బ్రేకింగ్: కరోనాకు కొత్త పేరు పెట్టిన ట్రంప్

బ్రేకింగ్: కరోనాకు కొత్త పేరు పెట్టిన ట్రంప్

వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి చైనానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు విమర్శించారు. ఈ వ్యాధికి ‘కుంగ్ ఫ్లూ’గా ట్రంప్ కొత్త పేరు పెట్టారు. సెంట్రల్ చైనా సిటీ అయిన వూహాన్‌లో కరోనా పుట్టిందని భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు మార్లు డ్రాగన్ కంట్రీపై అమెరికా ప్రెసిడెంట్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. అలాగే వైరస్‌కు దాని పుట్టుకకు సంబంధించిన పేరుగా ‘వూహాన్ వైరస్‌’ అని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్ గతంలో పేరు పెట్టారు.

ఓక్లహామాలోని టల్సాలో శనివారం నిర్వహించిన మొదటి ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ ఈ సందర్భంగా మాట్లాడారు. ‘నేను దానికి (కరోనాకు) కుంగ్ ఫ్లూ అని పేరు పెట్టా. మరో 19 రకాల వైవిధ్యమైన పేర్లను నేను పెట్టగలను. దానిని చాలా మంది వైరస్ అంటారు. కానీ అది ఏ వైరస్? ఇంకొందరు దాన్ని ఫ్లూ అంటారు. దాంట్లో తేడా ఏంటి? నాకు తెలిసి మనం 19 నుంచి 20 రకాల పేర్లు పెట్టుకున్నాం’ అని ట్రంప్ చెప్పారు. చైనాలో కుంగ్ ఫూ అనే మార్షల్ ఆర్ట్స్ చాలా ఫేమస్ అన్న విషయం తెలిసిందే. దాని పేరు మీదే చైనాను దెప్పి పొడచడానికే కుంగ్ ఫ్లూ అనే పేరును ట్రంప్ పెట్టారని ఊహించొచ్చు. కాగా, జాన్స్ హాప్కిన్స్ కరోనా వైరస్ రీసోర్స్ సెంటర్ ప్రకారం.. మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 4.50 లక్షల మంది చనిపోయారని సమాచారం.