గాన కోకిలకు జాతీయ జెండా కప్పి సైనికుల సెల్యూట్

గాన కోకిలకు జాతీయ జెండా కప్పి సైనికుల సెల్యూట్

భారత రత్న, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (92) ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. భారత గాన కోకిల నిష్క్రమణతో దేశమంతా శోక సంద్రంలో మునిగిపోయింది. రాష్ట్రపతి, ప్రధాని మొదలు.. సామాన్యుల వరకు అంతా ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. సంగీత ప్రపంచానికి ఆమె లేని లోటు ఎన్నటికీ తీర్చలేదని సంతాపం తెలిపారు. 13 ఏళ్ల వయసులో తొలి పాట పాడిన లతా మంగేష్కర్ దేశ గర్వించదగ్గ స్థాయికి ఎదిగారు. 

అంతిమ యాత్రకు వేలాదిగా వచ్చిన అభిమానులు

లతా మంగేష్కర్‌‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ, సహా పలువురు కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర మంత్రులు, బాలీవుడ్ ప్రముఖులు ప్రత్యక్షంగా వెళ్లి నివాళి అర్పించారు. దేశం గర్వించదగ్గ సింగర్‌‌గా గుర్తింపు సంపాదించుకున్న ఆమె అంత్యక్రియలను సైనిక, ప్రభుత్వ అధికార లాంఛనాలతో చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ముంబైలోని ఆమె ఇంటి వద్ద నుంచి అంతిమయాత్ర ప్రారంభించే ముందు భారత సైనికులు ఆమె పార్థివ దేహంపై జాతీయ జెండా కప్పి.. సెల్యూట్ చేశారు. అనంతరం తమ భుజాలకు ఆమె భౌతిక కాయాన్ని ఎత్తుకుని ఆర్మీ వాహనంలోకి ఎక్కించారు. అక్కడి నుంచి ముంబైలోని శివాజీ పార్క్‌ వరకు సాగిన అంతిమ యాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొని ఆ మధుర గాయనికి అశ్రు నివాళి అర్పించారు.

ప్రధాని మోడీ అంతిమ నివాళి

ప్రధాని నరేంద్ర మోడీ ముంబైలోని శివాజీ పార్క్‌కు చేరుకుని లతా మంగేష్కర్‌ను కడసారి చూపు చూసి.. నివాళి అర్పించారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధావ్ థాక్రే, మంత్రి ఆదిత్య థాక్రే కూడా లతాజీకి ఘన నివాళులర్పించారు. అలాగే ప్రముఖ బాలీవుడ్ స్టార్ షారుఖాన్ సతీ సమేతంగా లతాజీ భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. సచిన్ టెండుల్కర్ కూడా భార్యతో కలిసి లతాజీకి నివాళులర్పించారు. అయితే అంతకు ముందు సైనికులు ఆమె పార్థివ దేహానికి గౌరవ వందనం సమర్పించారు. పోలీసులు, మిలిటరీ బ్యాండ్‌తో ఆమెకు అంతిమ నివాళి అర్పించారు.

మరిన్ని వార్తల కోసం..

ఇండియాలో కొత్త ట్రెండ్.. ఇక ఆ కంపెనీలో వారం వారం జీతం

లతా మంగేష్కర్ చివరిగా పాడిన పాట ఇదే

రోజూ నిద్రలేవగానే లతా దీదీ మొఖమే చూసేవాడ్ని