50 వేల ఎకరాల్లో పంట నష్టం

50 వేల ఎకరాల్లో పంట నష్టం
  • వరి, పత్తి, సోయా, మక్క, మిరప పంటలపై గులాబ్​ తుఫాను ఎఫెక్ట్
  • కాళేశ్వరం బ్యాక్​వాటర్​తో మళ్లీ మునిగిన పంటలు
  • పలుచోట్ల ఊర్లకు నిలిచిన రాకపోకలు
  • వాన తగ్గినా వాగుల్లో ప్రవాహాలు తగ్గలే

వెలుగు, నెట్​వర్క్:

రాష్ట్రంపై గులాబ్​ తుఫాను ఎఫెక్ట్ తీవ్రంగా పడింది. సోమ, మంగళవారాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల 50 వేల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లింది. పత్తి, వరి, మొక్కజొన్న, సోయాబీన్, మిరప పంటలు దెబ్బతిన్నాయి. మంగళవారం సాయంత్రానికి  వర్షాలు కాస్త తగ్గినా వాగుల్లో ప్రవాహాలు మాత్రం తగ్గలేదు. చాలా చోట్ల లో లెవల్ వంతెనల పైనుంచే వరద ప్రవహిస్తోంది. దీంతో వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద పోటెత్తడంతో సిరిసిల్ల, నిజామాబాద్ పట్టణాలు జలమయమయ్యాయి. 
వరదల్లో కొట్టుకుపోయి ముగ్గురు, ఇంటి గోడ కూలి మరొకరు చనిపోయారు. గోదావరి, దాని ఉపనదులు ఉప్పొంగుతుండటంతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో గేట్లను ఖుల్లా పెట్టిన ఆఫీసర్లు వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదిలేస్తున్నారు. రాష్ట్రంలో బుధవారం నుంచి 4 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్‌‌‌‌ ఉందని హైదరాబాద్‌‌‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు నిజామాబాద్‌‌‌‌ జిల్లాలోని జక్రాన్‌‌‌‌పెల్లిలో 23 సెం.మీ., నవీపేట్‌‌‌‌, ధర్‌‌‌‌పల్లిలో 21, రంజల్‌‌‌‌, డిచ్‌‌‌‌పల్లి, ఆర్మూర్‌‌‌‌లో 18 సెం.మీ., వర్షపాతం నమోదైంది.

జిల్లాల్లో ఇలా..

నిర్మల్ జిల్లాలో 2 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పత్తి, సోయాబీన్ పంటలకు ఎక్కువగా నష్టం వాటిల్లింది. ఆరబెట్టిన మొక్కజొన్న తడిసి ముద్దయింది. బిద్రెల్లి దగ్గర రోడ్డు మీద వాగు పొంగడంతో భైంసా, నిజామాబాద్ మధ్య రాకపోకలు నిలిచాయి. నిర్మల్ పట్టణంలో రోడ్లు జలమయమయ్యాయి. కుబీర్ మండల కేంద్రంలోని మేదరి వాడ నీట మునిగిపోవడంతో అధికారులు ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించారు. కడెం, గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టుల గేట్లు ఓపెన్ చేసి వరద నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు.

మంచిర్యాల జిల్లాలో కాళేశ్వరం బ్యాక్​వాటర్‌‌‌‌‌‌‌‌తో జైపూర్, చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని వందలాది ఎకరాల్లో పంటలు మరోసారి నీటమునిగాయి. ఈ సీజన్​లో పంటలు మునగడం ఇది మూడోసారి. జులై నెలాఖరులో, సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చిన వరదలకు జైపూర్, చెన్నూర్, కోటపల్లి మండలాల్లో సుమారు పదివేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు మళ్లీ పత్తి, మిర్చి పంటలు వేసుకున్నారు. తాజా వరదలకు ఈ పంటలు కూడా దెబ్బతిన్నాయి. గోదావరికి భారీగా వరద వస్తుండడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు 40 గేట్లను ఎత్తి 7,24,800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లిలోని కర్జెల్లి, గంగాఫూర్​లలో 250 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిందని అగ్రికల్చర్ ఆఫీసర్ రాజేశ్ చెప్పారు.

మెదక్ జిల్లాలో 1,480 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పాపన్నపేట, కొల్చారం, మెదక్, హవేలీ ఘనపూర్ మండలాల్లో 1,300 ఎకరాల్లో వరి, టెక్మాల్, అల్లదుర్గం మండలాల్లో 150 ఎకరాల్లో పత్తి పంట నీటిపాలైంది. మెదక్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏడుపాయల వనదుర్గామాత ఆలయం నీట మునిగింది.

సంగారెడ్డి జిల్లాలో 3,790 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సంగారెడ్డి, కంది, మునిపల్లి, ఆందోల్, కంగ్టి, కల్హేర్, మనూర్ మండలాల్లో 2,100 ఎకరాల్లో పత్తి, 1,700 ఎకరాల్లో వరి పంట నీటిపాలైంది. దానేగావ్ ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తి 90,000 క్యూసెక్కుల నీటిని వదలడంతో సింగూరు ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరిగింది.

నిజామాబాద్ జిల్లాలో 12 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. సోయాబీన్, వరి, పొగాకు, మొక్కజొన్న, ఆవాలు దెబ్బతిన్నాయి.

కామారెడ్డి జిల్లాలో 6,500 ఎకరాల్లో పంట నీట మునిగింది. జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, పిట్లం, లింగంపేట, మాచారెడ్డి, భిక్కనూరు, కామారెడ్డి మండలాల్లో వరి, సోయా, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. 14 ఇండ్లు కూలిపోయాయి. సదాశివనగర్ మండలం అడ్లూరుఎల్లారెడ్డి, కామారెడ్డి మండలం అడ్లూరు మధ్య పెద్ద వాగులో టాటా సుమో చిక్కుకుంది. కామారెడ్డికి చెందిన ఆరుగురు వ్యక్తులు అందులో ఉండగా.. ట్రాక్టర్ సాయంతో ఒడ్డుకు చేర్చారు. 

కరీంనగర్ జిల్లాలో చెరువులు, కుంటలు నిండి లోలెవెల్ కల్వర్టులు మునిగిపోవడంతో గన్నేరువరం మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎల్ఎండీ గేట్లు ఎత్తడంతో మానేరు వాగు ఒడ్డున ఉన్న పంటలు నీటమునిగాయి. దాదాపు100 ఎకరాల్లో వరి నీటిపాలైందని రైతులు వాపోయారు.

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం సూరారం గ్రామం వద్ద దుందుభి వాగు పొంగిపొర్లుతుండడంతో సూరారం, ఉడిత్యాల్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జూరాల ఐదు గేట్లు ఎత్తి 52 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. సంగంబండ రిజర్వాయర్ గేట్లు ఎత్తి నీటిని వదిలారు.

యాదాద్రి జిల్లాలో దాదాపు 400 ఎకరాల్లో వరి, పత్తి పంటలకు నష్టం జరిగింది. అనాజీపూర్, రావిపహాడ్ రూట్లో చిన్నెటి వాగు, ఆలేరు– కొలనుపాక మధ్య పెద్దవాగు, కొరికటికల్–ఆత్మకూర్ ఎం మధ్య బిక్కేరువాగు పొంగిపొర్లుతోంది. 


జగిత్యాల జిల్లాలో 200 ఎకరాల పంట దెబ్బతిన్నట్టు అగ్రికల్చర్ ఆఫీసర్ నరేశ్ అంచనా వేశారు. సూరంపేట, కొడిమ్యాల మధ్య వాగు ఉప్పొంగడంతో కొడిమ్యాల, కొండగట్టు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కోరుట్ల పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ, అన్నారం గేట్లన్నీ ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదులుతున్నారు. వరద కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి. పరిస్థితిని పరిశీలించేందుకు తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శంకర్ కారులో వెళ్లగా.. యాక్సిడెంట్ జరిగింది. ఇద్దరు ఆఫీసర్లు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల దిగువన పొలాల్లోకి నడుము లోతు నీళ్లు చేరడంతో సుమారు 1,500 ఎకరాల్లో పంట నష్టం జరిగింది.

పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం పార్వతి బ్యారేజ్ దగ్గర బ్యాక్​వాటర్​లో పంటలు మునిగిపోయాయి. దాదాపు 200 ఎకరాల్లో పంట దెబ్బతిన్నాయి. ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లోని మానేరు పరివాహక గ్రామాల్లో దాదాపు 400 ఎకరాలు నీట మునిగాయి.

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం, బోనకల్, వైరా, ఎర్రుపాలెం, ఏన్కూరు, కొణిజర్ల, సత్తుపల్లి, కామేపల్లి, మధిర, కారేపల్లి మండలాల్లో 3,172 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తం 2,720 ఎకరాల్లో వరి, 452 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నాయి. మరో 600 ఎకరాల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లిందని హార్టికల్చర్ అధికారులు చెప్తున్నారు.

గతేడాది ఇదే టైమ్‌‌‌‌లో రూ.7 వేల కోట్ల పంట నష్టం

నిరుడు సెప్టెంబర్, అక్టోబరు నెలల్లో కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నష్టం విలువ రూ.7 వేల కోట్లు ఉంటుందని అంచనా వేసింది. కానీ సర్కారు మాత్రం రైతులకు పంటనష్ట పరిహారం కింద పైసా కూడా అందించలేదు.

చెరువుల పరిశీలనకు 15 టీమ్‌‌‌‌లు

జీహెచ్‌‌‌‌ఎంసీ, హెచ్‌‌‌‌ఎండీ పరిధిలోని 185 చెరువులు, కుంటల పరిశీలనకు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటల కట్టలకు నష్టం వాటిల్లిందా, ఇతర సమస్యలు ఏమైనా తలెత్తాయా అన్న విషయాలను పరిశీలించి రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కో బృందానికి ఒక్కో ఎస్‌‌‌‌ఈ నేతృత్వం వహించనున్నారు. జీహెచ్‌‌‌‌ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటల పరిస్థితిపై ప్రజలు ఫ్లడ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ నంబర్‌‌‌‌ 040 23390794కు ఫోన్‌‌‌‌ చేసి సమాచారం ఇవ్వాలని కోరింది. ఇరిగేషన్‌‌‌‌ ఇంజనీర్లతో స్పెషల్‌‌‌‌ సీఎస్‌‌‌‌ రజత్‌‌‌‌ కుమార్‌‌‌‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌ నిర్వహించారు.