డ్రైవింగ్ లైసెన్స్​కు విద్యార్హత కండిషన్…

డ్రైవింగ్ లైసెన్స్​కు విద్యార్హత కండిషన్…

న్యూ ఢిల్లీ: ట్రాన్స్ పోర్టు లైసెన్స్ పొందడానికి కనీస విద్యార్హత కండిషన్​ను ఎత్తివేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం, సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్-1989లోని రూల్ 8 ప్రకారం ట్రాన్స్ పోర్టు వెహికిల్ నడిపే డ్రైవర్​ఎనిమిదో తరగతి పాసై ఉండాలి. ఇందులో రూల్ 8 ని సవరించడానికి ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించామని, ఈ విషయంలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదలవుతుందని రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. వెనుకబడిన వర్గాలకు ఉపాధి అవకాశాలు పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నుంచి నైపుణ్యం కలిగిన యువతకు ప్రయోజనం  చేకూర్చే దిశగా.. ట్రాన్స్ పోర్టు వాహనం నడిపేందుకు కనీస విద్యార్హత అవసరాన్ని తొలగించాలని రోడ్ ట్రాన్స్ పోర్ట్, హైవేస్ మినిస్ట్రీ నిర్ణయించింది’ అని అధికారిక ప్రకటనలో పేర్కొంది.

స్కిల్ టెస్ట్ నిర్వహించాల్సిందే

రాష్ట్రంలో చాలామందికి డ్రైవింగ్ లో అవసరమైన నైపుణ్యం ఉందని, కానీ లైసెన్స్ పొందేందుకు కావల్సిన విద్యార్హత లేదని హర్యానా ప్రభుత్వం.. ఈ మధ్య జరిగిన ట్రాన్స్ పోర్ట్ మినిస్ట్రీ సమావేశంలో తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన మేవాట్ ప్రాంతంలో చాలా మందికి డ్రైవింగ్ ఫీల్డే జీవనోపాధిగా ఉందని, వారు ట్రాన్స్ పోర్టు లైసెన్స్ పొందడానికి అడ్డుగా ఉన్న విద్యార్హత కండిషన్ ను ఎత్తివేయాలని సమావేశంలో అభ్యర్థించింది. అయితే లైసెన్స్ కు అప్లై చేసుకున్న సందర్భంలో రోడ్డు భద్రతా ప్రమాణాలపై స్కిల్ టెస్ట్ ను కచ్చితంగా నిర్వహించాలని సూచించింది. ఈ నేపథ్యంలో లైసెన్స్ తీసుకునేందుకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తప్పనిసరి అనే నిబంధనకు మార్పులు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు

దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న నిరుద్యోగుల్లో చాలామందికి విద్యార్హతలు లేకున్నప్పటికీ, డ్రైవింగ్ స్కిల్ తో పాటు చదవడం, రాయడం వచ్చినవాళ్లున్నారని.. వాళ్లందరికీ తాజా నిర్ణయం మేలు చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎడ్యుకేషన్ తప్పనిసరి అనే కండిషన్ తొలగింపు వల్ల చదువుకోని నిరుద్యోగులకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడింది. ఇప్పటికే 22 లక్షల డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో ట్రాన్స్ పోర్ట్ అండ్ లాజిస్టిక్ సెక్టార్  అభివృద్ధి కుంటుపడుతోందని, కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం.. డ్రైవర్ల కొరతను తీర్చడంతో పాటు, నైపుణ్యం ఉన్న యువతకు ఉపాధి కల్పించేందుకు ఉపయోగపడుతుందని తెలిపింది. అయితే ట్రాన్స్ పోర్టు లైసెన్స్ కు విద్యార్హతను ఎత్తివేయాలంటూ ప్రతిపాదించిన బిల్లు గత లోక్ సభలోనే ఆమోదం పొంది, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ, సెలెక్ట్ కమిటీల దృష్టిలో ఉంది.