సర్కారు నెలకు 40 వేల జాబ్ ఆఫర్ ఇచ్చినా డాక్టర్లు ముందుకొస్తలేరు

సర్కారు నెలకు 40 వేల జాబ్ ఆఫర్ ఇచ్చినా డాక్టర్లు ముందుకొస్తలేరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏటా నాలుగైదు వేల మంది డాక్టర్లు తయారవుతున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇప్పటికీ ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీలే దిక్కవుతున్నారు. ప్రభుత్వ దవాఖాన్లు లేకపోవడం, ప్రైవేటు డాక్టర్లు పట్టణాలకే పరిమితం అవుతుండడంతో జనాలు ఇప్పటికీ అన్‌‌‌‌క్వాలిఫైడ్ డాక్టర్లనే ఆశ్రయించాల్సి వస్తోంది. వీరు తక్షణ రిలీఫ్‌‌‌‌గా స్టెరాయిడ్లు, అడ్డగోలుగా యాంటీబయాటిక్స్ ఇస్తుండడంతో దీర్ఘకాలంలో జనాల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. గ్రామాల్లోకి డాక్టర్లు వచ్చి క్లినిక్‌‌‌‌లు పెట్టడం, స్థానికంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటే తప్ప ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేదు. ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీల క్లినిక్‌‌‌‌లను పూర్తిగా బంద్‌‌‌‌ పెట్టాలని డిమాండ్ చేసే డాక్టర్లు, గ్రామాల్లోకి రాకపోవడంతో సమస్య దశాబ్దాలుగా అలాగే ఉండిపోతోంది.

30 వేల జనాభాకు ఒక పీహెచ్ సీ కూడా లేదు
ప్రస్తుతం రాష్ట్రంలో సగటున కనీసం 30 వేల జనా భాకు ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా లేదు. మండలానికి ఒక పీహెచ్‌‌‌‌సీ మాత్రమే ఉండగా, అందులో సగానికి పైగా ఉదయం 9 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నానికి బంద్ అయ్యేవే ఉన్నాయి. ఆ పీహెచ్‌‌‌‌సీలలో డాక్టర్లు అందుబాటులో ఉండకపోవడంతో వాటిపై జనాలకు నమ్మకం పోయింది. పల్లె దవాఖాన్ల పేరిట ఇప్పుడిప్పుడే దవాఖాన్ల సంఖ్యను ప్రభుత్వం పెంచే ప్రయత్నం చేస్తున్నది. అయితే పర్మినెంట్ జాబ్ కాకపోవడం,  నెలకు రూ.40 వేలు మాత్రమే చెల్లిస్తామని సర్కార్ చెప్పడంతో, పల్లె దవాఖాన్లలో పనిచేసేందుకు డాక్టర్లు ముందుకు రావడం లేదు. ఇప్పటికే ఉన్న పీహెచ్‌‌‌‌సీలలో కూడా సుమారు 800 మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముగ్గురు, నలుగురు డాక్టర్లు ఉండాల్సిన 24 గంటల పీహెచ్‌‌‌‌సీలలో, ఒకరిద్దరితోనే నెట్టుకొస్తున్నారు.

30 వేల మంది ఉన్నా నిరాశే
సర్కారీ వైద్యం అందకపోవడంతో జనాలకు సుస్తీ చేస్తే ప్రైవేటు వైద్యం వైపు వెళ్తున్నారు. ప్రైవేటంటే ఎంబీబీఎస్‌‌‌‌లు, ఎండీలు చదువుకున్న డాక్టర్లు ఏం కాదు. పదో, పన్నెండో చదివి డాక్టర్ అవతారం ఎత్తిన ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీల వద్దకు వెళ్తున్నారు. ఎంబీబీఎస్‌‌‌‌, ఎండీలు చదివిన అసలు డాక్టర్లు మండల కేంద్రాల్లో కూడా అందుబాటులో ఉండడం లేదు. ఇప్పటికీ అర్బన్ ఏరియాలకే క్వాలిఫైడ్ డాక్టర్లు పరిమితం అవుతున్నారు. రాష్ట్రంలో సుమారు 30 వేల మంది క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారు. వారిలో 5 వేల మంది మాత్రమే ప్రభుత్వ దవాఖాన్లలో పనిచేస్తుండగా, మిగిలిన వాళ్లంతా ప్రైవేటు సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. ఇందులో 90 శాతం మంది అర్బన్ ఏరియాల్లోనే పనిచేస్తున్నారు. 

ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీలకు డాక్టర్ల వత్తాసు
అర్బన్ ఏరియాల్లో ఉండే ప్రైవేటు హాస్పిటళ్ల యాజమాన్యాలు, డాక్టర్లు ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీలకు వత్తాసు పలుకుతున్నారు. పేషెంట్లను తమ హాస్పిటళ్లకు రిఫర్ చేయాలని పెద్ద ఎత్తున కమిషన్లు ఇస్తున్నారు. గిఫ్ట్‌‌‌‌లు ఇవ్వడం, టూర్లకు తీసుకెళ్లడం, ప్రభుత్వ ఆఫీసర్లను మేనేజ్ చేసి ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీలకు ఇబ్బంది కలగకుండా చూడడం వంటివన్నీ చేస్తున్నారు. మరోవైపు, ఫార్మా కంపెనీలు సైతం ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీలతో కోట్లలో బిజినెస్ చేయిస్తున్నయి. మందుల స్ట్రిప్‌‌‌‌ మీద ఎంఆర్‌‌‌‌‌‌‌‌పీ ఇష్టారీతిన ముద్రించి, అడ్డగోలుగా మార్జిన్ ఇచ్చే కంపెనీల మందులనే ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీలు జనాలకు అంటగడుతున్నారు. రాష్ట్రంలో సుమారు 40 వేల మంది వరకూ ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీలు ఉండడంతో, వారంతా ఓటు బ్యాంకుగా మారిపోయారు. దీంతో ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా, ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీల జోలికి వెళ్లే ప్రయత్నం 
చేయడం లేదు.