ప్లాస్టిక్​ వేస్ట్​తో డాగ్​ హోమ్​

ప్లాస్టిక్​ వేస్ట్​తో డాగ్​ హోమ్​

స్ట్రీట్​ డాగ్స్​ కోసం ‘ఎకో బ్రిక్స్’ షెల్టర్​ హోమ్స్ కడుతున్నారు ముంబై టీనేజర్స్​. ప్లాస్టిక్ వేస్ట్​తో  నిర్మించిన ఈ హోమ్స్​లో వీధి కుక్కలు వెచ్చగా బజ్జుంటున్నాయి. 

ఈ టీనేజర్స్​ అంతా నవీ ముంబై వాసులు. ఆ వయసు వాళ్లలా ఫ్రెండ్స్​తో జాలీగా ఎంజాయ్​ చేయడమే కాకుండా సేవకి కూడా  సై అంటున్నారు.‘ఉర్వరి’ అనే ఎన్జీవోలో వలంటీర్లు వీళ్లంతా. కిందటి ఏడాది ‘ప్లాస్టిక్ ఫ్రీ జూలై’ సందర్భంగా  ప్లాస్టిక్​ వేస్ట్​తో వీధి కుక్కలకి షెల్టర్​ హోం నిర్మించాలనే ఆలోచన వచ్చింది. వానలో తడుస్తూ, వీధికుక్కలు వణుకుతుండడం చూశారు. వాటికంటూ ఒక చోటు ఉంటే వానలోనూ అవి  వెచ్చగా, హాయిగా ఉంటాయి కదా! అనిపించింది. ఆ ఆలోచన రాగానే ప్లాస్టిక్ బాటిళ్లు, కూల్ డ్రింక్​ బాటిళ్లు సేకరించారు. వాటిలో చిప్స్​ ప్యాకెట్​ కవర్లు, ర్యాపర్లని టైట్​గా నింపుతారు. చుట్టూరా రెండు వరుసల మెష్, మధ్యలో ప్లాస్టిక్​ బాటిళ్లు వరుసగా ఉండే ఈ  షెల్టర్​ హోమ్స్​ 4.5, 3.5, 3.5 కొలతలో ఉంటుంది. ఒక షెల్టర్​ హోమ్​ కోసం150 ప్లాస్టిక్​ బాటిళ్లు వాడతారు. ఇది దాదాపు నలభై కిలోల ప్లాస్టిక్​ వేస్ట్​కి సమానం. 

‘ఉర్వరి’ సంస్థని 2016లో గుప్తే, ఆమె ఫ్రెండ్ ఖుషీ షా మొదలుపెట్టారు. అదే టైంలో  అమెజాన్​ అడవుల్లో కార్చిచ్చు వ్యాపించింది. ఆ వార్తలు చూసి పర్యావరణాన్ని కాపాడడం కోసం ఏదైనా చేయాలి అనుకున్నారు. ప్రతివారం అయిదు మొక్కలు నాటడం,  ప్లాస్టిక్​ వేస్ట్​ని సేకరించడం వంటివి చేసేవాళ్లు. మొదట్లో ప్లాస్టిక్​ వేస్ట్​ని రీసైక్లింగ్​కి ఇచ్చేవాళ్లు. తర్వాత వీళ్లకి ‘ఎకో బ్రిక్’ ఐడియా వచ్చింది. ఇద్దరితో మొదలైన ఈ సంస్థలో ఇప్పుడు 200 మంది వలంటీర్లు ఉన్నారు. వీళ్లలో ఎక్కువ మంది పదిహేడు నుంచి పద్దెనిమిది యేళ్ల లోపు వాళ్లే. ‘‘ఇది ఒక యాంబీషియస్​ ప్రాజెక్ట్. ఎకోబ్రిక్​ షెల్టర్​హోమ్​ గురించి వివరించే  వీడియోలు యూట్యూబ్​లో కూడా లేవు. దాంతో, మేమే ఒక డిజైన్​ అనుకున్నాం. ఈ  షెల్టర్​ హోమ్స్​ని వీధి కుక్కలు ఎక్కువగా ఉండే చోట  పెడతాం” అని చెబుతోంది ‘ఉర్వరి’ కో–ఫౌండర్​ వసుంధర గుప్తే.

పదేళ్ల కిందట ఆస్ట్రేలియాకు చెందిన రెబెక్కా ప్రిన్స్ రుయిజ్​ ‘ప్లాస్టిక్​ ఫ్రీ జూలై’ క్యాంపెయిన్​ మొదలుపెట్టింది. ఒకసారి మాత్రమే వాడిపడేసే ప్లాస్టిక్​కి నో చెప్పడం, ఎకోఫ్రెండ్లీ జీవనశైలిని పాటించడం ఈ క్యాంపెయిన్​ థీమ్. ప్రపంచవ్యాప్తంగా చాలామంది యంగ్​స్టర్స్ ఆమెని ఇన్​స్పిరేషన్​గా తీసుకున్నారు. ప్లాస్టిక్​ వేస్ట్​కి కొత్త అర్థం చెబుతూ పర్యావరణాన్ని కాపాడుతున్నారు.