కుటుంబంతో కలిసి బయటకు రాగా కాలర్​ పట్టి గుంజిన్రు

కుటుంబంతో కలిసి బయటకు రాగా కాలర్​ పట్టి గుంజిన్రు
  • పెట్రోల్ మీద పోసుకున్న బాధితుడు  
  • పోలీసులను అడ్డుకొని నిరసన తెలిపిన జనాలు
  • అదనపు సిబ్బంది రాకతో ఉద్రిక్తత

హనుమకొండ సిటీ, వెలుగు : నడుచుకుంటూ వెళ్తున్న ఒకరికి..డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్​ చేయడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పెగడపల్లి డబ్బాల వద్ద పోలీసులను అడ్డుకుని నిరసన తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం..పెగడపల్లి డబ్బాల ప్రాంతంలో ఓ  బార్ మరో వైన్స్ నడుస్తుండగా ట్రాఫిక్ పోలీసులు సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. మందు తాగిన ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి సరుకులు కొనేందుకు సెంటర్​కు వెళ్లాడు. స్వీట్ షాపులో పెరుగు కొంటుండగా ఓ కానిస్టేబుల్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కోసం రావాలంటూ కాలర్ పట్టి గుంజాడు. దీంతో అతడి షర్ట్ చినిగింది. నడుచుకుంటూ వెళ్తున్న తనపై దౌర్జన్యం చేయడాన్ని నిరసిస్తూ అతడు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. ఇదంతా గమనిస్తున్న జనాలు, బార్ షాప్ ముందు ఉన్నవారు ఒక్కసారిగా పోలీస్ జీప్ వద్దకు వచ్చారు. చేసుకుంటే బతికే లేబర్ అడ్డా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి వేలాది రూపాయలు ఫైన్ రాయడాన్ని తప్పుపట్టారు. దీంతో పోలీసులు, జనాల మధ్య వాగ్వాదం జరిగింది. జనాల  నుంచి నిరసనతో అలర్టయిన పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి సిబ్బందిని అక్కడికి రప్పించారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన పోలీసులు సదరు వ్యక్తిని వదిలేశారు. దీంతో అందరూ వెళ్లిపోయారు. ఈ విషయమై కాకతీయ యూనివర్సిటీ పోలీసులు వివరణ ఇస్తూ..తమ సిబ్బంది తప్పేం లేదని.. మద్యం మత్తులో ఉన్న కొందరు కావాలనే తమ డ్యూటీకి ఆటంకం కలిగించారని చెప్పారు.