మల్లికార్జున్​ యాదిలో.. రాజకీయ జీవితాన్ని మలుపుతిప్పిన ఉద్యమం

మల్లికార్జున్​ యాదిలో.. రాజకీయ జీవితాన్ని మలుపుతిప్పిన ఉద్యమం

చారిత్రక ఘట్టంలో పనిచేసిన కీలక నేతలను ఎప్పుడూ గుర్తుంచుకోవలసిందే. అలాంటి నాయకులు తెలంగాణలో  చాలా మందే ఉన్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమ నాయకులను ఇప్పటికీ మనం గుర్తుచేసుకోక పోతే.. చరిత్రనే మర్చిపోతున్న వాళ్లమవుతాం. అలాంటి నేతల్లో మల్లికార్జున్​ ఒకరు.  ‘జై తెలంగాణ’ నినాదానికి ఆయన ప్రతిరూపం.  ఈ తరం వాళ్లకు ఆయన తెలియకపోవచ్చు. ఆ నాటి కాలాన్ని చూసిన ప్రతి తెలంగాణ వాసికీ మల్లికార్జున్​ తెలుసు. అప్పటి ప్రభుత్వ పాఠశాలల్లో  చదువుతున్న పిల్లలకూ మల్లికార్జున్​ పేరు తెలుసు. అప్పటి ఉస్మానియా యూనిర్సిటీ విద్యార్థిలోకానికి మరింత  బాగా తెలుసు. ఆనాటి విద్యార్థులే జై తెలంగాణ అంటూ బడులు, కాలేజీలు, యూనివర్సిటీ తరగతులు బహిష్కరించారు. రహదారుల వెంట తెలంగాణ నినాదాలను మారుమోగించారు. ప్రభుత్వాన్ని గడగడలాడించారు. ఆ  పిల్లలే నేడు 60 ఏండ్లకు పైబడిన వయసువారై ఉంటారు. వారందరికీ  చెన్నారెడ్డి, మల్లికార్జున్​, వెంకటస్వామి (కాకా),  మదన్​మోహన్ పేర్లు  ఇప్పటికీ గుర్తున్నాయి.  తొలిదశ ఉద్యమ ప్రస్తావన ఎప్పుడు వినబడ్డా అప్పటి నేతలంతా కళ్లముందు కదలాడుతారు. అందులో మల్లికార్జున్​ ఒకరు.  

రాజకీయ జీవితాన్ని మలుపుతిప్పిన ఉద్యమం 

జీవితాంతం తెలంగాణ డిమాండ్ వినిపించిన ఉద్యమ యువనాయకుడు డాక్టర్ మల్లికార్జున్. తెలంగాణకు ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ ఆయన విగ్రహ ఆవిష్కరణకు ఆయన కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది. తొలితరం ఉద్యమ నేత 1941 మే 14న మెదక్ జిల్లా నలగండ్లలో కల్లుగీత కార్మికుల కుటుంబంలో పుట్టారు. ఉస్మానియా యూనివర్శిటీలో చదివిన ఆయన విద్యార్థి నాయకుడిగా నాన్ ముల్కీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1969 తెలంగాణ ఉద్యమ యువ నాయకుల్లో చురుగ్గా పనిచేశారు మల్లికార్జున్. తెలంగాణ సాధన లక్ష్యంతోనే ఏర్పాటైన తెలంగాణ ప్రజా
సమితితో రాజకీయ జీవితం మొదలుపెట్టారు. మర్రి చెన్నారెడ్డి, కాకా వెంకటస్వామి, మదన్ మోహన్ లాంటి సీనియర్లతో కలిసి పనిచేశారు. 1971లో టీపీఎస్ తరఫున మొదలు మెదక్ ఎంపీగా బరిలోకి దిగారు. యువనాయకుడిగా తొలిసారే భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచి పార్లమెంట్​లో అడుగుపెట్టారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన మల్లికార్జున్.. 1977 ఎన్నికల్లో రెండోసారి మెదక్ స్థానం నుంచే పోటీచేశారు. ఎమర్జెన్సీ ఎఫెక్ట్ తో దేశంలో  కాంగ్రెస్ ఎదురు దెబ్బతిన్నా ఆయన మాత్రం రెండోసారి కూడా ఎంపీగా గెలిచారు. 

ఇందిరమ్మకు ముఖ్య అనుచరుడు

1980లో ఇందిరాగాంధీ కోసం మెదక్ సీటును వదులుకొని మహబూబ్ నగర్ సీటుకు మారారు. అక్కడి నుంచే ఎంపీగా గెలిచి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో రైల్వే శాఖ సహాయ మంత్రి, విద్య, సాంఘిక సంక్షేమ సహాయ మంత్రి, సమాచార- పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా సేవలందించారు. తర్వాత మహబూబ్ నగర్ స్థానం నుంచే 1989, 1991, 1996లలో వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు హయాంలో రైల్వే సహాయ మంత్రి, రక్షణ శాఖల మంత్రిగా కీలక పదవుల్లో 
సేవలందించారు. మంచి నాయకుడిగా, పార్టీలకు అతీతంగా గౌరవం తెచ్చుకున్నారు. 1996 నుంచి మూడేండ్లు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గానూ మల్లికార్జున్ పనిచేశారు.  ఆరుసార్లు ఎంపీగా ఉన్న మల్లికార్జున్ ఇందిరాగాంధీకి ముఖ్య అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ నేతగా కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. పదవిలో ఉన్నా లేకున్నా జీవితాంతం తెలంగాణ డిమాండ్ ను వినిపిస్తూనే వచ్చారు. 

తెలంగాణ కోసం ప్రెజర్​ గ్రూప్​

1990ల్లో కాంగ్రెస్ లోనే అంతర్గతంగా తెలంగాణ వాదులను కలుపుకొని మల్లికార్జున్ ‘తెలంగాణ ఫోరం’ ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం పార్టీపై ఒత్తిడి తేవడానికి ప్రెజర్ గ్రూప్ గా ఈ వేదిక పనిచేసింది.  వివాదాలకు దూరంగా, పేదల సంక్షేమం కోసం పనిచేశారు. పలు అంశాలపై ఆయన స్పష్టమైన, బలమైన అభిప్రాయాలతో ఉండేవారని ఆయన సన్నిహితులు చెబుతారు. 2002 డిసెంబర్ 24న హైదరాబాద్ లో మల్లికార్జున్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన సేవలకు తగిన గుర్తింపు దక్కలేదన్న ఆవేదన తెలంగాణ ఉద్యమకారుల్లో ఉంది.
ఇప్పుడు ఆయన విగ్రహాన్ని చేవెళ్లలో ఆయన కుటుంబం ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని శనివారం పొద్దున హైదరాబాద్ గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ హాల్ లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరుకానున్నారు. ఆయనతో పాటు పలు పార్టీల ప్రముఖ నేతలు, ఇతరులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు.

- ఓపెన్​ పేజీ​ డెస్క్