కామారెడ్డి జిల్లాలో ముంచుకొస్తున్న తాగునీటి ముప్పు

కామారెడ్డి జిల్లాలో ముంచుకొస్తున్న తాగునీటి ముప్పు
  • కామారెడ్డి జిల్లాలో తాగునీటి ఎద్దడి
  • కొన్ని ప్రాంతాల్లో వారానికి రెండు, మూడు రోజులే సరఫరా 
  • ఇండ్లలోని బోర్లలో తగ్గుతున్న నీటి ధారలు
  • వ్యవసాయ బోర్ల వద్ద నీళ్లు తెచ్చుకుంటున్న తండాలవాసులు 

కామారెడ్డి​, వెలుగు : జిల్లాలో తాగునీటి ఎద్దడి రోజురోజుకూ పెరుగుతున్నది. ఎండాకాలంలో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.  కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో లక్ష జనాభా ఉంటుంది. నిత్యం 10 ఎంఎల్​డీ నీటి సరఫరా కావాల్సి ఉంది.   ప్రస్తుతం మిషన్​ భగీరథ ద్వారా 2.8 ఎంఎల్​డీ  నీళ్లు మాత్రమే సప్లయ్ అవుతున్నాయి.  పెద్ద చెరువు, బుర్రమత్తడి నుంచి టౌన్​కు నీటి  సరఫరా అవుతుంది. ఆయా కాలనీల్లో వారంలో రెండు, మూడు రోజులే నల్లాలు వస్తున్నాయి.  పైపులైన్ల లీకేజీలు,  టెక్నికల్​ ప్రాబ్లమ్స్​ ఏర్పడినప్పుడు  మరింత సమస్య ఏర్పడుతుంది.  ఎన్జీవోస్​కాలనీ, కాకతీయనగర్, అశోక్​నగర్, విద్యానగర్,  శ్రీరాంనగర్​కాలనీ, వివేకానంద కాలనీ తదితర ఏరియాల్లో బోర్లలో నీటి ధారలు తగ్గాయి. 

ఇంకా పూర్తి కాని పైపులైన్​ మరమ్మతు పనులు..

శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు నుంచి కామారెడ్డి ఏరియాకు తాగునీరు సప్లయ్​ చేసే మెయిన్ పాత పైపులైన్ స్థానంలో కొత్త పైపులైన్​ ఏర్పాటు పనులు పూర్తి కాలేదు.  ప్రాజెక్టు నుంచి సదాశివనగర్ మండలం మల్లన్నగుట్ట వద్ద ఉన్న మిషన్​ భగీరథ ప్లాంట్ వరకు కొత్త పైపులైన్ వేస్తున్నారు. పాత పైపులైన్​ తరచుగా లీకేజీ అవుతుండడంతో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాలకు నీటి సప్లయ్​లో అంతరాయం ఏర్పడుతున్నది.  కామారెడ్డి పట్టణంలో రూ.90 కోట్లతో చేపట్టాల్సిన అమృత్​జల్​ స్కీమ్​ కింద పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. జిల్లా కేంద్రంలో నీటి ఎద్దడి సమస్య రాకుండా చూడాలని మంగళవారం కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఇటీవల గ్రామాల్లో నీటి సమస్యపై అధికారులు వివరాలు సేకరించారు.  అందుబాటులో ఉన్న బోర్లను రిపేర్​ చేయించారు. 

తండాల్లో సమస్య ..

మాచారెడ్డి మండలంలోని పలు తండాల్లో మిషన్​ భగీరథ ద్వారా  నీటి సప్లయ్ కావడం లేదు. తండాల వాసులు  వ్యవసాయ బోర్ల వద్ద నీటిని తెచ్చుకుంటున్నారు.   సోమర్​పేట, బంజేపల్లి, అంకిరెడ్డిపల్లి, కొత్తగూడెం తండా  తదితర  ఏరియాల్లో  మిషన్​ భగీరథ ద్వారా నీటి సప్లయ్​లో అంతరాయం వస్తుందని స్థానికులు తెలిపారు.   జిల్లాలోని ఏ పంచాయతీలో కూడా నీటి సమస్య లేకుండా మిషన్​ భగీరథ ద్వారా సప్లయ్​ చేస్తున్నామని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.