అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ... ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరో 6 రోజుల్లో వెలువడనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రధాన రాజకీయ పార్టీలన్నింటికి ఒక పెద్ద రాజకీయ పరీక్షగా మారాయి. వాస్తవానికి అన్ని ఎన్నికల అనంతరం కొన్ని పర్యవసానాలు ఉంటాయి. కానీ, బీజేపీ 2024 పార్లమెంటరీ ఎన్నికలలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ రాకపోయినా అత్యధిక లోక్‌సభ స్థానాలలో విజయం సాధించింది. ఆ తర్వాత హర్యానా, మహారాష్ట్ర, బిహార్‌లలో కూడా విజయాలు సాధించడంతో బీజేపీ అపారమైన బలాన్ని పుంజుకుంది. ఎన్డీఏ కూటమి కూడా బలోపేతమైంది.
ప్రస్తుతం ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను పరిగణనలోకి తీసుకుంటే బీజేపీ గతంలో అస్సాం, పుదుచ్చేరిలను మాత్రమే పాలించింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌లను ఇండియా కూటమికి చెందిన డీఎంకే, వామపక్షాలు, టీఎంసీ పాలించాయి. అయితే, ఈ మూడు రాష్ట్రాలలో దేనిలోనైనా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లను గెలుస్తుందనే అంచనాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ, బీజేపీ బెంగాల్, తమిళనాడులలో ఉత్సాహభరితమైన ప్రచారాన్ని విస్తృతంగానే నిర్వహించింది. ప్రతిపక్షాలు కూడా గట్టిగానే ప్రతిఘటించాయి. ఈనేపథ్యంలో బీజేపీ పట్టు సాధించిందా లేదా దేశంలోని అనేక ప్రాంతాలలో ప్రతిపక్షం ఆధిపత్యం కొనసాగుతుందా అనేది ఫలితాలు తెలియజేస్తాయి.
- తమిళనాడు, బెంగాల్ ఇండియా కూటమికి కంచుకోటలు
ప్రస్తుతానికి అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ గెలుస్తుందని అంచనా. కేరళలో కాంగ్రెస్ గెలువచ్చని భావిస్తున్నారు. అయితే, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రాలు కీలకంగా ఉన్నాయి, ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాలలో కలిపి 81 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. 2024లో బీజేపీ ఈ 81 సీట్లలో కేవలం 12 మాత్రమే గెలుచుకుంది. పశ్చిమబెంగాల్, తమిళనాడు రెండూ ప్రతిపక్ష ఇండియా కూటమికి కంచుకోటలు. పశ్చిమ బెంగాల్, తమిళనాడులోని ఫలితాలు 2029లో జరిగే పార్లమెంటు ఎన్నికలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి.
రాబోయే మూడేళ్లలో బీజేపీ అనుసరించే విధానాన్ని రూపుదిద్దుతాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ మంచి పనితీరు కనబరిస్తే తద్వారా 2029 పార్లమెంట్ ఎన్నికలకు దాని మార్గం సుగమం అవుతుంది. కానీ, ఎన్నికల ఫలితాలలో ఒకవేళ వెనకబడితే, ప్రతిపక్షం పుంజుకుని క్రమక్రమంగా ఊపందుకుంటుంది. ప్రతిపక్షాలు ఏకతాటిపై నిలిచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, అధికార బీజేపీని మరింత దూకుడుగా సవాలు చేసే అవకాశం ఉంది.
- మైనారిటీల ఓట్లపై ఆధారపడిన మమత
2021లో మమతా బెనర్జీ వరుసగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, బీజేపీ 294 స్థానాలకుగాను 77 స్థానాలను గెలుచుకుంది. అప్పటి నుంచి బెంగాల్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. అధికార టీఎంసీని దీటుగా ఎదుర్కొంటూ రాజకీయాలను కొనసాగిస్తోంది. మరోవైపు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానంగా సుమారు 32% మైనారిటీ (ముఖ్యంగా ముస్లిం) ఓట్లపై ఆధారపడుతున్నారు. దాదాపు 100 అసెంబ్లీ స్థానాలలో ముస్లింల ప్రాబల్యం ఉన్నది. గతంలో మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ వాటన్నిటినీ గెలుచుకున్నది.
ఈ మైనారిటీ ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవడంపై ఆమె రాజకీయ వ్యూహం కేంద్రీకృతమై ఉంది. ఇక మిగిలిన 194 అసెంబ్లీ స్థానాలలో.. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆమెకు కేవలం 50 సీట్లు మాత్రమే అవసరం. వాస్తవానికి ముస్లింల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం లేదు. అందువల్ల మిగిలిన 194 స్థానాలలో చాలా పెద్ద వాటాను బీజేపీ సాధించాలి. బహుశా 140కి పైగా సీట్లను గెలుపొందవలసి ఉంటుంది. ఇది బీజేపీకి ఒక ముఖ్యమైన సవాలు.
- హిందూ ఓట్ల ఏకీకృతంపై దృష్టి సారించిన బీజేపీ
బీజేపీ ప్రధానంగా హిందూ ఓట్లను ఏకీకృతం చేయడంపై దృష్టి సారించింది. రాజకీయ హింసపై ఆందోళనలు, మమతా బెనర్జీ పాలనపైన విమర్శలపై బీజేపీ ఆధారపడుతోంది. అదేవిధంగా అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ.. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల వంటి సమస్యలను కూడా లేవనెత్తుతోంది. మొదటి దశ ఎన్నికల తర్వాత బీజేపీ ఆశాజనకంగా కనిపిస్తోంది. బీజేపీ నాయకులలో ఇది నిజమైన ఉత్సాహమా లేక కేవలం ప్రచార వ్యూహమా అనేది అస్పష్టంగా ఉంది.
బీజేపీ బలం 120 సీట్లను దాటితే అది మమతా బెనర్జీకి వ్యతిరేకంగా హిందువుల బలమైన ఏకీకరణను సూచిస్తుంది. బీజేపీకి పెరిగిన బలం మమతా బెనర్జీ పాలనను మరింత కష్టతరం చేయవచ్చు. అయితే, టీఎంసీ బలమైన మైనారిటీ ఓటు బ్యాంకును కలిగి ఉన్నందున బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంత సులభం కాదు. ఒకవేళ బీజేపీ పశ్చిమబెంగాల్‌లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, అది 2029 ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఐక్యతకు తీవ్రమైన సవాలును విసురుతుంది.
మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ 'ఇండియా' కూటమిలో
భాగమైనప్పటికీ కాంగ్రెస్ ఆమెపై తీవ్రంగా విమర్శలు చేసింది. కొంతమంది కాంగ్రెస్ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపవచ్చని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఫలితాల తర్వాత మమత ఘనవిజయం సాధించి వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఆమెకు, కాంగ్రెస్‌కు మధ్య సంబంధాలు దెబ్బతినవచ్చు. బెంగాల్‌లో రాహుల్ గాంధీ ప్రచారం చూస్తే..మమతా బెనర్జీ ఓడిపోవచ్చని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడులో డీఎంకేకు సానుకూలం తమిళనాడు సీఎంగా ఎం.కె. స్టాలిన్ ఆత్మవిశ్వాసంతో, అనుభవజ్ఞుడిగా కనిపిస్తున్నారు. ఆయన పార్టీ డీఎంకే 2019 పార్లమెంటరీ ఎన్నికలలో, 2021 అసెంబ్లీ ఎన్నికలలో ఆధిపత్యం చెలాయించింది. అదేవిధంగా 2024 పార్లమెంట్ ఎన్నికలలో ఘన విజయం సాధించింది. అందువల్ల, 2026 అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే సానుకూల పవనాలతో సునాయాసంగా గెలుస్తుందని భావిస్తున్నారు. అయితే, తమిళనాట రాజకీయాల్లో ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది. ప్రముఖ నటుడు విజయ్ బలమైన పోటీదారుగా రాజకీయాల్లోకి ప్రవేశించాడు. విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలకు సవాలుగా నిలిచింది. సంప్రదాయకంగా డీఎంకేకు కంచుకోటగా ఉన్న మైనారిటీలతో సహా, ఇతర పార్టీల ఓటర్లలోని కొన్ని వర్గాలను ఆయన ఆకట్టుకున్నారు. ఎన్నికలు ముగిశాయి. విజయ్ బాగా రాణించారనే భావన ఉంది. ఫలితాన్ని ప్రభావితం చేసేంతగా ఆయన డీఎంకే నుంచి తగినన్ని ఓట్లను తనవైపు తిప్పుకోగలిగారా లేదా అనేది వేచి చూడాలి.
- అనూహ్య పరిణామాలు
ఎన్నికలు సమీపించిన సాధారణ పరిస్థితులలో పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ గెలుస్తారని చాలామంది భావించారు. అయితే, అనూహ్య పరిణామాలు అనిశ్చితిని, ఉద్రిక్తతను సృష్టించాయి. తమిళనాడు, బెంగాల్ ఫలితాలు ఎన్డీఏ, ఇండియా కూటమి రెండింటిపైనా గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. బీజేపీ ఈ రెండు రాష్ట్రాలలో అభివృద్ధి పేరుతో గణనీయమైన రాజకీయ పెట్టుబడి పెట్టింది. కాబట్టి 2021తో పోలిస్తే బీజేపీ కనీసం తన పనితీరును అయినా మెరుగుపరుచుకోవాలి. లేకపోతే, తగినంత ప్రయోజనాలు పొందకుండానే ఆ పార్టీ తన సామర్థ్యానికి మించి ప్రయత్నించిందనే అభిప్రాయం ఏర్పడవచ్చు. మే 4, 2026న వెలువడే ఫలితాలు 2029 పార్లమెంటు ఎన్నికల వరకు రాజకీయ ముఖచిత్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఒకవేళ మమతా బెనర్జీ లేదా స్టాలిన్ ఓడిపోతే, అది ఒక రాజకీయ ప్రకంపనగా మారుతుంది.
- రాజకీయ శక్తిగా విజయ్
తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే ఓడిపోతే అది ఒక రాజకీయ ప్రకంపనగా మారుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా రెండు ద్రావిడ పార్టీల ఆధిపత్యంలో కాకుండా, తమిళనాడు బహుళ ధ్రువ రాజకీయ వ్యవస్థ వైపు పయనించవచ్చని దీని అర్థం. విజయ్ గణనీయమైన ఓట్లు లేదా సీట్లు గెలుచుకుంటే, ఆయన తమిళనాడులో ఒక శాశ్వత రాజకీయ శక్తిగా మారతారు. ద్రావిడ రాజకీయాలను విజయ్ పునర్నిర్మిస్తారనడంలో సందేహం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా డీఎంకే ఓడిపోతే, అది పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూరుస్తుంది. బీజేపీ వ్యతిరేక, అత్యంత బలమైన రాష్ట్ర ప్రభుత్వాలలో ఒకదాని ఓటమి ప్రతిపక్ష ఇండియా కూటమిని బలహీనపరుస్తుంది. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి ఉన్న అతిపెద్ద మిత్రపక్షాలలో డీఎంకే ఒకటి కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కూడా డీఎంకే ఓటమితో ప్రభావితమవుతుంది.
- డా. పెంటపాటి పుల్లారావు,
పొలిటికల్ ఎనలిస్ట్
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.

