
హైదరాబాద్ : రాష్ట్రంలో మాదక ద్రవ్యాల( డ్రగ్స్ ) వాడకం అనేమాటే వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టే దిశగా ఈనెల 28న ప్రగతిభవన్ లో ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’ జరుపాలని సీఎం నిర్ణయించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న ఈ సదస్సులో రాష్ట్ర హోం, ఎక్సైజ్ శాఖ మంత్రులతోపాటు సీఎస్, డీజీపీ, డిజీలు, అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, డిసిపీలు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకాన్ని కఠినంగా నియంత్రించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ విధి విధానాలను ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈమేరకు పోలీసు శాఖ , ఎక్సైజ్ శాఖ అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేయనున్నారు.