నాటకాలు యూట్యూబ్​కు​ ఎక్కినయ్​

నాటకాలు యూట్యూబ్​కు​ ఎక్కినయ్​

వందల టీవీ ఛానెళ్లు. స్ర్కీన్​​కి అతుక్కుపోయేలా చేసే సీరియల్స్​. థియేటర్స్​లో వారానికో కొత్త సినిమా. ఎక్స్​ట్రా ఎంటర్​టైన్​మెంట్​కి యూట్యూబ్​, ఓటీటీ ఉండనే ఉంది. మరి ఇవేం లేని రోజుల మాటేంటి? ఆ రోజుల్లో నాటకాలే వన్​ అండ్​ ఓన్లీ ఎంటర్​టైన్​మెంట్​. నాటకం అంటే చిన్నా పెద్దా.. ముసలి ముతకా అందరూ రెప్పవాల్చకుండా చూసేవాళ్లు. కానీ, ఇప్పుడు సెల్​ఫోన్​లే సినిమా టాకీస్​ అవ్వడంతో నాటకాలు చూసేవాళ్ల సంఖ్య బాగా తగ్గింది. ఆ సంఖ్యని మళ్లీ పెంచడానికి... కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన స్టేజ్​ ఆర్టిస్ట్​లని ఆదుకోవడానికి ఒక ఆలోచన చేశాడు అభినయ శ్రీనివాస్​​. అదే యూట్యూబ్​లో నాటకాల స్ట్రీమింగ్​. 

టీవీ కన్నా ముందే ఓటీటీల్లో సీరియల్స్​ 

టెలికాస్ట్​ అవుతున్నాయి. థియేటర్​లో రిలీజ్​ అయిన నెలకే సినిమాలు కూడా ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్స్​లోకి వచ్చేస్తున్నాయి. రియాలిటీ షోలు యూట్యూబ్​లో లక్షల వ్యూస్​ కొల్లగొడుతున్నాయి. వీటన్నింటికీ ఆన్​లైన్​ మార్కెట్​ అయినప్పుడు మరి నాటకాల్ని ఎందుకు పక్కనపెట్టాలి. ఈ ఆలోచనతోనే నాటకాల్ని కూడా ఆన్​లైన్​లో పెట్టాలనుకున్నాడు అభినయ శ్రీనివాస్​. అందుకోసం ‘ట్రై కలర్’​ అనే యూట్యూబ్ ఛానెల్​ పెట్టాడు. ఒకప్పటి సూపర్​హిట్ తెలుగు నాటకాల్ని అందులో పోస్ట్​ చేశాడు. యూట్యూబ్​​ లైవ్​లో ఆర్టిస్ట్​లతో కొన్ని నాటకాలు కూడా వేయించాడు. వాటికి మంచి ఆదరణ రావడంతో  ఇతర రాష్ట్రాలు, దేశాల వాళ్లు కూడా శ్రీనివాస్​ని కాంటాక్ట్​ అయ్యారు. వాళ్లు వేసిన నాటకాల్ని కూడా యూట్యూబ్​లో పెట్టమని అడిగారు. 

కళను బతికించడానికి శ్రీనివాస్​ చేస్తున్న కృషికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్​ మామిడి హరికృష్ణ అండగా నిలిచాడు. ప్రస్తుతం శ్రీనివాస్​​ తెలుగుతో పాటు కన్నడ, హిందీ, మరాఠి, తమిళ, బెంగాలీ, మణిపూరి, అస్సామీ, నేపాలీ, మలయాళీ నాటకాల్ని కూడా తన యూట్యూబ్​ ఛానెల్​లో పెడుతున్నాడు. చిన్నపిల్లల నాటకాల్ని  కూడా యూట్యూబ్​లో  స్ట్రీమ్​ చేస్తున్నాడు. బంగ్లాదేశ్, ఇరాన్, నేపాల్, ఫ్రాన్స్, బహ్రెయిన్, సౌదీ అరేబియా దేశాల్లోని పాపులర్​ నాటకాల్ని కూడా ఆయా భాషాల్లో  యూట్యూబ్​లో టెలికాస్ట్ చేస్తున్నాడు.  దాదాపు ఆరు దేశాల నాటకాల్ని  లైవ్ ద్వారా అందిస్తున్నాడు. ఒక పక్క కళకి ప్రాణం పోస్తూ.. వ్యూస్​ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన పేద కళాకారులకి ఇస్తున్నాడు శ్రీనివాస్​. 

మంచి ఆదరణ వస్తోంది

‘కరోనా చాలామంది బతుకుల్ని ఆగం చేసింది. వాళ్లలో నాటక రంగాన్ని  నమ్ముకొని బతికేవాళ్లూ ఉన్నారు. ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్లు. అందుకే అన్ని భాషల్లో హిట్టైన నాటకాల్ని యూట్యూబ్​లో​  పెడుతున్నాం. ప్రతిరోజూ మధ్యాహ్నం మూడింటికి ఒక నాటకాన్ని టెలికాస్ట్​ చేస్తున్నాం. ఆన్​లైన్​లో తమ ​ నాటకాలు చూసి కళాకారులు చాలా హ్యాపీగా ఉన్నారు. పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని చెబుతున్నారు. వివిధ దేశాల నుంచి కూడా ఈ ఆన్​లైన్ నాటకాల కాన్సెప్ట్​కి మంచి  ఆదరణ వస్తోంది. ఫ్యూచర్​లో  మరిన్ని మంచి నాటకాల్ని ప్రేక్షకులకి పరిచయం చేస్తా’ అభినయ థియేటర్ ట్రస్ట్ ప్రెసిడెంట్ అభినయ శ్రీనివాస్ అన్నారు. 

ఫ్యూచర్​లోనూ కొనసాగిస్తాం

‘సినిమాలు, సీరియళ్లలాగా నాటకాలకి  కూడా ఆన్​లైన్​లో మంచి ఆదరణ వస్తోంది. తెలుగు భాష, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్న వీటిని  చిన్నాపెద్దా అందరూ  ఇష్టపడుతున్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల వాళ్లు కూడా తమ నాటకాలు ప్రదర్శించమని అడుగుతున్నారు.  నాటక సంగీత అకాడమి ద్వారా చిన్నపిల్లల నాటకాలను కూడా యూట్యూబ్​లో పెడుతున్నాం. వీటి ద్వారా వచ్చిన డబ్బుని పేద కళాకారుల బాగుకోసమే ఉపయోగిస్తున్నాం. ఫ్యూచర్​లో కూడా ఈ మంచి పనిని కొనసాగిస్తాం. నాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం’ అని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ చెప్పారు.