రక్తదానం చేసి మరో కుక్క ప్రాణం కాపాడిన చార్లీ

రక్తదానం చేసి మరో కుక్క ప్రాణం కాపాడిన చార్లీ

రక్తదానం మనుషులే కాదు మేమూ చేస్తాం అంటోంది కర్నాటకలోని చార్లీ అనే కుక్క. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో కుక్కకి రక్తం ఇచ్చి కాపాడిన చార్లీ.. ఇప్పటికే రెండుసార్లు రక్తదానం చేసింది. సాటి కుక్కలను కాపాడడంలో నేను ముందుంటానంటోంది. కర్నాటకలోని హుబ్బల్లి ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లో సెక్యూరిటీ డాగ్‌‌గా పనిచేస్తున్న ‘మాయ’ అనే  బెల్జియన్​ షెపర్డ్‌‌కు ‘ఎర్లిచియా’ అనే బ్యాక్టీరియల్ డిసీజ్ వచ్చింది. దాంతో అది జ్వరం వచ్చి పడిపోయింది. దగ్గర్లోని వెటర్నరీ హాస్పిటల్‌‌కు తీసుకెళ్తే ‘రక్తం ఎక్కించాలి’ అని చెప్పారు. 

అయితే కుక్కల్లో ఎనిమిది రకాల బ్లడ్ గ్రూపులుంటాయి. మాయాకు సరిపోయే బ్లడ్ ఎక్కడ దొరుకుతుందా? అని వెతికే పనిలో పడ్డారు ఎయిర్‌‌‌‌పోర్ట్ అధికారులు. ఇంతలోనే దగ్గర్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ‘క్రిషి మేలా’ అనే డాగ్ షో జరుగుతోందని తెలిసింది. అక్కడకు వందల సంఖ్యలో కుక్కలు వస్తాయి. ఎనిమిదేళ్ల చార్లీని కూడా ఆ షోకు తీసుకొచ్చారు. ఎయిర్‌‌‌‌పోర్ట్ స్టాఫ్ ఆ డాగ్ షోకు వెళ్లి  ‘రక్తదానం చేసే కుక్క కావాలి’ అని అడిగారు. అక్కడే ఉన్న  సోమశేఖర్ ‘నా చార్లీ రెడీగా ఉంది’ అని చెప్పాడు. ఎందుకంటే చార్లీతో గతంలో కూడా బ్లడ్ డొనేట్ చేయించాడు.

యాక్సిడెంట్ అయి ప్రాణాలు కోల్పోయే స్టేజ్‌‌లోఉన్న ఒక రాట్‌‌వీలర్‌‌‌‌ను రక్తం ఇచ్చి కాపాడింది చార్లీ. ఇంకేముంది చార్లీని తీసుకెళ్లి బెడ్‌‌పై పడుకోబెట్టారు. చార్లీ బ్లడ్ గ్రూప్, మాయ బ్లడ్ గ్రూప్‌‌తో మ్యాచ్ అయింది.  హిమోగ్లోబిన్ కౌంట్ 7.3 కి పడిపోయి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న మాయకు తన రక్తం ఇచ్చి కాపాడింది. దాంతో రెండు రోజుల్లో ‘మాయ’ డిశ్చార్జ్ అయింది. ఎప్పటిలాగానే ఎయిర్‌‌‌‌ పోర్ట్‌‌కు వెళ్లి బాంబులు, డ్రగ్స్‌‌ను వెతికే పనిలో పడింది.