వీసీతో పంజాబ్ మంత్రి దురుసు ప్రవర్తన

వీసీతో పంజాబ్ మంత్రి దురుసు ప్రవర్తన

ఫరీద్ కోట్: పంజాబ్ లోని బాబా ఫరీద్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రాజ్ బహదూర్ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చేతన్ సింగ్ జౌరమజ్రా ప్రవర్తనతో మనస్తాపానికి గురైన వీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. శుక్రవారం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చేతన్ సింగ్ జౌరమజ్రా...  గురు గోవింద్ సింగ్ మెడికల్ హాస్పిటల్‌ను సందర్శించి అక్కడి మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ క్రమంలో పేషెంట్ల కోసం వాడుతున్న పరుపులు పాడైపోవడం చూసిన మంత్రి  వీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆ పరుపు మీద పడుకోవాలని వీసీని మంత్రి ఆదేశించారు. దీంతో ఏం చేయాలో పాలుపోని వీసీ... మంత్రి ఆదేశాన్ని పాటిస్తూ హాస్పిటల్ బెడ్ పై పడుకున్నారు. అయితే ఈ ఘటనతో వీసీ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  తీవ్ర మనస్తాపం చెందిన వీసీ... తన పదవికి రాజీనామా చేశారు.

ఇకపోతే.. వైస్‌ఛాన్సలర్‌తో ఆరోగ్య మంత్రి దురుసుగా ప్రవర్తించిన తీరుపై ప్రతి పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డాక్టర్ రాజ్ బహదూర్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైద్యులని, అలాంటి వ్యక్తితో ప్రవర్తించే తీరు ఇది కాదని మండిపడ్డారు. మంత్రి దురుసు ప్రవర్తన వల్లే వీసీ రాజీనామా చేశారని బీజేపీ నేత సునీల్ జకార్ ఆరోపించారు.