ఫ్రాన్స్‌ లో కరోనా బారిన పడ్డ డాక్టర్‌ ఆత్మహత్య

ఫ్రాన్స్‌ లో కరోనా బారిన పడ్డ డాక్టర్‌ ఆత్మహత్య

పారిస్‌: కరోనా వైరస్‌ బారిన పడ్డ ఓ డాక్టర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫ్రాన్స్‌ లో జ‌రిగింది. ఈ విష‌యాన్ని స్థానిక మీడియా తెలిపింది. ఫ్రెంచ్‌ ఫుట్ బాల్ లో భాగంగా ఓ క్లబ్‌ జట్టుకు డాక్టర్ గా ఉన్న బెర్నార్డ్‌ గోంజ్‌లెజ్‌ ఆత్మహత్యకు పాల్పడిన‌ట్లు తెలిసింది. ఫ్రెంచ్‌ ఫుట్ బాల్‌ క్లబ్‌ జట్టైన లిగీ-1 రీమ్స్‌ డాక్టర్‌ బెర్నార్డ్‌ గోంజెలెజ్ కు కరోనా వైరస్‌ సోకిందట‌. కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురైన అతనికి టెస్టుల్లో కరోనా పాజిటివ్‌ రావడంతో బలవన్మరణానికి పాల్పడిన‌ట్లు ఫ్రాన్స్ మీడియా తెలిపింది. ఇది ఆ దేశ ఫుట్‌బాల్‌ రంగాన్ని కలవరపాటుకు గురిచేసిందని చెప్పింది.

తాను ఇక‌ బ్రతకనని భావించే ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని రీమ్స్‌ మేయర్‌ అర్మౌడ్‌ రాబినెట్‌ అనుమానం వ్యక్తం చేశారు. డాక్టర్‌ బెర్నార్డ్ కు కరోనా సోకిన విషయం తనకు తెలిసిందని, ఇంతలోనే ఇలా ఆత్మహత్య చేసుకోవడం బాధించిందని రాబినెట్‌ విచారం వ్యక్తం చేశారు. తనకు ఎన్నో సంవత్సరాలుగా పరిచయం ఉన్న బెర్నార్డ్‌ మృతి వార్తతో షాక్ కు గురయ్యానన్నారు.