
- ఆ రెండు దేశాలే మాట్లాడుకొని పంచాదీ తెంపుకున్నయని వెల్లడి
- తానే ఆపినట్లు గతంలో వరుసగా కామెంట్లు, ట్వీట్లు
- పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌కు ట్రంప్ విందు
- వైట్‌హౌస్‌లో ఇద్దరి మధ్య ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై చర్చ
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు వరుసగా కామెంట్లు, ట్వీట్లు చేస్తూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా మాట మార్చేశారు. ఆ రెండు దేశాల వాళ్లే మాట్లాడుకొని ఉద్రిక్తతలు తగ్గించుకున్నారని ఆయన ప్రకటించారు. ‘‘భారత్, పాకిస్తాన్ నాయకులు చాలా తెలివైనవాళ్లు. గత నెలలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అణు యుద్ధంగా మారే ప్రమాదం ఉందని భావించి వాళ్లే సమస్యను పరిష్కరించుకున్నారు. ఇందులో మా ప్రమేయం లేదు” అని చెప్పారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌కు వైట్‌హౌస్‌లో ట్రంప్ బుధవారం విందు ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత.. పాకిస్తాన్‌పై భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. అనంతరం కొన్నిరోజులకు ఇరుదేశాలు సీజ్‌ఫైర్‌కు అంగీకరించాయి. అయితే.. తానే ఇరుదేశాల మధ్య సీజ్ఫైర్ ఒప్పందాన్ని కుదిర్చినట్లు, లేకపోతే పెద్ద ముప్పు వాటిల్లేదంటూ ట్రంప్ పదే పదే చెప్పారు. ఈ క్రమంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ.. ట్రంప్‌కు ఫోన్ చేసి ‘‘ఇండియా, పాకిస్తాన్ అంశాల్లో ఎవరి మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోం. సీజ్ఫైర్ విషయంలో మీ ప్రమేయం లేదు” అని తేల్చిచెప్పారు. ఆ వెంటనే ట్రంప్.. మళ్లీ పాత పాటనే అందుకున్నారు. తానే యుద్ధాన్ని ఆపానంటూ.. పైగా ‘ఐ లవ్యూ పాకిస్తాన్’ అని కామెంట్ చేశారు. మళ్లీ 24 గంటలు గడవకముందే.. ట్రంప్ మాట మార్చారు.
మునీర్‌ను కలవడం గౌరవంగా ఉంది
పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌తో విందు భోజనం గౌరవంగా ఉందని ట్రంప్ అన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై మునీర్‌తో చర్చించానని చెప్పారు. ఇరాన్‌లోని టెహ్రాన్‌పై అమెరికా ఏ క్షణమైనా దాడికి దిగొచ్చన్న కథనాల నేపథ్యంలో ట్రంప్, మునీర్ భేటీ చర్చనీయాంశమైంది. ‘‘భారత్, పాకిస్తాన్ రెండు దేశాలతో మాకు మంచి ట్రేడ్ డీల్ ఉంది. సత్సంబంధాలు ఉన్నాయి” అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, పాకిస్తాన్‌కు రావాలని ట్రంప్‌కు మునీర్ ఆహ్వానం పలికారు. మునీర్ వెంట పాక్ జాతీయ భద్రతా సలహాదారు మాలిక్, ఐఎస్ఐ చీఫ్ కూడా ఉన్నారు. అధ్యక్షుడి స్థాయి నేతలకు మాత్రమే అమెరికా అధ్యక్షుడితో వైట్ హౌస్‌లో విందు భోజనం ఏర్పాటు చేస్తుంటారు. కానీ, ఓ దేశానికి చెందిన ఆర్మీ చీఫ్‌కు ఇలాంటి మర్యాద లభించడం చాలా అరుదు. పాకిస్తాన్‌ను అడ్డాగా చేసుకొని ఇరాన్‌పై అమెరికా దాడి చేయాలనుకుంటున్నదని, అందులో భాగంగానే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు వైట్‌హౌస్‌లో ఈ రాచమర్యాదలన్న కథనాలు వస్తున్నాయి.