హడావిడిగా బ్రేక్​ఫాస్ట్​ వద్దు

హడావిడిగా బ్రేక్​ఫాస్ట్​ వద్దు

ఉదయం రాజులా.. మధ్యాహ్నం మంత్రిలా.. రాత్రి బంటులా తినాలంటారు పెద్దలు. కానీ, చాలామంది ఇంటి పనులు, ఆఫీసులకెళ్లే హడావిడిలో బ్రేక్​ఫాస్ట్​ అరకొరగానే తింటున్నారు. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్​ ఏంటి? అలాగే బ్రేక్​ ఫాస్ట్​లో చేయకూడని మిస్టేక్స్​ గురించి చెప్తున్నారు న్యూట్రిషనిస్ట్​ సహీబా భరద్వాజ్​. 
డైట్ పేరుతో కొందరు.. రాత్రి ఎక్కువ తిన్నామని.. పొద్దు పొద్దున్నే కేలరీలు ఒంటికి  పడవని మరికొందరు బ్రేక్ ఫాస్ట్​ మానేయడమో లేదా తక్కువ తినడమో చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మెటబాలిజం దెబ్బతింటుంది. బ్లడ్​లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సమస్యలు, టైప్​–2 డయాబెటిస్​ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. అందుకే బ్రేక్​ ఫాస్ట్​ బ్యాలెన్స్​డ్​గా ఉండాలి. 

కొందరు బ్రేక్ ఫాస్ట్​లో ఫ్రూట్స్​ మాత్రమే తింటుంటారు. పాన్​కేక్స్, ఉడకబెట్టిన గుడ్లు​, ఆమ్లెట్​, రోల్స్​ లాంటి ఫుడ్​ని కూడా ఎక్కువగా తింటుంటారు. ఇవి శరీరానికి సరిపడా శక్తిని ఇవ్వలేవు. దాంతో తిన్న అరగంట లేదా గంటకే ఆకలేస్తుంది. మళ్లీ ఏదైనా తినేవరకు మైండ్​ ఫోకస్​ సరిగా ఉండదు. అది శరీర ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. పైగా ఆకలిని కంట్రోల్​ చేయడానికి ఫాస్ట్​ఫుడ్, శ్నాక్స్​ తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కండరాలు ఆరోగ్యంగా ఉండాలంటే బ్రేక్​ఫాస్ట్​లో సరిపడా పోషకాలు ఉండాలి. అందుకే బ్రేక్​ఫాస్ట్​లో ప్రొటీన్స్​, ఫ్యాట్స్​ క్వాంటిటీ పెంచాలి. గుడ్లతో పాటు స్మోక్డ్ సాల్మన్, నట్​ బటర్, పెరుగు, పనీర్​ లాంటివి బ్రేక్​ ఫాస్ట్​లో తింటే మరీ మంచిది. 

చాలామంది బ్రేక్​ఫాస్ట్​లో​ కార్బోహైడ్రేట్స్​కి చోటు ఇవ్వరు. కానీ, వాటిని పూర్తిగా పక్కనపెట్టడం మంచిది కాదు. ఓట్స్​, ఉప్మా, పోహ, శాండ్​విచ్​ లాంటివి తింటే రోజంతా ఎనర్జిటిక్​గా ఉండొచ్చు. ఇవి రక్తంలోని గ్లూకోజ్​ లెవల్స్​ని పెంచవు కూడా. అన్​శాచ్యురేటెడ్​, ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్​ని కూడా బ్రేక్​ఫాస్ట్​లో భాగం చేసుకోవాలి. అవిసె గింజలు , డ్రై ఫ్రూట్స్​  కూడా బ్రేక్​ఫాస్ట్​లో తినాలి.  బ్రేక్​ఫాస్ట్​ కాఫీలు, టీలు కూడా ఒక భాగమే. అయితే మూడ్​ని, మెటబాలిజంని యాక్టివ్​ చేయడానికి  ఒక కప్పు టీ లేదా కాఫీ ఒకే. కానీ, అంతకు మించితే స్లీప్​ డ్రిపివేషన్​కి దారితీసే అవకాశం ఉంది. ఉదయాన్నే చాక్లెట్​ పాన్​కేక్స్​, మఫిన్స్​ , మయో శాండ్​విజ్​లు తినడం వల్ల రక్తంలో షుగర్​ లెవల్స్​ పెరిగి లేనిపోని అనారోగ్య సమస్యలొస్తాయి. అందుకే వాటికి దూరంగా ఉండాలి. అలాగే పొద్దుపొద్దున్నే ఫ్రూట్​ జ్యూస్​లకి బదులు ప్రూట్స్​ తినడమే బెటర్. ముఖ్యంగా సిట్రస్​ జ్యూస్​లు తాగితే గ్యాస్ట్రిక్​ ప్రాబ్లమ్స్​ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే వాటిని పూర్తిగా పక్కనపెట్టాలి. నిద్రలేచాక గంటలోపు బ్రేక్​ఫాస్ట్​ తినకపోతే అనారోగ్యాన్ని  కొని తెచ్చుకున్నట్టే . అలాగే బ్రేక్​ఫాస్ట్​లో డీప్​ ఫ్రైలని అవాయిడ్​ చేస్తే మంచిది.