కుర్రాళ్లను ద్రవిడ్ చాంపియన్లుగా మార్చగలడు

కుర్రాళ్లను ద్రవిడ్ చాంపియన్లుగా మార్చగలడు

లెజెండరీ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్‌పై మరో దిగ్గజ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల జల్లులు కురిపించాడు. శ్రీలంక పర్యటనలోని యువ భారత జట్టుకు కోచ్‌గా ఉన్న ద్రవిడ్.. యంగ్ ప్లేయర్లను చాంపియన్లుగా మారుస్తాడంటూ లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఓ ఆటగాడిగా భారత జట్టుకు ఆడుతున్నప్పుడు ద్రవిడ్ ఆటను ఆస్వాదించేవాడని.. ఆ తర్వాత అండర్ 19, ఇండియా ఏ జట్లకు కోచ్‌గా పని చేస్తున్నప్పుడూ అలాగే ఉన్నాడని తెలిపాడు. ఇప్పుడు భారత యువ జట్టుకు కోచింగ్ బాధ్యతలు తీసుకున్నా.. ద్రవిడ్‌పై అదనపు ఒత్తిడి ఉండదన్నాడు. 

‘ఇండియన్ క్రికెట్‌లో భవిష్యత్ స్టార్‌లను తయారు చేసేందుకు లంక టూర్‌ రూపంలో ద్రవిడ్‌కు ఓ చాన్స్ దక్కింది. ద్రవిడ్‌పై ఒత్తిడి ఉంటుందని నేను అనుకోను. టీమ్ ఇండియా బెంచ్ స్ట్రెంగ్త్ పెంచిన క్రెడిట్ అతడికే ఇవ్వాలి. ఇండియా ఏ కోచ్‌గా, నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా సక్సెస్ అయిన ద్రవిడ్‌కు.. కోచ్‌గా తనను తాను నిరూపించుకోవడానికి అతడికి ఇదో మంచి అవకాశమనే చెప్పాలి. రాహుల్‌తో సమయం వెచ్చించడం, అతడి అనుభవాలను తెలుసుకోవడం యువ ఆటగాళ్లకు ఎంతో లాభిస్తుంది. లంక పర్యటనలో ఆడుతున్న ప్లేయర్లలో చాలా మంది ద్రవిడ్ నేతృత్వంలో రాటుదేలిన వారే. కాబట్టి ఫ్యూచర్ చాంపియన్‌లుగా ఎదగడానికి వారికి మరో మంచి చాన్స్ దక్కినట్లే’ అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.