చైనా మాంజా వద్దే వద్దు

చైనా మాంజా వద్దే వద్దు

సంక్రాంతికి ఆడపిల్లలంతా రంగురంగుల ముగ్గులతో వాకిళ్లను ముస్తాబు చేస్తారు…. పువ్వులతో, రంగులతో నేల మెరిసిపోతుంది.  మరి ఆకాశం సంగతేంది? అందుకే పతంగ్ ఎగరేస్తారు. రంగురంగుల తోరణాలతో మొగులంతా పరుచుకున్న సింగిడితో ఆకాశానికి రంగులేస్తారు. సంక్రాంతి వచ్చిందంటే పతంగ్, దాగా మాంజా, డపన్ లంగోట్, బరేల్ మాంజా అనే పదాలు వినిపిస్తూనే ఉంటాయి. గల్లీలన్నీ పోరగాండ్ల పరుగులతో నిండిపోతాయి. పల్లె, పట్నం అని తేడాలేకుండా పతంగ్ ఖైంచీ పోటీలు జరుగుతాయ్. అయితే ఒకప్పటి పండుగలన్నింటిలో ఏదో ఒక మార్పు వచ్చినట్టే ఇప్పుడు పతంగ్‌‌‌‌ల పండుగకీ  చైనా మాంజా అనే ఉచ్చు బిగుస్తోంది. చైనామాంజా మన మార్కెట్‌‌‌‌లోకి వచ్చిన దగ్గరి నుంచీ పక్షులు గాయాల పాలవుతున్నాయి. పిల్లలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికే నిషేధించినా ఈ ప్రమాదకరమైన మాంజా ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంది.

చైనా మాంజాలు నైలాన్‌‌‌‌తో తయారు చేయడమే కాకుండా గాజుని పొడి పూసిన  నైలాన్ , సింథటిక్ దారాలు వాడుతున్నారు.  కైంచీ (వేరే పతంగ్ దారానికి మెలిక వేసి తెంపటం)  వేసిన సమయంలో చైనా మాంజా పతంగ్ తెగకుండా ఉండడంతో పాటు, ఎదుటివారి పతంగ్‌‌‌‌ని తెంపుతుండడంతో ఎక్కువ మంది ఈ రకం మాంజా వినియోగించేందుకు మొగ్గు చూపుతున్నారు. పండుగ తర్వాత ఎక్కడికక్కడ ఈ వ్యర్థాలు మిగిలిపోయి పర్యావరణం, పక్షులకు హాని జరుగుతోంది.

చైనా మాంజాపై నిషేధం

ప్లాస్టిక్ ప్రధాన పదార్థంగా తయారయ్యే దారం కావటం వల్ల ఈ దారం గట్టిగా, పదునుగా ఉంటుంది.  ప్రతి ఏటా సంక్రాంతి సీజన్లో మాంజా చుట్టుకుని పక్షులు, పిల్లలూ గాయపడ్డ వార్తలు వస్తూనే ఉన్నాయి. కమ్యూనికేషన్, విద్యుత్, ట్రాఫిక్‌‌‌‌కి కూడా తీవ్ర ఇబ్బంది అవుతోంది.  కుప్పలు కుప్పలుగా డ్రైనేజీల్లో పేరుకుపోవటం, భూమిలో కలిసిపోయే వీలులేకపోవటం వల్ల పర్యావరణం దెబ్బతింటోంది. అందుకే పర్యావరణవేత్తలు, అటవీశాఖ నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం చైనా మాంజాపై నిషేధం విధించింది. నగరంలో తనిఖీలు ఎక్కువయ్యేసరికి పాత స్టాక్ మొత్తాన్నీ ఊళ్ళలోకి తరలిస్తున్నారు. అందుకే పేరెంట్స్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. పిల్లల చేతులు కోసుకు పోవటమే కాదు, రోడ్డుకు అడ్డంగా వేలాడే దారం మెడకు కోసుకుపోయి పిల్లలు గాయపడిన,  చనిపోయిన ఘటనలూ ఉన్నాయి.

పదివేల మందికి జీవనోపాధి

ఒకప్పుడు నగరంలో దాదాపు పదివేల మంది మాంజా తయారీ మీదే ఆధారపడి బతికేవారు. ఆరు నెలల ముందు నుంచి మాంజా తయారీని ప్రారంభించి సంక్రాంతి పండుగ కోసం పెద్ద ఎత్తున నిల్వ ఉంచి పండుగ సీజన్ మొదలుకాగానే అమ్మకాలు మొదలుపెట్టేవాళ్ళు. అయితే చైనా మాంజా మార్కెట్లోకి రాగానే సంప్రదాయ మాంజాను తయారు చేసేవారు మెల్లమెల్లగా వేరే వ్యాపారాలవైపు మొగ్గు చూపిస్తున్నారు. హైదరాబాద్‌‌‌‌ లోని ధూల్‌‌‌‌పేట్, గంగాబౌలి, శివలాల్‌‌‌‌నగర్, లక్ష్మీనగర్, మోహన్‌‌‌‌దాస్ మఠ్, ఇమ్లియా బాగ్, రహీంపురా, చార్మినార్, చందూలాల్ బారాదారి, దూద్‌‌‌‌బౌలి, కాలాపత్తర్, డబీర్ పురా తదితర ప్రాంతాలలో ఈ మాంజా తయారయ్యేది. ఇక్కడ ఆరునెలలు పతంగ్, మాంజా తయారైతే మిగతా టైమంతా గణేష్, దుర్గామాత బొమ్మలు తయారుచేస్తారు. ఈ చైనా మాంజా వల్ల వారి జీవనోపాధి పోయింది.

ఎకో ఫ్రెండ్లీ

అయినా పండుగంటే అందరి సంతోషాన్నీ కోరేది, ప్రకృతితో మన అనుబంధాన్ని గుర్తు చేసుకునేది. పండగ అంటేనే ప్రకృతితో అనుబంధాన్ని పెంచేది, ‘ఎకో ఫ్రెండ్లీ పండుగ’ అనటమే మనం పండుగకి దూరం అవుతున్నట్టు చెప్తున్నట్టు ఉంది.  జనమంతా ఆనందాన్ని పంచుకోవాల్సిన పండుగని ఇలాంటి ఉచ్చు దారాల్లో బంధించటం బాగుండదు కదా! పల్లెటూళ్లలోనూ ఈసారి తనిఖీలు నిర్వహించబోతోంది. మాంజా బదులుగా మామూలు కాటన్ దారం వాడటమే మంచిది, చేతులకు గాయాలు అవకుండా ఉంటుందని పిల్లలకి చెప్పాల్సింది మనమే.

చెట్ల మీదా, కరెంట్ తీగల మీదా చిక్కుకున్న చైనా మాంజాని చేతులతో తీయొద్దని చెప్పాలి. పతంగి ఎగరేయటం ఆనందం కోసమే తప్ప ఇంకో పతంగిని తెంపటం సరైంది కాదని వివరించాలి. ఒక వేళ..  పోటీలో భాగంగా మాంజా వాడాల్సి వచ్చినా అది మనదగ్గర తయారైన దారం అయితే ఎకోఫ్రెండ్లీ అని వాళ్ళకి వివరించి చెప్పాలి. లోకల్ మాంజా అయినా మాంజా అంటేనే రఫ్ గా ఉంటుంది కాబట్టి చేతి వేళ్ళకి రక్షణ అవసరం. చైనా మాంజా ఎక్కడైనా అమ్ముతున్నట్టు తెలిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కూడా మనదే.