ఎర్త్ సైన్స్ వర్సిటీలో కొత్తగా 4 డిగ్రీ కోర్సులు.. దోస్త్ స్పెషల్ ఫేజ్లో సీట్ల భర్తీకి చర్యలు

ఎర్త్ సైన్స్ వర్సిటీలో కొత్తగా 4 డిగ్రీ కోర్సులు.. దోస్త్ స్పెషల్ ఫేజ్లో సీట్ల భర్తీకి చర్యలు
  •     అవే సబ్జెక్టుల్లో పీజీ కోర్సులు కూడా..

హైదరాబాద్, వెలుగు: కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్  సింగ్  ఎర్త్  సైన్సెస్  యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరం కొత్తగా నాలుగు డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతున్నారు. బీఎస్సీ జియోఫిజిక్స్, బీఎస్సీ జియోకెమిస్ర్టీ, బీఎస్సీ జియాలజీ, ఎన్విరాన్ మెంటల్  సైన్సెస్ తదితర కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి  ఇచ్చింది. ఒక్కో కోర్సులో 60 సీట్లకు అనుమతి ఇచ్చారు. వీటిని దోస్త్  స్పెషల్  అడ్మిషన్  కౌన్సెలింగ్  ద్వారా భర్తీ చేస్తామని హయ్యర్  ఎడ్యుకేషన్  కౌన్సిల్  చైర్మన్  ప్రొఫెసర్  బాలకిష్టారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 

గతంలో కాకతీయ యూనివర్సిటీకి అనుబంధంగా మైనింగ్  ఇంజినీరింగ్  కాలేజీ ఉందన్నారు. ప్రస్తుతం దీన్ని ప్రభుత్వం యూనివర్సిటీగా అప్​గ్రేడ్​ చేసిందని ఆయన వెల్లడించారు. అయితే, ఈ నాలుగు కోర్సులనూ పీజీలోనూ ప్రవేశపెడతామని చెప్పారు. సీపీగెట్ లోనూ వీటిని అప్​డేట్  చేశామని వివరించారు. కాగా, బుధవారం కొత్తగూడెంలోని వర్సిటీలో విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా వర్సిటీపై సమీక్షించనున్నారు. 

నేడో, రేపో దోస్త్ స్పెషల్  ఫేజ్  షెడ్యూల్ 

ఎర్త్  సైన్సెస్​ వర్సిటీలో కొత్త కోర్సుల భర్తీకి దోస్త్  స్పెషల్  ఫేజ్ అడ్మిషన్  షెడ్యూల్​ను మరో రెండు రోజుల్లో రిలీజ్  చేయనున్నారు. దీనికి సంబంధించి  హయ్యర్  ఎడ్యుకేషన్  కౌన్సిల్  అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మూడు విడతల ​కౌన్సెలింగ్  పూర్తయింది. ఇప్పటి వరకూ 1,41,590 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. 

అయితే,  ఎప్ సెట్ సెకండ్  ఫేజ్  సీట్ల అలాట్మెంట్  పూర్తయ్యాక దోస్త్  షెడ్యూల్ ఇవ్వాలని అధికారులు భావించారు. కానీ, ఎర్త్ సైన్సెస్  వర్సిటీలో అడ్మిషన్ల ప్రక్రియ కోసం షెడ్యూల్  ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 25 లేదా 26న ప్రారంభించి ఆగస్టు ఫస్ట్  వరకూ కొనసాగించాలని డిసైడ్  అయ్యారు.