బెల్టు షాపులపై ఉన్న శ్రద్ధను యువతపై లేదు

బెల్టు షాపులపై ఉన్న శ్రద్ధను యువతపై లేదు

జనగాం జిల్లా : రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ కే సాధ్యమని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ దాదాపు రెండు నెలలుగా వీఆర్ఏలు సంఘటితమై ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడం లేదన్నారు. వీఆర్ఏల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిశీలిస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన మంత్రి కేటీఆర్.. శాసనసభ ముగిసి 10 రోజులు గడుస్తున్నా ఇంకా పరిష్కరించకపోవడం చాలా బాధాకరమన్నారు. బీజేపీ జనగాం జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి అధ్యక్షతన జనగామలో మేధావుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు పలువురు కవులు, రచయితలు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 

తమ సమస్యలను పరిష్కరించాలంటూ బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థులు మూడు నెలలుగా నిరసనలు చేస్తుంటే..‘మీ పోరాటం గొప్పది మీ పోరాటాన్ని అభినందిస్తున్న’ అని మంత్రి కేటీఆర్ అనడం శోచనీయం అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులపై పెట్టిన శ్రద్ధను యువతపై పెట్టడం లేదన్నారు. యువతపై శ్రద్ధ పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అడుగులేయాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయ సాధన కోసం బీజేపీ కార్యకర్తలందరూ పని చేయాలని పిలుపునిచ్చారు.