ఈ సీజన్​లో ఇవి తినొద్దు!

ఈ సీజన్​లో  ఇవి తినొద్దు!

 వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ వేడివేడి పకోడీలు, బజ్జీలు తినడం ఎవరికి ఇష్టం ఉండదు. ఇవి చాలామందికి మాన్​సూన్​ ఫేవరెట్స్​. కానీ, వానాకాలం ఇవి​ అస్సలు తినకూడదు. వీటివల్ల చాలా అనారోగ్య సమస్యలొస్తాయి. ఇవే కాదు వానాకాలం తినకూడని పదార్థాలు ఇంకా చాలానే ఉన్నాయి. మరి అవేంటో.. ఎందుకు తినకూడదో చూద్దాం..
పకోడీ-,బజ్జీ
వాతావరణం చల్లబడ్డప్పుడు వేడి వేడి పకోడీలు, బజ్జీలు తినకుండా ఉండలేరు చాలామంది. కానీ, వీటిని ఎక్కువగా తినకూడదు. ఈ సీజన్​లో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డీప్​ ఫ్రై చేసిన పదార్థాలు తింటే దగ్గు, ఎసిడిటీలాంటి సమస్యలు వస్తాయి. అందుకని ఈ సీజన్​లో బజ్జీలు, పకోడీలు ఎక్కువగా తినకూడదు. నాన్​వెజ్​ ఐటమ్స్​ కూడా మితంగా తినాలి. మోతాదు మించితే జీర్ణక్రియ మీద భారం పడి చాలా సమస్యలొస్తాయి.
సలాడ్స్​
చాలామంది సలాడ్స్​ని ఇష్టంగా తింటుంటారు. కానీ, వర్షాకాలంలో గాలిలో తేమ ఉండటం వల్ల సూక్ష్మజీవులు వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. పండ్లు, కూరగాయ ముక్కల్ని కోసి పెడితే తేమ వల్ల క్రిములు వాటిమీదకు చేరే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సీజన్​లో సలాడ్స్​ తినాలనుకుంటే అప్పటికప్పుడు కోసుకుని తినాలి.
సీ ఫుడ్​
వర్షాకాలంలో చెరువులు, నదులు ఎక్కువగా కలుషితమవుతాయి. చేపలను బాగా కడిగినప్పటికీ .. మలినాలు అంత సులభంగా పోవు. వాటిని తింటే టైఫాయిడ్, జాండిస్, డయేరియా వంటివి వచ్చే ప్రమాదముంది. వీటివల్ల ఊపిరికి, గుండెకు సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. చేపల్లో ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో బలహీనంగా ఉండే మన జీర్ణవ్యవస్థపై ఇవి ఎక్కువ ప్రభావం చూపుతాయి. అందుకే వర్షాకాలంలో చేపలు తినకపోవడమే మంచిది.
స్పైసీ ఫుడ్
ఈ సీజన్​లో అలర్జీలు కూడా ఎక్కువగానే వేధిస్తుంటాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కూరల్లో కాస్త కారం తగ్గించాలి.. కారం ఫుడ్​కి దూరంగా ఉండాలి. ఒకవేళ అలాకానీ చేయలేదంటే శరీర టెంపరేచర్​ పెరిగి రక్త ప్రసరణ వేగవంతమవుతుంది. దీనివల్ల అలర్జీలు శరీరం అంతటా త్వరగా వ్యాపిస్తాయి. అందుకే అలర్జీలకు ఎక్కువగా గురయ్యే వాళ్లు కారం తగ్గించాలి.
పాలు
పాలు ఆరోగ్యానికి మంచివే. అయితే వాతావరణం కూల్‌‌‌‌‌‌‌‌గా ఉన్నప్పుడు పాలు ఎక్కువగా తీసుకోకూడదు. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండి జీర్ణశక్తి మందగిస్తుంది. అందుకే ఈ కాలం ఎక్కువగా పాలు తాగకూడదు. ఒకవేళ రోజుకొక గ్లాసు పాలు తీసుకోవాలనుకుంటే అందులో చిటికెడు పసుపు వేసుకునే తాగాలి.
పెరుగు
అలర్జీ, జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, మైగ్రేన్‌‌‌‌‌‌‌‌ తలనొప్పి, సైనసైటిస్‌‌‌‌‌‌‌‌.. లాంటి సమస్యలున్న వాళ్లు ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో పెరుగు తింటే సమస్య మరింత పెరుగుతుంది. అలాంటి సమస్యలున్న వాళ్లు చల్లటి పదార్థాల జోలికి వెళ్లకపోవడం మంచిది. పాల ఉత్పత్తులు, ఐస్‌‌‌‌‌‌‌‌క్రీమ్స్‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉండటం ఉత్తమం. ఒక్కోసారి పెరుగు తినడం వల్ల చలువ పెరిగి జలుబుచేస్తుంది. అది తలనొప్పిగా మారి ఇబ్బందిపెడుతుంది.
మామిడి
వేసవి ముగిసిందంటే మామిడి సీజన్‌‌‌‌‌‌‌‌అయిపోయినట్లే! అయితే వర్షాకాలంలోనూ మామిడి పండ్లు దొరుకుతున్నాయి. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో వాటిని తినడం మంచిది కాదు. పండ్లలో పురుగులు ఉండే ప్రమాదం ఉంది. అలాంటివి తింటే గ్యాస్ట్రిక్​ సమస్యలు వస్తాయి.
పానీపూరి
ఎక్కడ పడితే అక్కడ నీటిని తాగడం మంచిది కాదు. రోడ్డు పక్కనున్న పానీపూరి బండి మీద కూడా తినడం అంత మంచిది కాదు. పానీ కలిపేటప్పుడు శుభ్రంగా ఉండకపోవచ్చు. దానివల్ల కడుపులో గడబిడ మొదలైతే… ఆ తిప్పలు తలుచుకుంటే పానీపూరికి దూరంగా ఉంటారు.
మితమే హితం
వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల తిన్నది జీర్ణమవటానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఆహారం కొద్ది మొత్తంలో తీసుకోవటం మంచిది.

ఇవి తినాలి

  • పప్పుధాన్యాలు, తృణధాన్యాలలో మినరల్స్​ ఎక్కువగా ఉంటాయి. రాగులు, సోయాబీన్‌‌‌‌‌‌‌‌, పెసలు, మొక్కజొన్న లాంటివి తినేవాటిలో భాగంగా చేసుకోవాలి. అప్పుడు బ్యాలెన్స్​డ్​ ఫుడ్​ శరీరానికి అందుతుంది.
  • చాలా త్వరగా ఇన్ఫెక్షన్లు సోకే సీజన్​ ఇది. అందుకని టీ, కాఫీలకు బదులు గ్రీన్‌‌‌‌‌‌‌‌, బ్లాక్‌‌‌‌‌‌‌‌, హెర్బల్‌‌‌‌‌‌‌‌ టీ లాంటివి తీసుకోవాలి. అల్లం, మిరియాలు, తేనె కలుపుకొని టీ తయారుచేసుకోవాలి. పుదీనా, తులసి ఆకులు కూడా కలిపితే మంచిది. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్‌‌‌‌‌‌‌‌, యాంటీ వైరల్‌‌‌‌‌‌‌‌ గుణాలుంటాయి.
  • శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్న కూరగాయలు, పళ్లను ఎక్కువగా తీసుకోవాలి. దానిమ్మ, యాపిల్‌‌‌‌‌‌‌‌, స్ట్రాబెర్రీ, అరటి లాంటి పండ్లను తీసుకోవాలి. పళ్లు, కూరగాయలు తినే ముందు తప్పనిసరిగా వాటిని శుభ్రంగా కడిగితే వాటిమీద ఉండే కెమికల్స్​, క్రిమికీటకాలు పోతాయి.