వాన జాడ లేకపాయె .. పొలాలు నెర్రెలు బారె!

వాన జాడ లేకపాయె .. పొలాలు నెర్రెలు బారె!
  • ఖమ్మం జిల్లాలో ఎండుతున్న వరి నారు మళ్లు
  • బీటలువారుతున్న ‘కరివెద’ పొలాలు
  • డెడ్​స్టోరేజీకి చేరిన నాగార్జున సాగర్
  • ఎగువన భారీ వానలు కురిస్తేనే జిల్లాకు సాగర్​ నీళ్లు వచ్చేది

ఖమ్మం, వెలుగు: వానల జాడ లేకపోవడంతో ఖమ్మం జిల్లాలో రైతులు పరేషాన్​అవుతున్నారు. నార్లు పోసి, దుక్కులు దున్నుకుని రెడీగా ఉన్న టైంలో వరుణుడు ముఖం చాటేయడంతో పొలాలు నెర్రెలు బారుతున్నాయి. గత నెలలో కురిసిన వానలతో ఆనందంగా వ్యవసాయ పనులు మొదలుపెట్టిన రైతులు ప్రస్తుతం దిగాలు పడిపోతున్నారు. నాగార్జున సాగర్ డెడ్​స్టోరేజీకి చేరడంతో ఇప్పట్లో కాల్వల ద్వారా జిల్లాకు సాగర్​జలాలు అందే పరిస్థితి లేదు. సాగర్ ఆయకట్టు కింద ఉన్న దాదాపు 2.60 లక్షల ఎకరాల్లో వరి సాగుపై ఆ ఎఫెక్ట్ పడింది. జూన్ నెలలో సగటు కంటే 60 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, జులై నెలలో విపరీతంగా వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు సాధారణ వానలే పడ్డాయి. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాగా వీటిలో సిద్దిపేట, వరంగల్, జనగామ, కరీంనగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. ఖమ్మంతోపాటు మరో ఐదు జిల్లాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 

నాట్లేసినోళ్లకు తిప్పలే 

ఖమ్మం జిల్లాలో 983 చెరువులకు గాను సీజన్​లో 544 చెరువులు అలుగులు పోశాయి. 194 చెరువులు 75 శాతం నుంచి 100 శాతం వరకు నిండాయి. 150 చెరువులు 50 నుంచి 75 శాతం మాత్రమే నిండగా, 79 చెరువుల్లోకి 25 శాతం నుంచి 50 శాతం వరకు నీళ్లు చేరాయి. ఇక 16 చెరువుల్లో 25 శాతం లోపు మాత్రమే నీళ్లు చేరాయి. చెరువులు, బోర్లు, బావులు కింద పంటల సాగు చేసుకుంటున్న రైతులకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకపోగా, పూర్తిగా వర్షంపై ఆధారపడిన రైతులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. జులై నెలాఖరున కురిసిన వర్షాలతో చాలా మంది రైతులు వరి నాట్లు వేసుకున్నారు. గడిచిన రెండు వారాలుగా చినుకు జాడ లేకపోవడంతో కరివెద పద్ధతి(వరి నారు పోయకుండా డైరెక్టుగా పొలంలో వడ్లు చల్లే విధానం)లో నాట్లు వేసుకున్న పొలాలు నెర్రెలు బారుతున్నాయి. ఆగస్టు రెండో వారం వచ్చినా నాగార్జునసాగర్ కాలువల ద్వారా నీళ్లు రాకపోవడంతో వరి సాగుపై తీవ్ర ప్రభావం పడింది. ఇటు వానలు లేక.. అటు కాల్వలు రాక 
రైతులు ఆగమవుతున్నారు.

అప్పుడు పత్తి.. ఇప్పుడు వరి ఆగం

జూన్​ నెలలో కొన్ని చినుకులు పడితే వానలు షురూ అవుతాయని 8 ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటాను. తర్వాత వానలు పడకపోవడంతో నష్టం వచ్చింది. రెండోసారి విత్తనాలు నాటినా ప్రయోజనం లేదు. విత్తనాలు, కూలీల ఖర్చు రూ.17 వేలు అయ్యాయి. జులైలో వర్షాలు పడ్డాయని పొలం దున్ని వరి నాట్లు వేయడానికి సిద్ధమయ్యాను. ఇప్పుడు వానల్లేక నారు ఆగమయ్యే పరిస్థితి వచ్చింది.

 కాంసాని నర్సింహరావు, రైతు, యడవల్లి లక్ష్మీపురం, ముదిగొండ మండలం

పడకపోతే ఇబ్బందే..

గత నెలలో విపరీతంగా కురిసిన వర్షాలతో పత్తి చేలల్లో కలుపు బాగా పెరిగింది. ప్రస్తుతం రైతులు దాన్ని తొలగించే పనిలో పడ్డారు. వర్షాలు కురవకపోతే మొక్కలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. మిర్చికి కూడా వానలు పడకపోతే ఇబ్బందేనని చెబుతున్నారు. జూన్​నెలలో వర్షాభావ పరిస్థితులకు ఒకటికి రెండు సార్లు పత్తి విత్తనాలు నాటి రైతులు నష్టపోయారు. మొక్కలు పెరుగుతున్న టైంలో వాన జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దిగుబడి ఏ మేరకు వస్తుందోనని మదనపడుతున్నారు.