వేలానికి దొడ్డు బియ్యం రెడీ!..రేషన్షాపులు.. గౌడౌన్లోనే స్టాక్స్

వేలానికి దొడ్డు బియ్యం రెడీ!..రేషన్షాపులు.. గౌడౌన్లోనే స్టాక్స్
  • పురుగు పడుతున్న బియ్యం
  • కమిషరేట్​కు ఆఫీసర్ల లెటర్​
  • త్వరలోనే టెండర్ ఆర్డర్స్​

యాదాద్రి, వెలుగు :  దొడ్డు బియ్యం వేలం వేయడానికి రంగం సిద్ధమవుతోంది. వేలానికి త్వరలోనే ఆర్డర్స్ వెలువడనున్నాయి. దీంతో రేషన్​షాపులు, బఫర్​గోడౌన్స్​లోని బియ్యం స్టాక్​లెక్కలు తేల్చారు. 

జిల్లాలో 1635 టన్నులు..

కాంగ్రెస్​ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్​కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం ఇస్తోంది. దీంతో గతంలో జిల్లాకు అలాట్ అయిన దొడ్డు బియ్యం రేషన్​షాపులు, బఫర్ గోడౌన్లలోని బియ్యం నిల్వలు అలానే ఉండిపోయాయి. దీంతో బియ్యం స్టాక్​ వివరాలను హయ్యర్​ ఆఫీసర్లకు సివిల్​సప్లయ్​డిపార్ట్​మెంట్​అధికారులు పంపించారు. రేషన్​షాపుల్లో 1100 టన్నుల దొడ్డు బియ్యం ఉండగా, ఎంఎల్​ఎస్​పాయింట్లలో 185 టన్నులు, బఫర్​గోడౌన్లలో 350 టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయని లెక్కల్లో తేల్చారు. 

దొడ్డు బియ్యం విలువ రూ.5.88 కోట్లు..

ప్రభుత్వ లెక్కల ప్రకారం నిల్వ ఉన్న దొడ్డు బియ్యం విలువ రూ.5.88 కోట్లు ఉంటుంది. జిల్లాఫీసర్లు లెటర్లు రాసిన తర్వాత బియ్యం నిల్వలను టెండర్​వేసే విషయంలో హయ్యర్ ఆఫీసర్లు చర్చిస్తున్నారని తెలుస్తోంది. టెండర్ వేసిన పక్షంలో కోళ్లకు దాణాగా ఉపయోగించడానికి ఫౌల్ట్రీ ఫారాల యజమానులు, లిక్కర్​ కంపెనీల యజమానులు పాల్గొనే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు.

బియ్యానికి పురుగు..

మూడు నెలల బియ్యం ఒకేసారి ఇవ్వడంతో రెండు నెలలుగా రేషన్​షాపులను మూసి వేశారు. దీంతో షాపుల్లో ఉన్న దొడ్డు బియ్యానికి లక్క పురుగు, తెల్ల పురుగు సోకింది. లక్క పురుగు సోకినా నష్టం తక్కువే కానీ తెల్ల పురుగు సోకితే మాత్రం.. అది గింజను తినేసి డొల్లగా మారుస్తోంది. 

ఈనెల ఖాళీ చేయాల్సిందే..

జూన్​నుంచి ఆగస్టు వరకు ఒకేసారి సన్నబియ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్​లో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. కార్డులు పెరగడంతో షాపులకు ఈసారి స్టాక్​ కూడా ఎక్కువగా పంపించాల్సి వస్తుంది. ఈ పరిణామంతో రేషన్ షాపుల్లోని దొడ్డు బియ్యాన్ని కచ్చితంగా తరలించాల్సి ఉంటుంది. లేకుంటే షాపుల్లో పూర్తి స్థాయిలో బియ్యం స్టాక్​దించలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతోపాటు దొడ్డు బియ్యానికి పట్టిన పురుగు.. సన్న బియ్యానికి కూడా పట్టే ప్రమాదం ఉంది.

ఈ పరిణామాల నేపథ్యంలో దొడ్డు బియ్యం వేలం వేయడానికి హయ్యర్ ఆఫీసర్లు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. గతంలో 2022–-23 యాసంగి వడ్లను టెండర్ వేసినట్టుగానే రాష్ట్రస్థాయిలో ఒకేసారి టెండర్​నోటిఫికేషన్​విడుదల చేస్తారు. దీనికి సంబంధించి త్వరలోనే ఆర్డర్స్​ వచ్చే అవకాశం ఉందని ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు.