హైదరాబాద్ లో వాటర్ ​ట్యాంకర్లకు డిమాండ్​ డబుల్

హైదరాబాద్ లో వాటర్ ​ట్యాంకర్లకు డిమాండ్​ డబుల్
  •     డెయిలీ 8 వేల ట్యాంకర్లకు ఆర్డర్లు
  •     నీటి ఎద్దడిని తగ్గించేందుకు వాటర్​బోర్డు చర్యలు 
  •     సిటీలో కొనసాగుతున్న 70 వాటర్​ ఫిల్లింగ్​ స్టేషన్లు
  •     ఓఆర్ఆర్ పరిధిలో అదనంగా మరో 20 స్టేషన్లు ఏర్పాటు
  •     కొత్తగా 250 వాటర్​ ట్యాంకర్లు, డ్రైవర్ల కేటాయింపు

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్​పరిధిలో నీటి ఎద్దడిని తగ్గించేందుకు వాటర్ బోర్డు అన్ని రకాలు చర్యలు చేపడుతోంది. కిందటేడుతో పోలిస్తే ఈసారి తాగునీటి కొరత ఎక్కువగా ఉంది. వాటర్​ట్యాంకర్లకు డిమాండ్​రెట్టింపు అయింది. ఈ నేపథ్యంలో వేసవి మొత్తం 24 గంటలూ వాటర్​ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని వాటర్​బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం రోజుకు 9 వేల ట్రిప్పులతో నీటిని అందిస్తోంది. 28 ఆపరేషన్​అండ్​మెయింటెనెన్స్​డివిజన్ల పరిధిలో 13.80 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా, వాటర్​బోర్డు రోజూ 550 మిలియన్​గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. ఎండలు విజృంభిస్తుండడంతో నల్లాల ద్వారా సరఫరా చేసే నీళ్లు సరిపోక, జనం ట్యాంకర్ల కోసం ఎగబడుతున్నారు. దీంతో అధికారులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. కమర్షియల్​అవసరాలకు సర్దుబాటు చేస్తూనే, కాలనీలు, బస్తీలకు ట్యాంకర్లు పంపిస్తున్నారు.

నిరుటితో పోలిస్తే.. 

గతేడాది ఏప్రిల్​నెలలో రోజుకు 2,500 నుంచి 3వేల ట్యాంకర్లకు ఆర్డర్లు వస్తే.. ఈసారి ఆ సంఖ్య 8 వేలకు చేరిందని వాటర్​బోర్డు అధికారులు చెబుతున్నారు. నీటి కొరత లేకుండా చూసేందుకు రోజుకు 9 వేల ట్యాంకర్లు సరఫరా చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. యాక్షన్​ప్లాన్​లో భాగంగా ప్రత్యేకంగా నైట్ షిఫ్ట్ ఏర్పాటు చేశామని మున్సిపల్​శాఖ ప్రిన్సిపల్​సెక్రటరీ దానకిశోర్ చెప్పారు. గృహ అవసరాలకు ట్యాంకర్(5 వేల లీటర్లు)ను రూ.500, కమర్షియల్​ అవసరాలకు రూ.850గా నిర్ణయించారు. కమర్షియల్​డిమాండ్​ను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఫిల్లింగ్ స్టేషన్ నుంచి రోజుకు  300 అదనపు ట్రిప్పులు సరఫరా చేస్తున్నామన్నారు. ఇందుకోస 250 కొత్త ట్యాంకర్లు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ, ఇతర మార్గాల ద్వారా 250 మంది డ్రైవర్లను సమకూర్చుకున్నట్లు పేర్కొన్నారు. గ్రేటర్​పరిధిలో ఇప్పటికే నీటి సరఫరాకు 540 ట్యాంకర్లు ఉండగా తాజాగా మరో 250 ట్యాంకర్లను అద్దెకు నియమించుకున్నట్లు అధికారులు తెలిపారు.  70 ఫిల్లింగ్​స్టేషన్​లు ఉండగా, తాజాగా మరో 20 ఫిల్లింగ్​స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు అధికారులు వివరించారు. వీటిని ఓఆర్ఆర్​ పరిధిలో వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్యాంకర్ బుక్ చేసిన 24 గంటల్లో సరఫరా చేసేలా ప్లాన్​చేశామన్నారు.

షిఫ్ట్ ఇన్ చార్జిల నియామకం

రాత్రి సమయాల్లో ట్యాంకర్ల సరఫరాను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా షిఫ్ట్ అధికారులను నియమించిన్నట్లు అధికారులు తెలిపారు. వీరు వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్, సరఫరా తదితర సమస్యలు తలెత్తకుండా సమన్వయంతో పనిచేసి పర్యవేక్షిస్తారు. వేసవి కార్యాచరణ అమలు కోసం డివిజన్ కి ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించినట్లు తెలిపారు. వీరు వినియోగదారుల డిమాండ్, నీటి సరఫరా, తగినన్ని ట్యాంకర్లు, డ్రైవర్లు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించి.. ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నారు.