అలసటని ‘చిన్న సమస్య’గా చూడొద్దు

అలసటని ‘చిన్న సమస్య’గా చూడొద్దు

‘అబ్బా ఈరోజు బాగా అలసిపోయాను’, ‘ఎందుకనో చాలా అలసటగా ఉంది’ అని చాలామంది అనడం వింటుంటాం. అలసట అనేది అందరిలో సాధారణంగా కనిపించేదే. అయితే, కొందరు ఎప్పుడూ అలసటగానే కనిపిస్తుంటారు. అలా ఉండడం ‘క్రానిక్​ ఫ్యాటిగ్​ సిండ్రోమ్​’ కావొచ్చు. అందుకని అలసటని ‘చిన్న సమస్య’గా చూడొద్దు. ఎందుకంటే... అలసట రూపంలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు బయటపడుతుంటాయి. కాబట్టి ఎక్కువ రోజులు అలసటగా ఉన్నవాళ్లు డాక్టర్​ని కలవాలి. టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతినకుండా జాగ్రత్తపడొచ్చు అంటోంది డాక్టర్​ స్పందన.   

శరీరంలో శక్తి తగ్గినప్పుడు, ఎక్కువ టైం పని చేసినప్పుడు, విశ్రాంతి తీసుకోనప్పుడు, కంటినిండా నిద్ర లేననప్పుడు అలసటగా ఉండడం మామూలే. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా అలసిపోతారు. అంతేకాదు  బి12, డి విటమిన్లు, ఐరన్, కాల్షియం, జింక్, ఫోలిక్​ యాసిడ్ వంటి పోషకాలు సరిపోను అందకున్నా కూడా అలసట వస్తుంది. కొందరు తరచూ అలసిపోతుంటారు. ఇలా ఉండడానికి కారణం ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉండటమే. అందుకు కారణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.  

రక్తం తక్కువున్నా

రక్తం తక్కువ ఉన్నా, డయాబెటిస్​ సమస్య ఉన్నా తొందరగా అలసిపోతారు. థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లలో, ఆటో ఇమ్యూన్ డిసీజ్​ల (కండరాల సమస్య, కీళ్లకు సంబంధించిన ఇబ్బందులు)తో పాటు బరువు ఎక్కువున్న వాళ్లలోనూ అలసట కనిపిస్తుంది. ఇవేకాకుండా  పీసీఓడీ (పాలీ సిస్టిక్​ ఒవేరియన్ సిండ్రోమ్​), మెటబాలిజం డిజార్డర్, ఇన్ఫెక్షన్లు వంటివి కూడా అలసటకు దారి తీస్తాయి.  అలాగే చాలారోజులుగా టీబీ, కొన్ని రకాల క్యాన్సర్లతో  బాధపడేవాళ్లు కూడా తరచుగా అలసిపోతారు. 

ఈ లక్షణాలు ఉంటే...

తరచూ అలసటకు లోనయ్యేవాళ్లు అలసటతో పాటు ఇతర లక్షణాలేమైనా ఉన్నాయా? చూసుకోవాలి.  జ్వరం, నిద్ర సరిగా పట్టకపోవడం వంటి లక్షణాలు ఉన్నాయా? అనేది గమనించాలి. అలసటగా ఉండడమే కాకుండా ఒత్తిడికి లోనవడం, అనుకోకుండా బరువు పెరగడం వంటివి ఉంటే... ఒంట్లో ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు.  అయితే, ఈ లక్షణాలు ఒక వారం రోజులు ఉంటే కంగారు పడనక్కర్లేదు. అలా కాకుండా మూడు నెలలకు పైగా అలసట ఉంటే మాత్రం వెంటనే డాక్టర్​ని కలవాలి.  

థైరాయిడ్ పనిచేయకపోయినా

శరీరంలో హార్మోన్లు సరిగ్గా విడుదల కావాలన్నా, మెటబాలిజం చక్కగా జరగాలన్నా థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయాలి. ఈ గ్రంథి సరిగ్గా పని చేయకుంటే హైపోథైరాయిడిజం సమస్య ఏర్పడు తుంది. దాంతో మెటబాలిజం వేగంగా జరగదు. అలసట​తో పాటు  లూజ్​ మోషన్స్ అవుతాయి. 

డయాటెటిస్ ఉన్నా 

టైప్ 2 డయాబెటిస్​ ఉన్నా కూడా అలసట వస్తుంది. వీళ్లలో ఇన్సులిన్​ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది.  దాంతో శరీరం  గ్లూకోజ్​ను గ్రహించలేదు. ఫలితంగా శరీరంలోని కణాలు, కండరాలకు శక్తి అందదు. అలాంటప్పుడు అలసటగా అనిపిస్తుంది. 

ఎనీమియా

ఈ సమస్య ఉన్నవాళ్లలో రక్తంలో ఎర్రరక్తకణాలు తక్కువ ఉంటాయి. కారణం.. ఐరన్ సరిపోను అందకపోవడం వల్ల ఎర్రరక్తకణాల తయారీకి అవసరమైన హిమోగ్లోబిన్ శాతం తగ్గుతుంది. అంతేకాదు మామూలుగా  ప్రతి 120 రోజులకు కొత్త రక్తకణాలు తయారవుతాయి. కానీ, వీళ్లలో అవి టైం ప్రకారం తయారుకావు.  దాంతో వీళ్లకు  కొంచెం దూరం నడవగానే ఆయాసం వస్తుంది. తొందరగా అలసిపోతారు.  

లివర్ ప్రాబ్లమ్​ ఉన్నవాళ్లు

క్రానిక్ లివర్ డిసీజ్​ ఉన్నవాళ్లు తొందరగా అలసిపోతారు. దీనికి కారణం ‘నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్’ డిసీజ్​. ఈ సమస్య ఉన్నవాళ్ల లివర్​లో ఫ్యాట్ చేరుతుంది. దాంతో లివర్ పనితీరు దెబ్బ తింటుంది. ఆ ప్రభావం మెట బాలిజం, శరీరానికి అందే ఎనర్జీ మీద పడుతుంది. 

ఈ టెస్ట్​లతో..

అలసటతో బాధపడేవాళ్లు బ్లడ్ టెస్ట్ చేయించుకో వాలి. కంప్లీట్ బ్లడ్ రిపోర్ట్​ (సిబిఆర్)లో రక్తకణాల సంఖ్య ఎంత ఉంది? అనేది తెలుస్తుంది. ఇఎస్​ఆర్​ (ఎరిత్రోసైట్ సెడిమెంటేషన్ రేట్​) టెస్ట్​ చేయిస్తే ఇన్ఫెక్షన్ ఉందా? లేదా? అనేది తెలుస్తుంది. ఇఎస్​ఆర్​ రిపోర్ట్ 100పైన ఉంటే ఇన్ఫెక్షన్​ ఎక్కువ ఉన్నట్టు. ఈ టెస్ట్ ద్వారా టీబీ ఉందా? ఆటో ఇమ్యూన్ డిసీజ్​లు ఏమైనా ఉన్నాయా? అనేది తెలుస్తుంది. అలాగే థైరాయిడ్, డయాబెటిక్ టెస్ట్​లు కూడా చేయించుకోవాలి. 

క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్

ఆరు నెలల పాటు తరచూ అలసటగా ఉంటే అది ‘క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్’ కావొచ్చు.  ఏ ఆరోగ్య సమస్య లేకున్నా కూడా వీళ్లలో అలసట ఉంటుంది. కారణం.. మానసిక ఒత్తిడి, ఏదో ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించడమే.  క్రానిక్ ఫ్యాటిగ్​ సిండ్రోమ్ ఉన్నవాళ్లలో పని చేసే కెపాసిటీ తగ్గుతుంది.  పని మీద ధ్యాస తగ్గుతుంది. మతిమరుపు కూడా కనిపిస్తుంది. వీళ్లకు డయాబెటిక్, థైరాయిడ్, హిమోగ్లోబిన్ టెస్ట్​లు చేయించాలి. అన్ని టెస్ట్​ల రిపోర్టులు సాధారణంగా ఉంటే  కౌన్సెలింగ్ అవసరమవుతుంది. 

ఈ జాగ్రత్తలతో... 

అలసటగా అనిపించినప్పుడు విశ్రాంతి తీసుకోవాలి.  పప్పులు, ఆకుకూరలు, పండ్లు, గుడ్లు, నట్స్​ ఎక్కువ తింటే శరీరానికి సరిపోను ప్రొటీన్ అందుతుంది. ఐరన్, కాల్షియంతో పాటు డి, బి12 విటమిన్లు అందేలా చూసుకోవాలి. రోజుకు 8 నుంచి 10 గంటల నిద్ర తప్పనిసరి. అంతేకాదు ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు ఎక్సర్​సైజ్ చేయాలి. ఇలా జాగ్రత్తపడితే తొందరగా అలసిపోరు.