సర్కారు దవాఖాన్లల్ల తాగునీళ్ల గోస..మూలకుపడ్డ ఆర్వో ప్లాంట్లు, ఫ్రిజ్‌లు

సర్కారు దవాఖాన్లల్ల తాగునీళ్ల గోస..మూలకుపడ్డ ఆర్వో ప్లాంట్లు, ఫ్రిజ్‌లు
  • సర్కారు దవాఖాన్లల్ల తాగునీళ్ల గోస
  • మూలకుపడ్డ ఆర్వో ప్లాంట్లు, ఫ్రిజ్‌లు
  • పేషెంట్ల కోసం వాటర్ బాటిళ్లు కొంటున్న బంధువులు
  • ఐసీయూల్లో ఏసీలు, వార్డుల్లో ఫ్యాన్లు పనిచేస్తలే
  • ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న రోగులు

నెట్‌వర్క్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు దవాఖాన్లలో రోగులు, వాళ్ల అటెండెంట్లకు గుక్కెడు తాగునీళ్లు దొరుకుతలెవ్వు. ఓవైపు ఎండలు మండుతున్నా తాగునీటి వసతి కల్పించడంపై ఆఫీసర్లు దృష్టిపెట్టలేదు. చాలా ఆసుపత్రుల్లో నిర్వహణ లేక ఆర్వో ప్లాంట్లు, ఫ్రిజ్‌లు మూలకు పడినా రిపేర్లు మాత్రం చేయించలేదు. దీంతో రోగుల బంధువులు బాటిళ్లు పట్టుకొని ఆసుపత్రుల బయట పబ్లిక్ నల్లాలు, చలివేంద్రాల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఈ మాత్రం ఆధారం కూడా లేని చోట్ల వాటర్ బాటిళ్లు కొని గొంతు తడుపుకుంటున్నారు. మరోవైపు హాస్పిటల్స్​లోని ఐసీయూల్లో ఏసీలు, వార్డుల్లో ఫ్యాన్లు పనిచేయక రోగులు, వాళ్ల అటెండెంట్లు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఇండ్ల నుంచి టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. రాష్ట్రంలో 21 జిల్లా ఆసుపత్రులు, 38 ఏరియా హాస్పిటళ్లు, 109 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. చాలా ఆసుపత్రుల్లోని ఐసీయూల్లో ఏసీలు పనిచేయడం లేదు. వార్డుల్లో ఫ్యాన్లు తిరగడం లేదు.

నీళ్ల కోసం ఇక్కట్లు

కొన్ని ఆసుపత్రుల్లో తాగునీళ్లు లేవు. ఆర్వో ప్లాంట్లు, ఫ్రిజ్​లు నిర్వహణ లేక మూలపడ్డాయి. ఎండలు మండుతున్నా వాటికి రిపేర్లు చేయించే నాథులు లేరు. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎంలో తాగు నీటికి ఇబ్బందులు తప్పడం లేదు. ఓపీ సేవల కోసం వెళ్లినా, ఇన్ పేషెంట్ గా అడ్మిట్ అయినా దూప తీర్చుకోవడానికి బాటిల్ తీసుకెళ్లాల్సిందే. హాస్పిటల్ ఆవరణలో బాల వికాస ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంట్లే రోగులకు దిక్కవుతున్నాయి. ఇక్కడ రూపాయికి అర లీటర్ చొప్పున అమ్ముతున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ మొదటి అంతస్తులో ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదు. ఇక్కడి మూడు ఫ్లోర్లలో అన్ని వార్డుల్లో కలిపి 400 మంది ఇన్ పేషెంట్లు, వారి అటెండెంట్లు ఉండగా, ఏ ఒక్క ఫ్లోర్​లోనూ తాగునీటి కోసం ఫ్రిజ్ లు అందుబాటులో లేవు. దీంతో హాస్పిటల్ ఎదుట ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన తాగునీటి సెంటర్ నుంచే రోగుల బంధువులు నీళ్లు తెచ్చుకుంటున్నారు. మూడు ఫ్లోర్లు దిగడం.. ఎక్కడం కష్టంగా ఉందని వాపోతున్నారు. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఒక వార్డుకు రోజుకు ఒక బిబో బాటిల్ మాత్రమే ఇస్తుండడంతో వాటిని నర్స్ లు, సెక్యూరిటీ గార్డులే వాడుకుంటున్నారు. పేషెంట్లు, వారి సహాయకులకు తాగునీరు ఇవ్వకపోవడంతో బయట కొంటున్నారు. ఏజెన్సీకి పెద్ద దిక్కుగా ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో తాగునీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. రోజుకు 500 మంది పేషెంట్లు వచ్చే ఈ ఆసుపత్రిలో ఎలాంటి వాటర్​ఫెసిలిటీ లేకపోవడంతో బయట రూ.10కి 2 లీటర్ల నీళ్లు కొనుక్కుంటున్నారు. మహబూబ్​నగర్ జనరల్ హాస్పిటల్ ఎంట్రన్స్​లో ఉన్న ఫిల్టర్ వాటర్ ఫ్రిజ్ పనిచేయడం లేదు. సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలోని ఏకైక వాటర్ ఫ్రిజ్ మూలకుపడింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని వంద పడకల ఆసుపత్రిలోని ఆర్ఓ ప్లాంట్ పనిచేయడం లేదు. గజ్వేల్ లోని వంద పడకల ఆసుపత్రిలో రెండు నల్లాలు ఏర్పాటుచేయగా, రోగులు, వారి అటెండెంట్లకు సరిపోవడం లేదు. దీంతో బయట కొంటున్నారు. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో వాటర్ ఫిల్టర్ పని చేయడం లేదు. పేషెంట్లు, వారి సంబంధీకుల కోసం ఓ డబ్బా ఏర్పాటు చేశారు. ఇందులో పోసే నీళ్లు ఏ మాత్రం సరిపోక బయట కొని తెచ్చుకుంటున్నారు.

ఐసీయూల్లో ఏసీల్లేవ్

కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో హెల్దీగా ఉన్నవారు సైతం ఎండవేడికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో ఏసీలు, ఫ్యాన్లు పనిచేయకపోవడంతో రోగులు అల్లాడుతున్నారు. కరీంనగర్ జిల్లా హాస్పిటల్ లోని ఏసీలు పని‌‌చేయక ఏడాదికిపైగా అవుతోందని సిబ్బంది చెప్పారు. ‌‌బయట పేషెంట్ బంధువులు కూర్చునే వెయిటింగ్ హాల్ లో ఫ్యాన్లు పని చేయడం లేదు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలోని జనరల్ ఐసీయూ, సర్జికల్​వార్డుల్లో ఏసీలు పనిచేయడం లేదు. భూపాలపల్లి జిల్లా చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రంలోని ప్రసూతి వార్డులో రెండు ఏసీలకుగాను రెండు పనిచేయడం లేదు. 

కరీంనగర్ జిల్లా హాస్పిటల్‌‌లోని రెండు ఐసీయూల్లో కలిపి 15 బెడ్స్ ఉన్నాయి. ఒక ఐసీయూలో నాలుగు ఏసీలు ఉంటే ఒక్కటి కూడా పని చేయడం లేదు. ఇంకో ఐసీయూలో మూడు ఏసీలు ఉంటే ఒకటే పని చేస్తున్నది. దీంతో ఏసీలకు బదులు ఫ్యాన్లతో నెట్టుకొస్తున్నారు. గాలి ఆడక కిటికీలు తెరిచిపెట్టడంతో దుమ్ము, ధూళి లోపలికి వస్తున్నది.‌‌ మధ్యాహ్నం వడగాడ్పులతో పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు.

దవాఖాన లోపల్నే పెట్టాలె

ఎంజీఎంలో తాగునీటి సౌలతి లేక ఇబ్బంది పడ్తున్నం. వార్డుల్లో ఎక్కడా తాగునీటికి ఏర్పాట్లు లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో బయట కొనుక్కుని తాగుతున్నం. ఎండాకాలం వల్ల నీళ్లు ఎక్కువ తాగాల్సి వస్తోంది. నీళ్ల కోసం ఆ చివరి నుంచి ఈ చివరికి రావాలంటే ఇబ్బంది అయితాంది. ఆసుపత్రి లోపల్నే వార్డుల వద్ద తాగునీటిని అందించేలా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది.

- మహేందర్, గవిచర్ల, సంగెం 
మండలం, వరంగల్ జిల్లా

తిప్పలు పడ్తున్నం

బిడ్డ డెలివరీ కోసం రెండు రోజుల క్రితం కామారెడ్డి గవర్నమెంట్ దవాఖానకు వచ్చినం. ఇక్కడ తాగు నీళ్లు కూడా లేవు. బయట నుంచి కొనుక్కొచ్చుకున్నం. హోటల్లో రూ.10  ఇస్తే లీటర్ బాటిల్ నింపి ఇస్తున్రు. టాయిలెట్లలో కూడా నీళ్లు సరిగ్గా వస్తలేవు. చాలా తిప్పలు పడుతున్నాం.
- లక్ష్మి, గాంధారి, కామారెడ్డి జిల్లా

మహబూబాబాద్ జనరల్ హాస్పిటల్‌లోని మూడు గైనిక్ వార్డుల్లో ఎనిమిది ఏసీలకుగాను ఒకటి మాత్రమే పనిచేస్తున్నది. వేసవి నేపథ్యంలో ఇటీవల రెండు కూలర్లు తెచ్చి పెట్టినా అవి పనిచేయకపోవడంతో పక్కనపడేశారు. దీంతో పిల్లలు, తల్లులు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.