కాకతీయ వర్సిటీ బతికేనా? 

కాకతీయ వర్సిటీ బతికేనా? 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ప్రారంభించలేదు. చంద్రశేఖర రావు ముఖ్యమంత్రిగా ఆరు ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం చేసి నాయకులకు ఇచ్చారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల అభివృద్ధికి, దోపిడీకి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ఎండబెట్టడం దారుణం.  గత పది సంవత్సరాల నుంచి 80 శాతం మంది సీనియర్ అధ్యాపకులు పదవీ విరమణ చేశారు. దాదాపు 400 మంది అధ్యాపకులు ఉండవలసిన కాకతీయ విశ్వవిద్యాలయంలో కేవలం 85 మంది అధ్యాపకులు మాత్రమే పనిచేస్తున్నారు.  మొత్తం 30 డిపార్ట్​మెంట్లలో ఒక్కొక్క డిపార్ట్​మెంట్ కు ఒక్క సీనియర్ అధ్యాపకుడు కూడా లేని దుస్థితి ఏర్పడింది. కావలసిన నిధులను ఇవ్వకుండా, అధ్యాపకుల నియామకాలు చేయకుండా సరైన సమయంలో సమర్ధులైన సీనియర్ ప్రొఫెసర్లను వీసీలను నియమించకుండా పాలకమండళ్లను పార్టీ కార్యకర్తలతో నింపి యూనివర్సిటీలను ఉద్దేశపూర్వకంగానే భ్రష్టు పట్టించడం జరిగింది. నాయకుల సంచులు మోసే వ్యక్తులను వీసీలుగా నియమించడం వలన విశ్వవిద్యాలయాలు మరింత దారుణంగా భ్రష్టు పట్టాయి. తెలంగాణ అధికార వర్గాలు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను భ్రష్టు పట్టించి వేలాది ఎకరాల భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చడానికి ఈ సంస్థలను ఇంత నిర్లక్ష్యానికి గురి చేయడం జరిగిందని విద్యార్థి సంఘాలు, మేధావులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

కాకతీయ విశ్వవిద్యాలయం1975లో ఆనాటి పీజీ సెంటర్ లో ప్రారంభించారు. ప్రొ. వెంకట్రామయ్య మొదటి వైస్ ఛాన్స్​లర్. ఆ తర్వాత ప్రొ. వాసుదేవ్ జాఫర్ నిజాం ప్రొ. జయశంకర్, ప్రొ. వైకుంఠం కాటే, ప్రొ. విద్యావతి లాంటి నిష్ణాతులైన అంకిత భావం గల విద్యావంతులు వీసీలుగా నియమించబడి ఈ విశ్వవిద్యాలయాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చారు.  తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ,మహారాష్ట్ర, పంజాబ్, మొదలగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఉన్నత శ్రేణి అధ్యాపకులు ఈ సంస్థను తీర్చిదిద్దినారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో  కనీసం నాలుగు సంవత్సరాలు వీసీల​ నియామకం లేకుండానే గడిచినాయి. అదేవిధంగా పాలక మండళ్లు కూడా లేవు. అనేక పరిపాలన పదవులను నిర్వహించే ఐఏఎస్ అధికారులే యూనివర్సిటీలకు ఇంచార్జ్ వీసీలుగా కాలం గడిపినారు. 

ప్రభుత్వ వర్సిటీల అభివృద్ధిని ఆపేశారు

ప్రపంచీకరణ జరిగిన తర్వాత మానవ వనరుల బదిలీలు, టెక్నాలజీ, అనేక విప్లవాత్మకమైన మార్పులు చేసుకున్నాయి. మారుతున్న మార్కెట్ ఇండస్ట్రీ అవసరాలకు సరిపోయే విధంగా విశ్వవిద్యాలయాలను, వివిధ కోర్సులను ఆధునికీకరణ చేయలేక పోయింది ఈ ప్రభుత్వం. అదే సాంప్రదాయ శాఖలను యధాతథంగా నిర్లక్ష్యం చేస్తూ జీవిగంజి పోసినట్టుగా నిధులు అరకొర విడుదల చేసి సొంత నిధులనే సమకూర్చుకోండని వీసీలకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. అడుక్కున్న పదవుల్లో  కూర్చున్న వీసీలు యూనివర్సిటీలను ఆధునికీకరణ చేయలేదు. కొత్త రిక్రూట్​మెంట్లు చేపట్టలేదు. పరిశోధనా సంస్థలను బలోపేతం చేయలేదు. జాతీయ, అంతర్జాతీయ పరిశోధన ప్రాజెక్టులు రాబట్టలేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, నాయకులకు అడుగులకు మడుగులు ఒత్తే వ్యక్తులే వీసీలు కావడం ఈ విశ్వవిద్యాలయాలకు ఒక శాపంగా మారింది. ప్రభుత్వ విద్య అంటేనే అలర్జీ వచ్చే ప్రభుత్వం ఈ సంస్థల గురించి ఒక్కనాడు కూడా సమీక్ష జరపలేదు. విద్య అభివృద్ధి గురించి తెలియని అవకాశవాద రాజకీయాలు నడిపే వాళ్లను విద్యాశాఖ మంత్రులుగా చేయడం కూడా ఈ సంస్థలు మరింత భ్రష్టు పట్టడానికి దారితీసింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో ఏక వ్యక్తి, ఒకే కుటుంబం అన్ని నిర్ణయాలు తీసుకునే దుర్దశ దాపురించడం వల్ల కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు నోట మాట మాట్లాడకుండా, పట్టించుకోకుండా పది సంవత్సరాలు గడిపినారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలను సంపాదించుకున్న వ్యక్తులే ఈ ప్రభుత్వ విశ్వవిద్యాలయం కూడా ఒకట్రెండు సంవత్సరాల్లో కొనుగోలు చేసినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన డిగ్రీ, పీజీ విద్యార్థులందరికీ కావలసిన ఈ విశ్వవిద్యాలయాన్ని ఈ మూడు ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఎవరి బిజీలో వారే ఉండిపోయినారు. కాలక్రమంగా ఈ సంస్థలన్నీ వాటంతట అవే మూతపడాలని ఆ సమయం కొరకు పాలకులు, రియల్ ఎస్టేట్ వెంచర్ల సంస్థలు, నాయకులు 
ఎదురుచూస్తున్నారు.

కాకతీయ వర్సిటీ దుస్థితి

అధ్యాపకుల కొరతతో, సౌకర్యాల కొరతతో, కాకతీయ విశ్వవిద్యాలయంలో  పీహెచ్ డీ ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. గత ఎనిమిది సంవత్సరాల నుండి పీహెచ్ డీ అడ్మిషన్లు జరగలేదు. పాలకమండలి,  ప్రభుత్వం ఈ సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేసినాయి. సమస్య మరింత జటిలమై పోలీసులు ప్రవేశించే వరకు వెళ్లిపోయింది. ఆఖరికి సాధారణ పోలీస్ కాకుండా టాస్క్ ఫోర్స్ పోలీసు నియంత్రణలోకి వెళ్లిపోయింది. దీనికి వీసీ బాధ్యుడు కాదా?  వీసీలను నియమించే పాలకులు బాధ్యులు కాదా? ప్రభుత్వానికి ఓట్లు వేసే ప్రజలు బాధ్యులు కాదా? తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులు చూస్తూ ఊరుకుంటారా? ప్రజలను చైతన్యం చేసే అవసరం మనకు లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజల్లో  ఉన్న ఈ నిస్తేజాన్ని ఉదాసీన వైఖరిని తొలగించే బాధ్యత ఈనాటి యువతరం పై ఉంది. రాష్ట్రంలో మూలుగుతున్న ప్రభుత్వ పాఠశాలలను,  ప్రభుత్వ కళాశాలలను,  ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను కాపాడడానికి యువతరం ముందుకు రావాలి. ఇంతకీ కాకతీయ యునివర్సిటీ బతికేనా? పేదల విద్యను కాపాడుకోగలమా? అందరం ఆలోచించాల్సిన విషయం.

పేదల విద్యను కాపాడుదాం

పేద ప్రజలకు భూములు లేకున్నా, ఎస్టేట్ లేకున్నా, ఫామ్ హౌస్ లేకున్నా, కనీసం వారి పిల్లలకు నాణ్యమైన విద్య ఇచ్చే అవకాశం ఈ ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రంలో ఉండదా ? శిథిలమవుతున్న విద్యాసంస్థల గురించి తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ఉద్యోగులు, బుద్ధి జీవులు ఎవరూ మాట్లాడకుండా నిశ్శబ్దంగా చూస్తున్నారు. సమాజానికి దాని అభివృద్ధికి ఉపయోగపడే ఇలాంటి సంస్థలను కాపాడాల్సిన అవసరం ఉంది.  దళిత బంధు, బీసీ బంధు ఇంకా ఇవ్వని అనేక బంధులు , మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవన్నీ రాకున్నా ఫర్వాలేదు. పేద పిల్లలకు చదువు, విజ్ఞానం, ఉద్యోగ అవకాశాలు కల్పించే విద్యాసంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

- కూరపాటి వెంకట్ నారాయణ రిటైర్డ్​ ప్రొఫెసర్,  కాకతీయ యూనివర్సిటీ