కేసీఆర్ ​ఎలక్షన్​ అపరిచితుడు : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు

కేసీఆర్ ​ఎలక్షన్​ అపరిచితుడు : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు

నాగర్​ కర్నూల్, వెలుగు:  ఎలక్షన్స్​ వస్తే సీఎం కేసీఆర్​లోని అపరిచితుడు బయటకొస్తడు. దళితబంధు అంటడు, గిరిజన బంధు అంటడు. బర్రెలు, గొర్రెలు ఒకటి కాదు రెండు కాదు అన్నీ మీవే అంటడనీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో నాగర్​కర్నూల్​జిల్లా బిజినేపల్లి మండలంలో నిర్వహించిన ప్రజాగోస, బీజేపీ భరోసా యాత్రలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఉదయం ఖానాపూర్​ గ్రామం నుంచి ప్రారంభమైన భరోసా యాత్ర దాదాపు  20 గ్రామాల్లో కొనసాగింది. ఖానాపూర్, పాలెం, బిజినేపల్లి గ్రామాల్లో రోడ్డు షో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బై ఎలక్షన్లు వచ్చినప్పుడు కేసీఆర్​లోని అపరిచితుడు బయటకు వస్తడు. యాదికి వచ్చిన ముచ్చట్లన్నీ చెప్తడు. ఇచ్చేది లేదు, చేసేది లేదు.

ఎలక్షన్​అయిపోయినంక లోపలికి పోయిండంటే సారూ మళ్లీ బయటకి రావాలంటే ఎలక్షన్​ రావాల్సిందేనని అన్నారు. తెలంగాణ వస్తే సదువుకున్న పిల్లలకు కొలువులు వస్తయన్నడు. మన నీళ్లు మనకే అన్నడు, మస్తు నిధులు వస్తయి అన్నడు. కాల్వల్లో నీళ్లు రాలే ఊర్లలకు బీరు, బ్రాంది వచ్చింది. తాగుబోతుల తెలంగాణ తయారు చేసిండు. తెలంగాణ రాకముందు 10వేల కోట్ల మందు అమ్మేటోళ్లు. రాష్ట్రం వచ్చినంక 45 వేల కోట్ల మందు అమ్ముతున్నరన్నారు. ఊరిలో ఉప్పు, పప్పు, చింత పండు అమ్మినట్లు గల్లికో దుకాణం పెట్టి మందు తాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో తాగుబోతుల సంఖ్య కోటి దాటిందని అంటూ సీఎం కేసీఆర్​కు అభినందనలు తెలిపారు. చైతన్యవంతులైన యువకులున్న సమాజం మనదని, మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీయాలని  సూచించారు. 

మీ ఎమ్మెల్యే పంచభూతాలను అమ్ముకుంటడు

నాగర్​కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డికి రాజకీయాలంటే వ్యాపారం. పొద్దున్న,  సాయంత్రం గల్లాలో ఎన్ని పడినై  అని కౌంటర్​మీద లెక్కలేసుకుంటడు. భూమి, నీళ్లు, మట్టి, ఇసుక అమ్మితే ఎంత వస్తయని చూసుకుంటడు. పంచభూతాలను అమ్ముకుంటున్నాడని మండిపడ్డారు. దళితులకు మూడెకరాలు ఇయ్యని ప్రభుత్వం ఇప్పడు దళితబంధు డ్రామా మొదలు పెట్టిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ​ అరాచకాలు, అక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తల మీద ఉందన్నారు. 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో విడతలవారీగా ప్రజాగోస, బీజేపీ భరోసా యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. బీజేపీ నియోజవర్గ ఇన్​చార్జి దిలీపాచారి, సుబ్బారెడ్డి, కొండ నాగేష్​, రాజవర్ధన్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.