ హెచ్‌‌సీఏ అంబుడ్స్‌‌మన్‌‌, ఎథిక్స్‌‌ ఆఫీసర్‌‌గా పని చేస్తానని స్పష్టం చేస్తూ  సోమవారం మరో మెయిల్‌‌ పంపించారు. ‘ఈ నెల 12వ తేదీన హెచ్‌‌సీఏ అంబుడ్స్‌‌మన్‌‌గా నేను చార్జ్‌‌ తీసుకున్నా.  ప్రస్తుతం ఆ పోస్ట్‌‌లోనే  కొనసాగుతున్నా. కాబట్టి నేను పంపిన  చివరి మెయిల్‌‌ను తప్పుగా అర్థం చేసుకోవద్దు.  అసోసియేషన్‌‌లో రెండు గ్రూప్స్‌‌ మధ్య రాజకీయాల్లో, వాళ్ల గొడవల్లో నేను కల్పించుకోనని, ఈ విషయంపై నన్ను ఎవరూ సంప్రదించకూడదన్న ఉద్దేశంతోనే ఆ మెయిల్‌‌ రాశా.  రెండు వర్గాల మధ్య వివాదాలు, రాజకీయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి  ఇందులో నన్ను ఇన్వాల్వ్‌‌ చేయొద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. రెండు గ్రూపులకు కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ ఉంది. కాబట్టి మీ సమస్యను న్యాయస్థానం ముందు ఉంచొచ్చు. అంతేతప్ప ఈ వివాదంలో నేను చేసేదేమీ లేదు. హైకోర్టు ఉత్తర్వుల అనంతరం, ఈ నెల 11వ తేదీన హెచ్‌‌సీఏ ప్రెసిడెంట్‌‌ నుంచి ఈ మెయిల్‌‌ అందుకున్న తర్వాత అంబుడ్స్‌‌మన్‌‌గా నేను తిరిగి బాధ్యతలు స్వీకరించా. నా పదవీకాలం ముగిసే వరకూ హెచ్‌‌సీఏ అంబుడ్స్‌‌మన్‌‌గా పని చేయాలని అనుకుంటున్నా. అలాగే, ప్రస్తుత పరిస్థితుల్లో నేను హైదరాబాద్‌‌కు వచ్చే అవకాశం లేదని మరోసారి స్పష్టం చేస్తున్నా. కాబట్టి, ఏ విషయంపైన అయినా విచారణ చేపట్టాలంటే అన్‌‌లైన్‌‌ ద్వారా  చేస్తా’ అని వర్మ పేర్కొన్నారు. కాగా, అంబుడ్స్‌‌మన్‌‌ విషయంలో హెచ్‌‌సీఏలో చాన్నాళ్లుగా రగడ జరుగుతోంది. తొలుత  వర్మ నియమాకానికి ఒప్పుకున్న అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ మెంబర్స్‌‌ తర్వాత యూటర్న్‌‌ తీసుకున్నారు.  అయితే, హైకోర్టు  వర్మ అపాయింట్‌‌మెంట్‌‌కు ఆమోదం తెలిపింది. ఈ నెల 11వ తేదీన తన అధ్యక్షతన జరిగిన రెండో దఫా ఏజీఎంలో  అంబుడ్స్‌‌మన్‌‌గా దీపక్‌‌ వర్మ నియామకానికి ఆమోదం లభించిందని ప్రకటించిన అజర్‌‌ మీటింగ్‌‌ను ముగించాడు. కానీ, ఏజీఎంను కొనసాగించిన మరో వర్గం అంబుడ్స్‌‌మన్‌‌, ఎథిక్స్‌‌ ఆఫీసర్‌‌గా మరో  ఇద్దరిని నియమించినట్టు ప్రకటించింది. అయితే, ఏజీఎం చైర్మన్‌‌ మీటింగ్‌‌ ముగించినట్టు ప్రకటించిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు చెల్లవని అజర్‌‌ చెబుతున్నాడు.