కొత్త వ్యవసాయ చట్టాలపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు

కొత్త వ్యవసాయ చట్టాలపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు

వారణాసి: రైతుల బాగు కోసమే కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌‌లోని వారణాసిలో నిర్వహించిన హందితా-రాజాతలాబ్ నేషనల్ హైవే ప్రారంభోత్సవంలో మోడీ పాల్గొన్నారు. ఈ హైవేను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కొత్త అగ్రి చట్టాల గురించి మోడీ పలు విషయాలు మాట్లాడారు. వ్యవసాయ చట్టాలపై విపక్షాలు కావాలనే అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. రైతులకు నిర్ణయాధికారంలో పూర్తి స్వేచ్ఛను కల్పించేందుకే ఈ చట్టాలను తీసుకొచ్చామని తెలిపారు. తమ ఉత్పత్తులను అమ్మాలా వద్దా అనేది రైతులే నిర్ణయించుకోవాలన్నారు.

‘రైతుల బాగు కోసమే కొత్త అగ్రికల్చర్ చట్టాలను తీసుకొచ్చాం. రాబోయే కొన్నేళ్లలో ఈ చట్టాల వల్ల కలిగే ప్రయోజనాలను మనం చూడబోతున్నాం. ఇప్పుడో కొత్త ట్రెండ్ నడుస్తోంది.. ఏంటంటే ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలను ముందుగానే వ్యతిరేకిస్తున్నారు. విపక్ష పార్టీలకు రూమర్లు ప్రాతిపదికగా మారాయి. సర్కార్ నిర్ణయాలు సరైనవే అయినా అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ఏదో జరుగుతుందని వదంతులను వ్యాప్తి చేస్తున్నారు. అగ్రి చట్టాల విషయంలోనూ ఇదే జరిగింది. యూరియా బ్లాక్ మార్కెట్‌‌ను మూయించి, రైతులకు సరిపోయేలా యూరియాను అందిస్తామని మాటిచ్చాం. గత ఆరేళ్లలో యూరియా లోటు లేకుండా చేశాం. ఇంతకుముందు యూరియాను బ్లాక్‌‌లో కొనుక్కోవాల్సి వచ్చేది. కొనుక్కోవడానికి వచ్చిన రైతన్నలపై లాఠీఛార్జ్ చేసేవారు. అలాగే మార్కెట్‌‌కు అవతల జరిగే లావాదేవీల్లో అవినీతి జరిగేది. సన్న రైతులు మోసానికి గురయ్యేవారు. కానీ ఇప్పుడు అలాంటి మోసాలకు పాల్పడిన వారిపై చిన్న రైతులు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భారత వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. మరి మన రైతులు తమ ఉత్పత్తులను పెద్ద మార్కెట్లలో ఎక్కువ ధరలకు అమ్ముకోవద్దా? ఒకవేళ ఎవరైనా పాత పద్ధతుల ప్రకారమే విక్రయాలు జరుపుదామనుకుంటే ఎవరొద్దన్నారు? పాత విధానాన్ని మేం నిలిపి వేయలేదు’ అని మోడీ పేర్కొన్నారు.