అసోసియేషన్ల ముసుగులో తిష్ట.. బదిలీల ప్రక్రియ సజావుగా జరగాలి

అసోసియేషన్ల ముసుగులో తిష్ట.. బదిలీల ప్రక్రియ సజావుగా జరగాలి

హైదరాబాద్: డీఎంఈ పరిధిలోని మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో పని చేసే టీచింగ్, డాక్టర్స్ బదిలీలను పారదర్శకంగా చేపట్టాలని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ టీచింగ్ హాస్పిటల్స్‌ డాక్టర్స్ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. త్వరలో చేపట్టే సాధారణ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేయాలన్నారు. 

హైదరాబాద్ కోఠిలోని డీఎంఈ ఆవరణలో జేఏసీ చైర్మన్ డా.వి.శేఖర్ మాట్లాడారు. కొన్ని డాక్టర్స్ అసోసియేషన్ ముసుగులో ఉన్న నాయకులు గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలోనే తిష్ట వేశారని.. వారి వల్ల జిల్లాలలో పని చేస్తున్న డాక్టర్లు అక్కడే ఉండిపోయారన్నారు. అలాంటి అసోసియేషన్ నాయకుల ఒత్తిడి లేకుండా సాధారణ బదిలీ ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించి ఉస్మానియా, గాంధీలో పనిచేస్తున్న డాక్టర్లను వెంటనే బదిలీ చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 అసోసియేషన్ల ముసుగు కింద ఐదు సంవత్సరాలకు పైగా ఆయా ఆస్పత్రుల్లో కొనసాగుతున్నారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో కారణంగా కేవలం 20 శాతం వరకే బదిలీలు జరిగాయని... ఆ జీవోను రద్దు చేసి, పూర్తి స్థాయిలో బదిలీలు చేపట్టాలని ఆయన కోరారు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్స్ బదిలీల ప్రక్రియను వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని, బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని నియమించాలని, బదిలీల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.