విపక్ష నేతలు విమర్శించిన కారణంగానే తన కులం గురించి తెలిసిందన్నారు ప్రధాని మోడీ. తానెప్పుడూ తన కులం గురించి ప్రస్తావించలేదన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని కన్నౌజ్ ప్రాంతంలో ఇవాళ ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశమే తన కుటుంబమని… దయచేసి కుల రాజకీయాల్లోకి తనను లాగొద్దన్నారు. చేతులెత్తి మీకు నమస్కరిస్తానంటూ మోదీ ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు.
అంతేకాదు తన వెనుకబాటుతనం గురించి ప్రజలకు తెలియజెప్పినందుకు విపక్ష నేతలకు ధన్యవాదాలు తెలిపారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల కారణంగా భారతదేశానికి ముప్పు ఉందని, ఉగ్రవాదులను అంతమొందించేందుకు ఎస్పీ, బీఎస్పీ నేతల దగ్గర ఏమైనా ఉపాయం ఉందా? అని ప్రశ్నించారు. ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్న నేతలు దేశ రక్షణ, జవానుల భద్రత విషయంలో మాత్రం నోరు మెదపట్లేదని విమర్శించారు. అసలు ఎన్నికల ప్రచారంలోనే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కసారి కూడా విపక్ష నేతలు మాట్లాడలేదని విమర్శించారు మోడీ.