- రాష్ట్రంలో ఇంటి స్థలం లేని కుటుంబాలు 10 లక్షలకుపైనే
- ‘సొంత జాగలో ఇంటికి రూ.3లక్షలు’పై కేసీఆర్ ప్రకటనతో అయోమయం
- వాటిపై ఆశ వదులుకొని జాగల కోసం పేదల భూపోరాటం
నెట్వర్క్, వెలుగు: డబుల్ బెడ్రూం ఇండ్ల స్కీంపై చేతులెత్తేసిన రాష్ట్ర సర్కారు, తాజాగా ఇల్లడుగు జాగ ఉన్నోళ్లకు రూ.3 లక్షలు ఇస్తామని ప్రకటించింది. దీంతో సొంత జాగల్లేని పేదలు తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో సొంతిల్లు లేని కుటుంబాలు 30 లక్షల దాకా ఉంటే ఈ ఎనిమిదేండ్లలో ప్రభుత్వం కట్టించిన ఇండ్లు కేవలం1.13 లక్షలు! అంటే 4శాతం మందికి కూడా ఆ ఇండ్లు అందేలా లేవు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు ఇండ్లు కట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని బంద్‌పెట్టే ఆలోచనలో ఉన్న సర్కారు, సొంత జాగ ఉన్నవాళ్లు ఇండ్లు కట్టుకునేందుకు 3 లక్షలు ఇస్తామని చెప్తోంది. ఇటీవల పాలమూరు పర్యటనలో సీఎం చేసిన ఈ ప్రకటనతో సొంత జాగల్లేని సుమారు10 లక్షల కుటుంబాలు ఆందోళనలో పడిపోయాయి. ఇన్నాళ్లూ ఇండ్లు వస్తాయని ఎదురుచూశామని, ఇప్పుడు సొంత జాగ కోసం ఎక్కడికి పోవాలని పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు. జిల్లాల్లో జాగల కోసం భూపోరాటాలు చేస్తున్నారు.
2014 సమగ్ర సర్వే ప్రకారం రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలు 26.31 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 30 లక్షలకు చేరినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. తొలివిడత 2,91,057 డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మిస్తామని ప్రకటించిన సర్కారు, ఇప్పటివరకు కేవలం1.13 లక్షల ఇండ్లను పూర్తిచేసింది. ఇందులో హెచ్‌ఎండీఏ పరిధిలో 67 వేల ఇండ్లు ఉండగా, జిల్లాల్లో 49 వేల ఇండ్లు మాత్రమే కంప్లీట్ అయ్యాయి. ఈ మాత్రం ఇండ్ల నిర్మాణానికి ఏకంగా ఎనిమిదేండ్లు పట్టింది. రాష్ట్ర సర్కారు ఒక్కో ఇంటికి రూ.5 నుంచి రూ.7 లక్షల రేట్ ఫిక్స్ చేయడంతో ఇండ్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ముందుకు వచ్చిన చోట నిర్మాణాల్లో క్వాలిటీ లేదనే విమర్శలు వచ్చాయి. దీంతో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఖాళీ జాగ ఉన్న పేద కుటుంబాలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని, నియోజకవర్గానికి 3వేల యూనిట్లు మంజూరు చేస్తామని గత బడ్జెట్లో రాష్ట్ర సర్కారు ప్రకటించింది. ఇందుకు కొనసాగింపుగా ఈ నెల 4న మహబూబ్‌నగర్ సభలో కేసీఆర్ ప్రకటన చేశారు. సొంత జాగ ఉన్నవారికి రూ.3లక్షలు ఇచ్చే స్కీముకు రానున్న 10,15 రోజుల్లో ఫండ్స్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు.
ఇండ్ల జాగల కోసం భూపోరాటాలు
రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల జాగలు లేని పేద కుటుంబాలు 10లక్షలకు పైగా ఉంటాయని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. వీరంతా డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎనిమిదేండ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎన్నేండ్లు చూసినా ఇండ్లు వచ్చే అవకాశం లేకపోవడం, సొంత జాగ ఉన్నవారికి రూ.3లక్షలు ఇస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించడంతో వీరంతా అయోమయంలో పడిపోయారు. ఈ కారణంగానే కొద్దిరోజులుగా పేదలు ఇండ్ల జాగల కోసం భూపోరాటం మొదలుపెట్టారు. ఈ నెల 14న జనగామ జిల్లా కలెక్టరేట్‌ను సుమారు 2వేల మంది ముట్టడించి, ఇండ్ల జాగలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 17న ఇదే జిల్లాలోని లింగాల ఘన్పూర్ మండలంలోని నెల్లుట్ల శివారు లో సుమారు 7 ఎకరాల సర్కార్ భూమిలో సుమారు5 వేల మంది పేదలు గుడిసెలు వేసి ఆక్రమించారు. చిలుపూరు మండలం రాజవరంలో కూడా పేదలు ఇండ్ల జాగల కోసం గుడిసెలు వేసి ఆందోళన కొనసాగిస్తున్నారు. పది, పదిహేను రోజులుగా వరంగల్‌లోని పేదలు నగరం చుట్టూ ఉన్న చెరువు శిఖాలు, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటున్నారు.21న సీపీఐ ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ముట్టడించారు. మూడు రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ధర్నాచౌక్‌లో ఆందోళన చేస్తున్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఇండ్ల జాగల కోసం 21న ధర్నా చేపట్టారు. జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం ఇండ్ల జాగల కోసం ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గుంట జాగ కూడా లేని తమకు ఇంటి స్థలంతో పాటు, రూ.3 లక్షలు
ఇస్తే కనీసం రేకుల ఇల్లు కట్టుకునైనా ఉంటామని పేదలు అంటున్నారు.
కిరాయి కట్టలేనోళ్లం.. ఇల్లెట్ల కడ్తం
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన అనిత భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. అనితకు ముగ్గురు కూతుళ్లు. కూలి పని చేస్తూ వారిని చదివిస్తోంది. వీరికి సొంతిల్లు లేదు. కిరాయి ఇంట్లో ఉండేవారు. కిరాయి కట్టడం ఇబ్బంది కావడంతో వాళ్ల పరిస్థితి గమనించిన గ్రామ సర్పంచ్ లావణ్య స్కూలు పక్కనున్న ఖాళీ జాగలో గుడిసె వేసుకొమ్మని చెప్పారు. అప్పటి నుంచి ఇలా సర్కారు జాగలో గుడిసె వేసుకొని ఉంటున్నారు. ఎలాగైనా డబుల్ బెడ్రూం ఇల్లు వస్తుందని అనుకున్నా రాలేదు. తీరా ఇప్పుడు సొంతంగా జాగ ఉంటే ఇంటి నిర్మాణానికి డబ్బులిస్తామని సీఎం చెప్పడంతో, తమకు డబుల్ బెడ్రూం ఇల్లు రాదేమోనని అనిత కుటుంబం ఆందోళన చెందుతోంది.
ఇల్లు లేదు.. జాగ లేదు
మాకు సొంత ఇల్లు లేదు, జాగ లేదు. ఇరవై ఏండ్ల సంది కిరాయి ఇండ్లల్ల ఉంటున్నం. రెండు రూములకు అప్పుడు రూ.350 ఉంటే ఇప్పుడు రూ.3500 అయ్యింది. నేను టైలరింగ్ చేస్త. ఇద్దరు పిల్లల చదువులు, కిరాయిలు, ఇంటి ఖర్చులకు చాలా ఇబ్బందయితుంది. కేసీఆర్ పేదోళ్లకు డబుల్ బెడ్రూంలు ఇస్తమంటే ఆశపడ్డం. మున్సిపాలిటీల దరఖాస్తు పెట్టుకున్నం. ఏండ్లు గడుస్తున్నా ఇండ్లు ఇయ్యలే. ఇప్పుడు సొంత జాగ ఉన్నోళ్లకు రూ.3లక్షలు ఇస్తమంటున్నడు. గాపైసలతోటి డబుల్ బెడ్రూం అయితదా? మాలాంటి పేదోళ్లం పట్నంల గుంట జాగ కొంటమా? జాగల్లేనోళ్ల పరిస్థితి సుత ఆలోచించాలె.
‑ విజయలక్ష్మి, మంచిర్యాల హమాలివాడ
ప్రభుత్వమే ఇల్లు ఇవ్వాలె
కొన్నేండ్లుగా జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నం. మాకు గుంట జాగలేదు. ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తదని ఆశపడ్డాను. కొన్నిచోట్ల కట్టినా ఇప్పటివరకు వాటిని పంచిన దాఖలాలు లేవు. కొత్తగా రూ.3 లక్షలు ఇస్తే ఇండ్లు కట్టుకోవాలంటున్నరు. జాగలేని మేము ఇల్లెట్ల కట్టుకోగలం. మాకు ప్రభుత్వమే ఇల్లు ఇవ్వాలె.
‑ నూకల కేతమ్మ, మహబూబాబాద్
మా అసోంటోళ్ల పరిస్థితేంది
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రానికి చెందిన మాదాసు నాగరాణి, నాగరాజు అక్కా తమ్ముళ్లు. వీరి తల్లిదండ్రులు నాలుగేండ్ల కింద చనిపోయారు. అక్కాతమ్ముళ్లిద్దరూ కూలి పనిచేసి బతుకుతున్నారు. వీరికి దళితబంధు రాలేదు. సొంత జాగ లేకపోవడంతో ఊరి చివర రోడ్డు పక్కన గుడిసె వేసుకొని ఉంటున్నారు. సర్కారు డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తుందని ఆశపడ్డారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం జాగ ఉంటేనే రూ.3 లక్షలు ఇస్తామని చెప్తుండటంతో మా అసొంటోళ్ల పరిస్థితి ఎట్లని మనాదివడుతున్నరు.
‑ అక్కాతమ్ముళ్లు మాదాసు నాగరాణి, నాగరాజు
