వరంగల్‌‌‌‌ సిటీలో గుంపులు గుంపులుగా తిరుగుతున్న కుక్కలు

వరంగల్‌‌‌‌ సిటీలో గుంపులు గుంపులుగా తిరుగుతున్న కుక్కలు
  • ప్రతి రోజు పదుల సంఖ్యలో కుక్కకాటు బాధితులు
  • స్టెరిలైజేషన్‌‌‌‌ పేరుతో ఇప్పటివరకు రూ. 2.5 కోట్లు ఖర్చు

హనుమకొండ, వెలుగు : వరంగల్‌‌‌‌లో కుక్కల బెడద తగ్గించేందుకు ప్రతి సంవత్సరం కోట్లు ఖర్చు చేస్తున్నా.. ప్రజలకు మాత్రం కుక్క కాట్లు తప్పడం లేదు. నగరంలో ఏ గల్లీలో చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడులు చేస్తున్నాయి. నిత్యం ఎక్కడో చోట కుక్కలు దాడి చేయడం జరుగుతూనే ఉంది. సగటున నెలకు 600 మంది కుక్కకాటుతో ఎంజీఎంకు పరుగులు తీస్తున్నారు. గురువారం ఒక్క రోజే హనుమకొండ రెడ్డి కాలనీలో 35 మంది కుక్కకాటుకు గురయ్యారు. సాధారణ, చర్మవ్యాధులు ఉన్న కుక్కలను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన ఆఫీసర్లు నిర్లక్ష్యం చేయడం వల్లే రోజురోజుకు బాధితులు పెరిగిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఒక్కో డివిజన్‌‌‌‌లో వేలల్లో...

గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌ పరిధిలోని 66 డివిజన్లలో మొత్తం 70 వేల వరకు కుక్కలు ఉన్నట్లు గతంలో ఆఫీసర్లు గుర్తించారు. కానీ ప్రస్తుతం 22 వేలు మాత్రమే ఉన్నాయని ఆఫీసర్లు చెబుతుండగా, ఇప్పటివరకు స్టెరిలైజేషన్‌‌‌‌ పూర్తైనవే 30 వేలకు పైగా ఉన్నాయి. దీంతో అసలు నగరంలో ఎన్ని కుక్కలు ఉన్నాయో ఆఫీసర్ల వద్దే సరైన సమాచారం లేకుండా పోయింది. ఒక్కో డివిజన్‌‌‌‌లో సుమారు వెయ్యి వరకు కుక్కలు ఉన్నాయని స్థానికులు చెబుతుండగా, ఇందులో 30 నుంచి 40 శాతం వరకు వివిధ రకాల వ్యాధులు సోకినవే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. చెత్తకుప్పలు పేరుకుపోవడం, చికెన్‌‌‌‌, మటన్‌‌‌‌ వ్యర్థాలను తినడం వల్లే కుక్కలు వ్యాధుల బారిన పడుతున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఇలాంటి వాటిని పట్టుకొని ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌, స్టెరిలైజేషన్‌‌‌‌ చేయించాల్సిన ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. అంతేగాకుండా ఇన్‌‌‌‌ఫెక్షన్‌‌‌‌ ఉన్న వాటికి, లేని వాటికి ఒకే చోట స్టెరిలైజేషన్‌‌‌‌ చేపట్టడం వల్ల రోగాల బారిన పడుతున్న కుక్కల సంఖ్య పెరిగిపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

రూ.కోట్లు ఖర్చు చేసినా వృథానే..

వరంగల్‌‌‌‌ నగరంలో కుక్కల నియంత్రణకు చింతగట్టు క్యాంప్‌‌‌‌ సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్‌‌‌‌ పక్కన 2018లో యానిమల్‌‌‌‌ బర్త్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. అప్పటినుంచి 30 వేల కుక్కలకు స్టెరిలైజేషన్‌‌‌‌ పూర్తి చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ స్టెరిలైజేషన్‌‌‌‌ ప్రక్రియ చేపట్టే పనిని బల్ది యా ఓ ప్రైవేట్‌‌‌‌ ఏజెన్సీకి అప్పగించింది. కుక్కలను పట్టుకొచ్చిన మొదటి రోజు అబ్జర్వేషన్, రెండో రోజు స్టెరిలైజేషన్‌‌‌‌, మూడో రోజు రేబిస్ వ్యాక్సిన్‌‌‌‌ వేయాల్సి ఉంటుంది. ఇలా ఒక రోజు 25 నుంచి 30 కుక్కలకు స్టెరిలైజేషన్‌‌‌‌ చేస్తుంటారు. అయితే ఈ సెంటర్‌‌‌‌లో కుక్కలు ఉన్నన్ని రోజులు వాటికి ఆహారం, సర్జరీ, సిబ్బంది వేతనాలు అన్నీ కలిపి ఒక్కో కుక్కకు దాదా పు రూ.800 చొప్పున బల్దియా సదరు ఏజెన్సీకి చెల్లిస్తోంది. గత ఐదేండ్లలో 30,719 కుక్కలకు స్టెరిలైజేషన్‌‌‌‌ చేయగా.. దాదాపు రూ.2.5 కోట్లు చెల్లించారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేసినా కుక్కల సంఖ్యను నియంత్రించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. స్టెరిలైజేషన్‌‌‌‌ చేసిన కుక్కలనే మళ్లీ మళ్లీ తీసుకెళ్తూ నిధులను గాయబ్‌‌‌‌ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ రెడీ చేస్తున్నాం 

కుక్కకాటుకు సంబంధించి ప్రతి రోజు 10 నుంచి 20 కాల్స్‌‌‌‌ వస్తున్నాయి. ఈ మధ్య కుక్కల దాడులు పెరగడంతో వాటి నియంత్రణకు ప్రత్యేకంగా యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ రెడీ చేస్తున్నాం. ఇప్పటికే ఒక ఏబీసీ సెంటర్‌‌‌‌ ఉండగా మరో ఏబీసీ సెంటర్‌‌‌‌ కోసం ప్రపోజల్స్‌‌‌‌ పంపించాం. స్టెరిలైజేషన్‌‌‌‌ చేపట్టి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. 
- మల్లం రాజేశ్, సీఎంహెచ్‌‌‌‌వో, జీడబ్ల్యూఎంసీ

కుక్కకాటుతో తాపీ కార్మికుడి మృతి

మహబూబాబాద్‌‌‌‌ అర్బన్‌‌‌‌, వెలుగు: కుక్క కాటుతో ఓ తాపీ కార్మికుడు చనిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్‌‌‌‌ మండలం దర్గా తండాలో శుక్రవారం వెలుగు చూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ధరావత్‌‌‌‌ సోమ్లా (40) ఈ నెల 24న గ్రామంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ టైంలో కుక్క కరవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే మహబూబాబాద్‌‌‌‌ హాస్పి టల్‌‌‌‌కు తరలించి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అనంతరం ఇంటికి తీసుకొచ్చారు. అయితే గురువారం రాత్రి అస్వస్థతతో ఇంట్లోనే చనిపోయాడు.