ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

గజ్వేల్, వెలుగు:  ‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన  కేసీఆర్ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలె.. మర్చిపోవద్దు’.. అని   రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. సీఎం నియోజకవర్గం గజ్వేల్​లోని మండలం తున్కిఖల్సా గ్రామంలో నిర్మించిన 98 డబుల్​ బెడ్రూం ఇండ్లను ఆదివారం ఆయన హోంమంత్రి మహమూద్​ అలీతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.  అనంతరం ఏర్పాటు చేసిన మీటింగ్​లో  మాట్లాడుతూ..  గతంలో ఎమ్మెల్యేలుగా  పనిచేసిన విజయరామారావు, గీతారెడ్డి, నర్సారెడ్డి ల హయాంలో గజ్వేల్​ప్రజల బతుకులు మారలేదని, సీఎం కేసీఆర్ 
వచ్చాక 70 ఏండ్లలో జరుగని అభివృద్ధి నియోజకవర్గంలో జరిగిందన్నారు.  ‘బీజేపీ నేతలకు మాటలెక్కువ.. చేతలు తక్కువ’ అని దేశంలో బీజేపీ  పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా తెలంగాణ లో ఉన్న సంక్షేమ పథకాలు లేవన్నారు.  ఈ కార్యక్రమంలో గడా స్పెషల్​ ఆఫీసర్​ ముత్యంరెడ్డి, అడిషనల్​కలెక్టర్​ విజయేందర్​రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు. 

ఏపీ, కర్నాటక కంటే మనమే బెటర్

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఎక్కడా జరగడం లేదని  మంత్రి హరీశ్​రావు చెప్పారు. ఇటీవల తాను ఏపీలో ప్రయాణిస్తుండగా.. ఓ చోట ఆగి కరెంటు సరఫరా ఎట్లుందని అడిగానని, అక్కడ పగలు 3గంటలు, రాత్రి 4 గంటలు మాత్రమే కరెంటు సరఫరా ఉంటుందని  చెప్పారన్నారు. అలాగే ఇటీవల  జహీరాబాద్​ నియోజకవర్గం కర్నాటక బార్డర్​విలేజీలో పర్యటిస్తుండగా.. అక్కడికి వచ్చిన కొందరు కర్నాటక వాసులను అడగగా ఆ రాష్ట్రంలో పింఛన్​రూ.500, రూ.600 మాత్రమే ఇస్తున్నట్లు చెప్పారన్నారు.

తెలంగాణ పోలీసింగ్​ దేశానికే ఆదర్శం: హోంమంత్రి మహమూద్​ అలీ మర్కూక్​ పోలీస్ కాంప్లెక్స్​ను  ప్రారంభించిన అనంతరం హోంమంత్రి మహమూద్​ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ  వస్తే అభివృద్ధి కుంటుపడుతుందని, నక్సలైట్లు పెరుగుతారని ఎంతో మంది అన్నారని, కానీ కేసీఆర్​ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలీసు శాఖను బలోపేతం చేసి  తెలంగాణ పోలీసింగ్​ను దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. మహిళల రక్షణకు  షీటీమ్స్, భరోసా సెంటర్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ పోలీసులు రాష్ట్ర, దేశ స్థాయిలో ఎన్నో రివార్డులు అవార్డులు పొందారన్నారు. డీజీపీ మహేందర్​రెడ్డి, జడ్పీ చైర్​పర్సన్​వేలేటి రోజా, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా, ఐజీ విక్రమ్​ సింగ్​ మాన్​, వెస్ట్ జోన్  ఐజీ కమల్​హాసన్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ ఎన్. శ్వేత, ఎమ్మెల్సీ యాదవరెడ్డి,  ఎఫ్డీసీ చైర్మన్​ ప్రతాప్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఏర్పాటుతో మెడికల్​ సీట్లు పెరిగినయ్

సిద్దిపేట, వెలుగు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయని, సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే ఇది సాధ్యమైందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని ఓ ప్రైవేట్​ఫంక్షన్​హాల్​లో  నీట్ స్టూడెంట్లకు అబ్దుల్ రబ్ ఆరీఫ్ మెడికల్ కౌన్సెలింగ్​ఎక్స్ పర్ట్​ఆధ్వర్యంలో నిర్వహించిన  గైడెన్స్ క్యాంపు కార్యక్రమానికి మంత్రి  హాజరై మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో మొత్తం 8వందల ఎంబీబీఎస్​ సీట్లుంటే ఎనిమిదేండ్లలో వాటి సంఖ్య 2,840 కి పెరిగిందని చెప్పారు. సిద్దిపేట మెడికల్ కాలేజీలో ఈ అకడమిక్​ఇయర్​నుంచి  పీజీ కోర్సుల్లో 50 సీట్లు వచ్చాయని వెల్లడించారు. అనంతరం సిద్దిపేట.. హనుమాన్​నగర్ లో బతుకమ్మ చీరలను మంత్రి పంపిణీ చేశారు. ఎన్జీవో భవన్​లో నిర్వహించిన బెస్ట్ టీచర్స్ అవార్డు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 

విద్యార్థి​ దశ నుంచే ఆటలపై ఆసక్తి పెంచుకోవాలి

పటాన్​చెరు/జిన్నారం, వెలుగు:   విద్యార్థి​దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. ఇస్నాపూర్ లోని గురుకుల స్కూల్​లో ఏర్పాటు చేసిన 8వ జోనల్ లెవెల్​ఆటల పోటీలను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేద పిల్లలకు కార్పొరేట్​స్థాయి విద్యనందించేందుకు సీఎం కేసీఆర్​ గురుకులాలను ప్రవేశపెట్టారన్నారు.  పేద పిల్లలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.  మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, సర్పంచ్ బాలమణి , కార్పొరేటర్​ కుమార్ యాదవ్  పాల్గొన్నారు.

ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ

పటాన్​చెరులోని సాకి చెరువు కట్టపై  తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే  మహిపాల్ రెడ్డి ఆదివారం భూమి పూజ చేశారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజెప్పాలన్న సమున్నత లక్ష్యంతో  విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.  

ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగుదాం

తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితో సీఎం  కేసీఆర్ రాష్ట్రం తెచ్చారని,  అదే స్ఫూర్తితో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండలం మంగంపేట, వావిలాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహాలను స్థానిక ప్రజాప్రతినిధులు, రజక సంఘం లీడర్లతో కలిసి ఆయన ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్​ లీడర్లు వెంకటేశ్​గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. 

జిల్లాలో యూపీఎస్సీ ఆఫీసర్ల పర్యటన

సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలో అమలవుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనం  చేసేందుకు యూపీఎస్సీ ట్రైనీ ఆఫీసర్లు ఆదివారం జిల్లాలో పర్యటించారు.  కలెక్టర్ డాక్టర్ శరత్,  అడిషనల్​కలెక్టర్ రాజర్షి షా,   జిల్లా అధికారులతో   సమావేశమయ్యారు. ‘సఖి’ సెంటర్​ను విజిట్​చేసి  అక్కడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిశు సంరక్షణ కేంద్రంలో పిల్లల వివరాలను ,పిల్లలకు అందించే ఆహార వివరాలను పరిశీలించారు. పర్యటనకు వచ్చిన వారిలో రజత్ బీటన్, గౌరవ్ డోగ్రా, హర్షివాణి సింగ్, కేదార్ నాథ్ శుక్లా,  సులోచన మీనా, ఉత్కర్ష్ ద్వివేది ఉన్నారు. ఈ కార్యక్రమంలో  డీఆర్డీవో శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఏపీడీ రాజు  తదితరులు ఉన్నారు.

చదువులతో పాటు ఆటలకు ప్రాధాన్యమివ్వాలి

గజ్వేల్​, వెలుగు: చదువులతో పాటు ఆటలకు ప్రాధాన్యమివ్వాలని, అప్పుడే విద్యార్థుల్లో  సంపూర్ణ వికాసం సాధ్యమవుతుందని సిద్దిపేట పోలీస్​ కమిషనర్​ శ్వేత అన్నారు. ఆదివారం వర్గల్​ నవోదయ విద్యాలయంలో జరిగిన రీజనల్ అథ్లెటిక్​ మీట్​ ముగింపు సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అలాగే  మూడు రోజులుగా జరుగుతున్న  హైదరాబాద్​రీజియన్​ (తెలంగాణ, ఏపీ, కర్నాటక, కేరళ, పాండిచ్చేరి)  నవోదయ విద్యాలయాల అథ్లెటిక్​ మీట్​ ఆదివారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా ఆయా క్లస్టర్ల జట్ల తరఫున విద్యార్థులు హోరాహోరీగా తలపడ్డారు. ఓవరాల్​ చాంపియన్​గా చిత్తూరు క్లస్టర్​ నిలిచింది. గెలుపొందిన విద్యార్థులందరికీ మెడల్స్​అందజేశారు. గోల్డ్​ మెడల్ సాధించిన విద్యార్థులు నవోదయ విద్యాలయాల నేషనల్​ మీట్​లో పాల్గొంటారని ప్రిన్సిపాల్ ​రమేశ్​రావు తెలిపారు. ​ 

వివాహితపై గ్యాంగ్​ రేప్​?

జహీరాబాద్, వెలుగు: మద్యం  మత్తులో ఉన్న వివాహిత గ్యాంగ్​రేప్​కు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  ఆదివారం జహీరాబాద్ మండలం దిడ్గి గ్రామ శివారులో  అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు జహీరాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను  జహీరాబాద్ ప్రభుత్వ  ఆస్పత్రికి తరలించి చికిత్స  చేయించి  దర్యాప్తు చేపట్టారు. జహీరాబాద్ సీఐ  తోట భూపతి  వివరాల ప్రకారం.. హైదరాబాద్​లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు లో  మద్యం మత్తులో ఉన్న మహిళ ఆటో  ఎక్కింది. ఆటో డ్రైవర్ ఆమెను ఎటువైపు తీసుకెళ్లాడో ఆమె  గుర్తించలేదు.  సికింద్రాబాద్​లోని మల్కాజ్ గిరి  లో నివాసముండే ఆమె కొన్ని నెలలుగా  మద్యానికి బానిస అయ్యింది.  దీంతో భర్త ఆమెను వదిలిపెట్టి మరో పెళ్లి చేసుకున్నాడు.  బాధితురాలికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.  జహీరాబాద్ వైపు ఆమె ఎలా వచ్చింది?  ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగిందా? లేదా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.  డాక్టర్ల రిపోర్టు వస్తే గాని ఏదీ నిర్ధారించలేమన్నారు.

మెదక్​ ఇన్​చార్జి డీఎంహెచ్​వో గా  విజయ నిర్మల

మెదక్​ టౌన్​, వెలుగు : మెదక్​ ఇన్​చార్జి డీఎంహెచ్​వో  డాక్టర్​ విజయ నిర్మలను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.  ఇప్పటి వరకు మెదక్ ​డీఎంహెచ్​వోగా  విధులు నిర్వహించిన డాక్టర్​ వెంకటేశ్వర్​ రావు రంగారెడ్డి జిల్లాకు బదిలీ కాగా,  ఆయన స్థానంలో నర్సాపూర్​లో డిప్యూటీ  డీఎంహెచ్​వోగా  విధులు నిర్వహిస్తున్న  విజయ నిర్మలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. 

వచ్చే ఎన్నికల్లో  కాషాయ జెండా ఎగరాలె

కోహెడ(హుస్నాబాద్​) వెలుగు:  వచ్చే ఎన్నికల్లో హుస్నాబాద్​ గడ్డపై కాషాయ జెండా ఎగరేసేందుకు ప్రతి కార్యకర్త పని చేయాలని హుస్నాబాద్​ నియోజకవర్గ బీజేపీ ఇన్ చార్జి చాడ శ్రీనివాస్​రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం అక్కన్నపేట మండలం గుబ్బెడ గ్రామానికి చెందిన టీఆర్​ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ  సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​అసమర్ధతతో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కల్యాణ లక్ష్మి, సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు పంచితేనే అభివృద్ధి జరిగినట్లా? అని ప్రశ్నించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కంటే  ఎంతో ఆలస్యంగా ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తయ్యాయని ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్ల  ప్రాజెక్టు పూర్తవడం లేదని విమర్శించారు. గౌరవెల్లి భూనిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా రైతులను జైలుకు పంపిన  దుర్మార్గపు ఎమ్మెల్యే సతీశ్​ కుమార్ అని మండిపడ్డారు. ఎమ్మెల్యే స్థానికేతరుడు కావడం వల్లే నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదన్నారు.  జిల్లా ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి విజయపాల్ రెడ్డి,  కుమార్, మండల  అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి, శంకర్​బాబు, జైపాల్ రెడ్డి, సుధాకర్ పాల్గొన్నారు.

హ్యాట్రిక్​ విక్టరీ లక్ష్యంగా పనిచేయండి

కంగ్టి, వెలుగు: వచ్చే ఎన్నికల్లో  టీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని సిద్ధందర్గా, ఎన్కే మూరి, రాంతీర్థ్, నాగూర్ (బీ), కంగ్టి, దెగుల్ వాడీ, రాజారాం తండా, సుక్కల్ తీర్థ్, గాజుల్ పాడ్, హోభ తండా, నాగన్ పల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బతుకమ్మ చీరలతో పాటు  కొత్తగా శాంక్షన్​అయిన ఆసరా పింఛన్​కార్డులు, కల్యాణ లక్ష్మి చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సంక్షేమ​పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. గత పాలకులు తెలంగాణ ప్రజలను దోచుకుతిన్నారే కానీ.. అభివృద్ధి చేయలేదన్నారు. కాంగ్రెస్​పార్టీ లీడర్లు ఖేడ్​అభివృద్ధిని జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.  ఎమ్మెల్యే వెంట​ఎంపీపీ సంగీత వెంకట్ రెడ్డి, జడ్పీటీసీ కోట లలిత ఆంజనేయులు, టీఆర్ఎస్​ మండల ప్రెసిడెంట్ గంగారాం  పాల్గొన్నారు.

కేడీఆర్​ యూత్​ కమిటీ ఆధ్వర్యంలో రక్తదానం

సంగారెడ్డి టౌన్, వెలుగు: బీజేపీ సంగారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గ సభ్యుడు కలబ్ గూర్ దయాకర్ రెడ్డి (కేడీఆర్)​బర్త్​డే సందర్భంగా  ఆదివారం రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో కేడీఆర్​ యూత్​కమిటీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. యూత్​కమిటీ మెంబర్లు హరీశ్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి , చేతన్, లవన్, మహేశ్ గౌడ్, శ్రీకాంత్ , వెంకట్ రెడ్డి, అనిల్ రెడ్డి , ప్రభు, రామ్ రెడ్డి, నాగరాజు, మోహన్, వినయ్, కల్పన తో పాటు 50 మంది రక్తదానం చేశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో 200 మంది రోగులకు పండ్లు పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో దయాకర్ రెడ్డి, వినాయక రెడ్డి, మాజీ సర్పంచ్ సుమంగళి, సత్యనారాయణ, యాదయ్య , అనిల్ కాలనీవాసులు పాల్గొన్నారు.