వరదలకు పూర్తిగా దెబ్బతిన్న కన్నెపల్లి పంప్‌‌హౌస్‌‌

వరదలకు పూర్తిగా దెబ్బతిన్న కన్నెపల్లి పంప్‌‌హౌస్‌‌
  • పునాదులతో పాటు కుప్పకూలిన ప్రొటెక్షన్​ వాల్ 
  • వీడియోలు, ఫొటోలు వైరల్
  • వందల కోట్ల నష్టం.. స్పందించని సర్కారు
  • పంప్‌‌హౌస్‌‌ మొత్తం ఖాళీ చేస్తేనే రీ కన్‌‌స్ట్రక్షన్

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: పునాదులతో సహా కుప్పకూలిన ప్రొటెక్షన్​ వాల్.. విరిగిపడ్డ క్రేన్లు, లిఫ్టులు.. ముక్కలుముక్కలై పక్కకు జరిగిన మో టార్లు.. ఎక్కడికక్కడ వంగిపోయిన షాఫ్ట్‌‌లు. చెల్లాచెదురైన ఎలక్ట్రికల్‌‌‌‌ స్టార్టర్లు, బ్యాటరీలు.. కన్నెపల్లి పంప్‌‌ హౌస్‌‌లో నీళ్లన్నీ తోడిన తర్వాత పరిస్థితి ఇది. ఇటీవల గోదావరి వరదలకు మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతు పనులను సర్కారు అత్యంత గుట్టుగా చేస్తున్నది. ఈ క్రమంలో కన్నెపల్లి పంప్‌‌హౌస్​తాజా ఫొటోలు, వీడి యోలు గురువారం బయటకు వచ్చాయి. వాటిని పరిశీలిస్తే.. సర్కారు అంచనా వేసిన దాని కంటే ఎన్నో రెట్ల నష్టం జరిగిందని నిపుణులు అంటున్నారు. వెయ్యి కోట్లు కొత్తగా ఖర్చు పెడితే తప్ప రీ కన్‌‌స్ట్రక్షన్ పూర్తికాదని చెబుతున్నారు.

ఇప్పటికీ సీక్రెట్‌‌‌‌గానే డీవాటరింగ్​ పనులు

గోదావరి వరదల వల్ల జులై 14న అన్నారం (సరస్వతి), కన్నెపల్లి (లక్ష్మి) పంప్‌‌‌‌హౌస్‌‌‌‌లు నీట మునిగాయి. కన్నెపల్లి పంప్‌‌హౌస్‌‌లో క్వాలిటీ లేకుండా కట్టిన ప్రొటెక్షన్ వాల్, దాంతోపాటే క్రేన్లు, లిఫ్టు కూలడంతో మోటార్లు తుక్కుతుక్కు అయ్యాయి. దీంతో వందల కోట్ల నష్టం వాటిల్లినట్లు ఇంజనీరింగ్ ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌లు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. కేవలం రూ.25 కోట్ల నష్టం మాత్రమే జరిగిందని, ఆ నష్టాన్ని కూడా కాంట్రాక్ట్‌‌‌‌ సంస్థే భరిస్తుందని ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌‌‌‌ కుమార్‌‌‌‌ ప్రకటించారు. సీక్రెట్‌‌గా డీ వాటరింగ్‌‌‌‌ పూర్తిచేయించిన సర్కారు.. కనీసం మోటార్లు తేలిన తర్వాతైనా ఎంత నష్టం జరిగిందనేది వెల్లడించలేదు. ఇంజనీర్లు డీవాటరింగ్ తర్వాత పరిస్థితులపై ఎప్పటి కప్పుడు నివేదికలందజేస్తున్నా.. ఒక్క ప్రకటన కూడా ప్రభుత్వం రిలీజ్ ​చేయలేదు. మోటర్లు మునిగి 28 రోజులవుతున్నా.. ఇంకా 2పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ల దగ్గర పోలీసులను పెట్టి, ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు.

వీడియోలు వైరల్.. ఇరకాటంలో రాష్ట్ర సర్కారు

కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్‌‌ డ్యామేజీ వీడియోలు, ఫొటోలు గురువారం సోషల్‌‌‌‌ మీడియాలో వైరల్ అయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ ఓ ఇంజనీరింగ్‌‌ అద్భుతమని, ప్రపంచం గర్వించేలా కట్టామని మొన్నటిదాకా సీఎం కేసీఆర్‌‌‌‌, రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. మన రాష్ట్రంలోనే కాక పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రాజెక్ట్‌‌‌‌పై యాడ్స్ ఇచ్చుకున్నారు. తీరా కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్‌‌‌‌లో ప్రొటెక్షన్‌‌‌‌ వాల్‌‌‌‌ కూలి మోటార్లు తుక్కుతుక్కుగా మారాయి. ఈ వీడియోలు, ఫొటోలకు కొందరు మీమర్లు తమకు నచ్చిన రీతిలో సాంగ్స్‌‌‌‌ కంపోజ్‌‌‌‌ చేసి ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌, వాట్సాప్‌‌‌‌లోకి వదిలారు. ఎంత కట్టడి చేసినా గోడ కూలిన, మోటార్లు పాడైపోయిన వీడియోలు బయటికి రావడంతో ప్రభుత్వ ఇంజనీర్లు తలలు పట్టుకున్నారు.

మొత్తం నాశనం

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌లో ప్రధానమైన కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ను రీ కన్‌‌స్ట్రక్షన్‌‌‌‌ చేయాలంటే మొత్తం ఖాళీ చేయాల్సి వస్తుందని ఇంజనీరింగ్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌లు చెబుతున్నారు. పంప్‌‌‌‌హౌస్‌‌‌‌లో 12వ మోటార్‌‌‌‌ నుంచి 17వ మోటార్‌‌‌‌కు మధ్యలో ప్రొటెక్షన్‌‌‌‌ వాల్‌‌‌‌ కూలిపోవడం వల్ల ఒక్కొక్కటి 40 మెగావాట్ల కెపాసిటీ కలిగిన మూడు మోటర్లు మొత్తం ఖరాబయ్యాయి. మరో ఐదు మోటార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మోటార్లు ముందుకు జరగడంతో షాఫ్ట్ లు వంగిపోయి డ్యామేజీ అయ్యాయి. ఈ షాఫ్ట్ లు ఆస్ట్రియా, ఫిన్లాండ్ దేశాల నుంచి తెప్పించాల్సి ఉంది. వివిధ అవసరాల కోసం పంప్‌‌‌‌హౌస్‌‌‌‌లో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌‌‌‌లు పూర్తిగా విరిగిపోయి మోటర్ల మీద పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. డైలీ వర్క్ కోసం వేసిన కాంక్రీట్ పిల్లర్లు విరిగి మోటార్లపై పడ్డాయి. కిందికి సామాను దించే మూడు క్రేన్లు విరిగి మోటార్లపైనే పడిపోయాయి. మోటార్లు నడవటానికి ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్‌‌‌‌ స్టార్టర్లు, మోటర్లు, బ్యాటరీలు పూర్తిగా పాడైపోయాయి.