
డిఎస్పీ విష్ణుమూర్తి గుండెపోటుతో మృతి చెందారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న విష్ణుమూర్తి ఆదివారం ( అక్టోబర్ 5 ) రాత్రి కార్డియాక్ అరెస్టుతో మృతి చెందినట్లు తెలుస్తోంది. విష్ణుమూర్తి స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు. కాగా.. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని ఐఏఎస్ క్వార్ట్రర్స్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు విష్ణుమూర్తి. ఆయన భౌతిక ఖాయానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.
విష్ణుమూర్తి సుదీర్ఘ కాలం పాటు పోలీస్ డిపార్ట్మెంట్ లో వివిధ హోదాల్లో కొనసాగారు. విష్ణుమూర్తి ప్రజల భద్రత కోసం నిత్యం కృషి చేశారని.. తలపై ఉన్న మూడు సింహాలే దైవంగా భావించి నిరంతరం ప్రజాసేవ చేశారని కొనియాడారు సహచరులు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆయన సేవలు స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.
పుష్ప 2 తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కి వార్నింగ్:
అప్పట్లో పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా స్పందించారు విష్ణుమూర్తి. ఈ ఘటనపై అల్లు అర్జున్ కి వార్నింగ్ ఇచ్చి వార్తల్లో నిలిచారు విష్ణుమూర్తి. డబ్బు మదంతో బడాబాబులు మాట్లాడుతున్నారంటూ అల్లు అర్జున్ పై విమర్శలు చేశారు విష్ణుమూర్తి. తొక్కిసలాట కేసులో ముద్దాయిగా ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తన తప్పేమీ లేదని మాట్లాడుతున్నారని.. పోలీసులను బద్నాం చేస్తూ ప్రజలకు తప్పుడు సెంకేతాలిస్తున్నారని మండిపడ్డారు విష్ణుమూర్తి.