ఇవాళ(నవంబర్11) జూబ్లీహిల్స్ బైపోల్‌‌ పోలింగ్

ఇవాళ(నవంబర్11) జూబ్లీహిల్స్ బైపోల్‌‌ పోలింగ్

జూబ్లీహిల్స్‌‌ బైపోల్‌‌కు వేళైంది. నవంబర్ 11న  మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌‌ జరగనున్నది.  ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రియల్ టైమ్ పర్యవేక్షణ కోసం అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్‌‌కాస్టింగ్‌‌ నిర్వహిస్తున్నారు.  తొలిసారి అన్ని పోలింగ్ ప్రాంతాల్లో ఏరియల్ పర్యవేక్షణ, రియల్ టైమ్ అనాలసిస్​ కోసం  డ్రోన్ నిఘా పెడ్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను  అమల్లోకి తెచ్చారు.

పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధి వరకు 144 సెక్షన్ విధించారు.  1,761 మంది స్థానిక పోలీసులతోపాటు 800 మంది సీఆర్పీఎఫ్​  కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు. కాగా, జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా,  పురుషులు 2,08,561 మంది, మహిళలు 1,92,779 మంది, ఇతరులు 25 మంది ఉన్నారు. 

ఈ ఉపఎన్నిక బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నాయి.  కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమాన్ని నమ్ముకోగా, బీఆర్‌‌ఎస్ సెంటిమెంట్‌‌పై ఆశలు పెట్టుకున్నది. ఇక బీజేపీ మోదీ ప్రభ, హిందుత్వ అజెండానే విశ్వసిస్తున్నది.  కాంగ్రెస్​ రెండేండ్ల పాలన తర్వాత జరుగుతున్న ఈ ఎన్నిక ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందువల్లే 3 ప్రధానపార్టీలు ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు.  

ఎవరి అంచనాలు వారివే..

అధికార కాంగ్రెస్‌‌ పార్టీ  ప్రధానంగా రెండేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలనే నమ్ముకుంటున్నది. ఇటీవల ఆరు గ్యారెంటీల అమలులో సాధించిన పురోగతి తమకు ఓట్లు తెచ్చి పెడుతుందని బలంగా విశ్వసిస్తున్నది. సీఎం, మంత్రులు స్వయంగా జూబ్లీహిల్స్‌‌లో  ప్రచారం చేసి, గ్యారెంటీల అమలును ప్రజలకు వివరించారు. పట్టణ ప్రాంత ఓటర్లను ఆకట్టుకునేందుకు నగర అభివృద్ధి ప్రణాళికలను కాంగ్రెస్ బలంగా ప్రచారం చేసింది. 

నియోజకవర్గంలో  చేపట్టిన పనులు, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వర్గాలు తమకు మద్దతుగా నిలుస్తాయని అధికార పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన సానుకూల నిర్ణయాలే తమకు విజయాన్ని అందిస్తాయని ధీమాగా చెబుతున్నారు. ఇక ప్రతిపక్ష బీఆర్‌‌ఎస్‌‌..  సెంటిమెంట్‌‌ను అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నది. మాగంటి గోపీనాథ్‌‌ భార్య మాగంటి సునీతను బరిలో దించి.. సానుభూతి కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయలేదంటూ ప్రచారం చేసింది.  

మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు ప్రచారంలో పాల్గొని,  ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారు. ఇక మరో ప్రధాన పార్టీ బీజేపీ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ ప్రభావాన్ని, హిందుత్వ అజెండాను నమ్ముకున్నది. జాతీయ అంశాలను, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రచారం చేసింది.  నగరంలోని సంప్రదాయ ఓటర్లను, యువతను ఆకట్టుకునేలా జాతీయవాదం, హిందుత్వ అంశాలే హైలైట్‌‌గా క్యాంపెయిన్‌‌ నిర్వహించింది.  త్రిముఖ పోరులో ఓట్లు చీలి.. తమ అభ్యర్థికి కలిసి వస్తుందని రాష్ట్ర బీజేపీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తున్నది. 

తొలిసారి డ్రోన్లతో పర్యవేక్షణ

ఎన్నికల చరిత్రలో తొలిసారి ఎన్నికల కమిషన్ డ్రోన్ ద్వారా ఎలక్షన్స్‌‌ను పర్యవేక్షిస్తున్నది. మొత్తం 139 పోలింగ్ లోకేషన్లలో 139 డ్రోన్ల ద్వారా  ప్రతి కేంద్రంపై నిరంతరం ఏరియల్ మానిటరింగ్ నిర్వహించనున్నది. ఈ డ్రోన్ల లైవ్ వీడియో ప్రసారాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌తోపాటు  ఎన్నికల అధికారులు,  పోలీసు అధికారులు  మానిటరింగ్ చేయనున్నారు.

ఈ వినూత్న ప్రాజెక్ట్‌‌ను హైదరాబాద్‌‌కు చెందిన డ్రోన్ స్టార్టప్‌‌ కంపెనీ ‘హనుమ వ్యూహ’ అమలు చేస్తున్నది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల రాకపోకలు,  చట్టవ్యతిరేక కార్యకలాపాలు లేదా అవాంఛనీయ ఘటనలను ముందుగానే గుర్తించి, భద్రతా బలగాలకు తక్షణ సమాచారం అందించేందుకు ఈ డ్రోన్లు ఉపయోగపడనున్నాయి.  సోమవారం  కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో  డ్రోన్లను  చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్, జాయింట్ పోలీసు కమిషనర్  తఫ్సీర్ ఇక్బాల్ పరిశీలించారు. 

ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి  మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ బైపోల్‌‌కు ఏర్పాట్లు   పూర్తయ్యాయని,  ఈ సారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తామన్నారు. డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), హైదరాబాద్ పోలీసుల అనుమతులు తీసుకున్నామన్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు దేశ ఎన్నికల చరిత్రలో ఒక మైలురాయి అవుతుందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌‌ తెలిపారు. తొలిసారి ప్రతి పోలింగ్‌‌ కేంద్రానికి ఒక ప్రత్యేక డ్రోన్‌‌ కేటాయించి రియల్ టైమ్‌‌ పర్యవేక్షణ చేస్తున్నట్టు చెప్పారు. 

డ్రోన్‌‌ పర్యవేక్షణ  భద్రతా బలగాలకు ఫోర్స్ మల్టిప్లయర్ లా పనిచేస్తుందని, ఇది  ప్రజల రాకపోకలు, చట్టవ్యతిరేక చర్యలు లేదా అనుమానాస్పద కదలికలను తక్షణమే గుర్తించడానికి సహాయపడుతుందని తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు.