సిటీ బాట.. టెన్త్ తర్వాత ఎక్కువ మంది స్టూడెంట్లు హైదరాబాద్‌‌కే

సిటీ బాట.. టెన్త్ తర్వాత ఎక్కువ మంది స్టూడెంట్లు హైదరాబాద్‌‌కే
  • జిల్లాల్లోని కాలేజీల్లో స్టాఫ్, ఫెసిలిటీస్ ఉంటలే.. .
  • టెన్త్ తర్వాత ఎక్కువ మంది స్టూడెంట్లు హైదరాబాద్‌‌కే
  • మూతపడుతున్న గ్రామీణ ప్రాంత కాలేజీలు
  • ఐదేండ్లలో 107 ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు క్లోజ్
  • 45% మంది ఇంటర్ స్టూడెంట్లు హైదరాబాద్‌‌లోనే 
  • డిగ్రీలో 39 శాతం మంది చదువులు గ్రేటర్‌‌‌‌లోనే
  • 30 జిల్లాల్లో ఎంతమంది చదువుతున్నరో.. 
  • గ్రేటర్‌‌‌‌ పరిధిలోని 3 జిల్లాల్లో అంతే మంది చదువుతున్నరు


హైదరాబాద్, వెలుగు: జిల్లాల్లో టీచింగ్ స్టాఫ్ కొరత, అరకొర వసతులతో చదువుకోలేక స్టూడెంట్లు పట్నం బాట పడుతున్నారు. టెన్త్ పూర్తి కాగానే ఇంటర్ చదువులకు హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్.. ఇలా అన్నింటికీ హైదరాబాదే దిక్కవుతున్నది. దీంతో సిటీలోని కాలేజీలు హౌస్‌‌ఫుల్‌‌ అవుతుండగా.. కొత్త డివిజన్, మండల కేంద్రాల్లోని కాలేజీలు మాత్రం అడ్మిషన్లు లేక మూతపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో ఎంత మంది చదువుతున్నారో.. దాదాపు అంతే మంది ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌‌ పరిధిలోనే చదువుకుంటుండటం గమనార్హం.

గ్రామీణ ప్రాంతాల నుంచి క్యూ

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలయికగా గ్రేటర్ హైదరాబాద్ మారిపోయింది. ఆయా జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీల సంఖ్య పెరుగుతున్నది. ఇదే సమయంలో ఏటా భారీగా స్టూడెంట్లు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. 2021–2022 విద్యాసంవత్సరం టెన్త్​లో 4,53,201 మంది స్టూడెంట్లు పాసయ్యారు. వీరిలో 48 శాతం మంది గ్రేటర్ హైదరాబాద్​లోని ఇంటర్ కాలేజీల్లో చేరారు. 2022–23లో 4,82,675 మంది స్టూడెంట్లు ఫస్టియర్​లో చేరగా, వారిలో 2,17,708 (45.10%) మంది హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే చదువుతున్నారు. అయితే ప్రైవేటు కాలేజీల్లోనే మెజార్టీ స్టూడెంట్లున్నారు. రాష్ట్రంలో సెకండియర్‌‌‌‌లో 4,23,935 మంది స్టూడెంట్లుంటే.. 1,83,938 మంది జీహెచ్ఎంసీ పరిధిలోని కాలేజీల్లోనే చదివారు. కార్పొరేట్ కాలేజీలు ఎక్కువగా ఉండటం, ఐఐటీ–జేఈఈ, నీట్ కోచింగ్ ఇస్తుండటంలో చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి చదువుల కోసం వస్తున్నారు.

డిగ్రీ విషయంలోనూ స్టూడెంట్లు గ్రేటర్ హైదరాబాద్‌లోని విద్యాసంస్థల వైపే మొగ్గు చూపుతున్నారు. 2022–23లో డిగ్రీ ఫస్టియర్‌‌లో మొత్తం 2,12,188 స్టూడెంట్లు చేరగా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో చేరిన వారే 81,915 (38.60%) మంది ఉన్నారు. రాష్ట్రంలో 1,054 డిగ్రీ కాలేజీలుంటే.. 362 కాలేజీలు ఈ మూడు జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. పేరున్న డిగ్రీ కాలేజీలు హైదరాబాద్‌లో ఎక్కువ ఉండటంతో ఇక్కడ చదివేందుకు ఎక్కువ మంది వస్తున్నారని అధికారులు చెప్తున్నారు. కొన్ని ముఖ్యమైన కాలేజీల్లో చేరుందుకు ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. ప్రధానంగా ఉమెన్స్ వర్సిటీ (కోఠి కాలేజీ), నిజాం కాలేజీ, బేగంపేట ఉమెన్స్ డిగ్రీ కాలేజీ, సిటీ కాలేజీలో రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన విద్యార్థులు వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందారు. 2022–23 విద్యాసంవత్సరంలో ఉమెన్స్ వర్సిటీలో 1,520 మంది, సిటీ కాలేజీలో 1,415 మంది, బేగంపేట ఉమెన్స్ కాలేజీలో 1,294 మంది, నిజాంకాలేజీలో 915 మంది స్టూడెంట్లు చేరారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, మెదక్ జిల్లాల నుంచి ఎక్కువ మంది ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు పొందారు.

ఎయిడెడ్‌కు సర్కారు సాయం అందుతలే

రాష్ట్రంలోని ఎయిడెడ్ డిగ్రీ, జూనియర్ కాలేజీల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తున్నది. కొన్నేండ్ల నుంచి ప్రభుత్వం ఆయా కాలేజీలకు ఎయిడ్ ఇవ్వకపోవడంతోపాటు రిక్రూట్‌మెంట్ కూడా చేయడం లేదు. దీంతో ఆయా కాలేజీల్లో పనిచేస్తున్న రెగ్యు లర్ ఎంప్లాయీస్ రిటైర్ అవుతున్నా.. కొత్త వారు రావడం లేదు. నిర్వహణ భారంగా మారిన నేపథ్యంలో మేనేజ్‌మెంట్లు ఎయిడెడ్ కాలేజీలనూ మూసేస్తున్నాయి. చాలా కాలేజీల్లో ఎయిడెడ్ సెక్షన్లను తగ్గించుకుంటున్నాయి.

సిబ్బంది లేక.. అడ్మిషన్లు రాక

  • కాకతీయ వర్సిటీ పరిధిలో సుమారు మూడు దశాబ్దాల పాటు కొనసాగిన నిర్మల్ పీజీ సెంటర్ నాలుగేండ్ల కిందట మూతపడింది. అక్కడ అడ్మిషన్లు లేని కారణంతో పీజీ సెంటర్‌‌ను వరంగల్‌కు తరలించారు.
  • తెలంగాణ రాక ముందు 2013లో 3, 4 పీజీ కోర్సులతో స్టార్ట్ చేసిన భూపాలపల్లి పీజీ కాలేజీకి సరిపడా ఫ్యాకల్టీ, ఫెసిలిటీస్ లేక.. అడ్మిషన్లు ఆశించినంత లేకపోవడంతో మూతపడింది.
  • జనగామ పీజీ కాలేజీలోని కోర్సుల్లో పది లోపు అడ్మిషన్లు కావడంతో వారిని యూనివర్సిటీ‌ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి క్లాసులకు పంపి.. ఇక్కడ కేవలం ఎగ్జామ్స్ మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇది కూడా ఒక రకంగా మూతపడినట్లే లెక్క.
  • 2013 లోనే స్టార్ట్‌ అయిన మహబూబాబాద్ పీజీ కాలేజీలో సరిపడా స్టాఫ్‌, సౌకర్యాలు లేకపోవడం, విద్యార్థులు పెద్దగా చేరకపోవడంతో అది మూతపడే పరిస్థితిలో ఉంది. 
  • కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ వెలుగు వెలి గిన జీవీఎస్ కాలేజీ మూడేండ్ల కింద మూతపడింది. సర్కారు ఎంప్లాయీస్ అంతా రిటైర్ కావడం, కొత్త వారిని నియమించకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఆ జిల్లాలోనే లింగంపేటలోని రత్నా కాలేజీ, గాంధారి మండలంలోని అమెయ కాలేజీ మూ తపడ్డాయి. వాటిని వేరే మేనేజ్‌మెంట్లు కొని, అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి షిఫ్ట్ చేసుకున్నాయి.
  •  కల్వకుర్తి డిగ్రీ కాలేజీలో గతేడాది రెండు పీజీ కోర్సులకు అనుమతించారు. ఒక కోర్సులో ఒక్కరూ చేరలేదు. ఇంకో కోర్సులో ఇద్దరే చేరారు. దీంతో వారిని నాగర్​కర్నూల్ కాలే జీకి పంపించి, ఆ కోర్సులను రద్దు చేశారు. 
  •  గద్వాలలో ఒకే ఆవరణలో సర్కారు ఉమెన్స్, జనరల్ డిగ్రీ కాలేజీలుండేవి. అయితే ఉమెన్స్ కాలేజీని జనరల్ కాలేజీలో విలీనం చేశారు.

జిల్లాల్లో మూత

  • రాష్ట్రంలో సర్కారు ప్రైవేటు డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు అనుమతివ్వడం లేదు. దీంతో ఉన్న కాలేజీలకే మేనేజ్‌మెంట్లు మారుతున్నాయి. అయినా ఐదేండ్లలో ప్రైవేటులో 91, ఎయిడెడ్‌లో 16 డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి. ఇవన్నీ మారుమూల ప్రాంతాల్లోనివే కావడం గమనార్హం. జూనియర్ కాలేజీలదీ అదే పరిస్థితి. రాష్ట్రంలో ప్రైవేటు జూనియర్ కాలేజీలు 2,121 ఉండేవి. కానీ ప్రస్తుతం సుమారు 1,450 కాలేజీలే సర్కారు నుంచి గుర్తింపు తీసుకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో స్టూడెంట్స్​ సంఖ్యను దృష్టిలో పెట్టు కోకుండా అడ్మిషన్లు ఇవ్వడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెప్తున్నారు. 

చాలా కారణాలు

విద్యార్థులు చదువుల కోసం సిటీకి రావడం పెరిగింది. దీనికి అనేక కారణాలున్నాయి. హైదరాబాద్‌‌లోనే మంచి చదువులు దొరుకుతాయని, దూరంగా చదివించాలనే భావన కొందరు పేరెంట్స్ లో ఉంది. చదువుకుంటూనే ఏదైనా పని చేసుకోవచ్చని కొందరు స్టూడెంట్లు సిటీకి వస్తున్నారు. అయితే ఇప్పటికీ ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని సర్కారు కాలేజీల్లో మంచి అడ్మిషన్లు నమోదవుతున్నాయి. కొన్ని కొత్త జిల్లా కేంద్రాల్లోనూ అడ్మిషన్లు బాగానే ఉన్నాయి. మండల, డివిజన్ కేంద్రాల్లోని కాలేజీలపై కొంత ప్రభావం ఉంది.
- ప్రొఫెసర్ లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్