వేసవిలో ఈ ప్లేస్ కు తప్పకుండా వెళ్లాల్సిందే..

వేసవిలో ఈ ప్లేస్ కు తప్పకుండా వెళ్లాల్సిందే..

వేసవి సెలవుల్లో టూర్​కి వెళ్లాలని చాలామంది అనుకుంటారు. కానీ, మనదేశంలోనే ఒక మంచి టూరిస్ట్​ ప్లేస్​ కావాలంటే వెస్ట్​ బెంగాల్​ వెళ్లాల్సిందే. దువార్స్ అనేది పశ్చిమ బెంగాల్​లోని ఒక టూరిస్ట్​ ప్లేస్. ఈ ప్రాంతం పశ్చిమ బెంగాల్​లోని తీస్త నది నుంచి అస్సాంలోని ధన్సిరి నది వరకు దాదాపు 350 కిలో మీటర్లు విస్తరించి ఉంది. అంతేకాదు... ఈ ప్రాంతం భూటాన్​కు గేట్​ వే. ఇది టెరై –దువార్ సవన్నా, గ్రాస్ లాండ్స్ ప్రాంతంలో భాగం. ఈ ప్రదేశం గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్​ సంగతులు ఇవి.  దువార్స్(dooars) అంటే... అస్సామీ, బెంగాలీ, మైథిలీ, భోజ్​పురి, మగాహి భాషల్లో ‘తలుపులు(doors)’ అని అర్థం. 

హిస్టరీ 

దువార్స్ కమత రాజ్యానికి చెందినవాళ్లు. అస్సాం, భూటాన్ మధ్య ట్రేడింగ్​ చేసేవాళ్లు. అస్సాం, ముగా, సిల్క్ క్లాత్, ఎండిన చేపలు, బియ్యం వంటివి ఎగుమతి చేస్తుంది. భూటాన్ నుంచి ఉన్ని బట్టలు, గోల్డ్​ డస్ట్​, రాతి ఉప్పు, పోనీలు, దుప్పట్లు వంటివి దిగుమతి చేసుకుంటుంది. బ్రిటిష్​ కాలంలో డోయర్ యుద్ధం కూడా జరిగింది. అప్పుడు భూటాన్ దాదాపు ఐదో వంతు విస్తీర్ణాన్ని కోల్పోయింది. ఈ ప్రాంతం రెండు భాగాలుగా విడిపోయింది. వెస్ట్రన్ డోర్స్, ఈస్ట్రన్ డోర్స్. మిగతావి కమ్​రూప్​ ​ డోర్స్, దర్రాంగ్ డోర్స్. తూర్పు (ఈస్ట్రన్) తలుపులు అస్సాంలోని గోల్​పరా జిల్లాలో, కమ్​రూప్​ డోర్స్ కమ్​రూప్​ జిల్లాలో, దర్రాంగ్ డోర్స్ దర్రాంగ్ జిల్లాలో విలీనమయ్యాయి. వెస్ట్రన్ డోర్స్​ 1865లో బ్రిటిష్​ వారి ఆధీనంలోకి వెళ్లింది. వెస్ట్రన్​ డోర్ అనే జిల్లాగా మారింది. అయితే,1869లో అది జల్​పయిగురి జిల్లాగా మారింది. 

మహానద

మహానద వైల్డ్ లైఫ్ శాంక్చువరీ చాలా అందమైన ప్రదేశం. హిమాలయాల్లోని టెరై ప్రాంతంలో ఉంది. ఇది మహానద నది ప్రాంతం వరకు విస్తరించి ఉంటుంది. ఇక్కడ రైనోలు, ఎద్దులు, ఏనుగులు, పులులు, చిరుతపులులు వంటివి కనిపిస్తాయి.  

సంసింగ్

సిలిగురి విలేజ్ నుంచి 81 కిలో మీటర్ల దూరంలో సంసింగ్, సనతలెఖోల అనే ప్రాంతాలు ఉన్నాయి. ఇది ప్రకృతి ప్రేమికులకు స్వర్గంలా అనిపిస్తుంది. ఇక్కడ అడవి మధ్యలో రెండు ఫారెస్ట్​ బంగ్లాలు ఉన్నాయి. అంతేకాదు, వెనకభాగంలో నీటి ప్రవాహపు సవ్వళ్లు వినిపిస్తుంటాయి. తెల్లవారుజామున  బంగ్లా బయటికి వచ్చి చూస్తే, పక్షుల కిలకిలరావాలు వింటూ నేచర్​ని ఎంజాయ్ చేయొచ్చు. 

చప్రమరి 

చప్రమరి అనేది కూడా మరొక వైల్డ్​ లైఫ్ శాంక్చువరీ. ఇది గొరుమర నేషనల్ పార్క్​కి 20 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ కనువిందు చేసే ప్రకృతిని చూడొచ్చు. దీని వెనక భాగంలో కాంచన్​జంగాతో పాటు, మిగతా హిమాలయా పర్వత శిఖరాలు పెయింటింగ్​ వేసినట్లు అందంగా కనిపిస్తాయి. అలాగే శాంక్చువరీలో ఉండే ఏనుగులు, చిరుతపులులు వంటివి చూడొచ్చు. అంతేకాదు.. ఒక రాత్రంతా ఉండాలన్నా రెస్ట్​ హౌస్​లు అందుబాటులో ఉన్నాయి అక్కడ. కాకపోతే, ఈ వానాకాలంలో శాంక్చువరీని చూడ్డానికి అనుమతించరు. జూన్​ నుంచి సెప్టెంబర్​ వరకు టూరిస్ట్​లు రాకుండా మూసివేస్తారు. 

లట్​పన్చోర్

మహానద వైల్డ్ లైఫ్​ శాంక్చువరీ పైభాగంలో ఉన్న చిన్న గ్రామం లట్​పన్చోర్. చుట్టూ అడవి, సింకోనా చెట్ల మధ్య బ్రిటిష్​ బంగ్లా ఒకటి ఉంది. అది ఇప్పుడు ఫారెస్ట్​ బంగ్లాలా వాడుతున్నారు. ఇక్కడ నంథింగ్​ పోఖ్రి వరకు ట్రెక్కింగ్​ కూడా చేస్తుంటారు టూరిస్ట్​లు. అంతేకాకుండా... ఆహల్ పిక్​ దగ్గర సూర్యోదయాన్ని చూడడం మంచి అనుభూతినిస్తుంది.