
ఎమ్మెల్యే బెదిరింపులకు తాళలేక ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. ఢిల్లీ దుర్గా విహార్ నివాసి రాజేంద్ర సింగ్ (52) డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. మరో వైపు ఢిల్లీ జల్ బోర్డ్ ద్వారా మంచి నీటి సరఫరా వ్యాపారం చేస్తున్నాడు. అయితే రాజేంద్ర సింగ్ కు ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ జర్వాల్ మధ్య ఓ విషయంపై 5 సంవత్సరాల క్రితం విభేదాలు తలెత్తాయి. నాటి నుంచి ఎమ్మెల్యే బాధితుణ్ని చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బెదిరింపులకు తాళలేక బాధితుడు వివాదం సద్దుమణిగేలా తన సొంతగ్రామంలో ఉన్న ఆస్తుల్ని అమ్మి ఎమ్మెల్యేకు 5లక్షలు చెల్లించాడు. అయినా బెదిరించడంతో డాక్టర్ తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తన మరణానికి ఎమ్మెల్యే ప్రకాష్ జర్వాలే కారణమని నోట్ రాశాడు. ఐదు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే తనను మానసికంగా చిద్రవద చేస్తున్నాడని, గతేడాది చంపేస్తానని బెదిరించాడని లేఖలో పేర్కొన్నాడు. నేను భయంతో నా జీవితాన్ని గడపలేను. నా మరణానికి కారణమైన ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.
బాధితుడి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలంలో దొరికిన సూసైడ్ లెటర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.