రాష్ట్ర ఆమ్దానీలో పదో వంతు కాళేశ్వరం అప్పులకే..

రాష్ట్ర ఆమ్దానీలో పదో వంతు కాళేశ్వరం అప్పులకే..

సర్కారుకు ఏటా వివిధ రూపాల్లో రాబడి రూ.1.20 లక్షల కోట్లు
కాళేశ్వరం కార్పొరేషన్​ లోన్లకు పదేండ్ల పాటు ఏటా రూ.13 వేల కోట్లు చెల్లించాలె
2021 నుంచి ప్రారంభమైన రీ పేమెంట్లు.. 2040 దాకా కిస్తీలు కట్టుడే
అదనపు పనులకు మళ్లీ లోన్​ తెస్తే.. 2045 వరకు రీ పేమెంట్లు తప్పవు
కాళేశ్వరం కార్పొరేషన్​ కింద సర్కారు చేసిన అప్పు 97,447కోట్లు

హైదరాబాద్‌, వెలుగు : కేసీఆర్‌ డ్రీమ్‌ ప్రాజెక్టు కాళేశ్వరం కోసం చేసిన అప్పు.. రాష్ట్ర బడ్జెట్​కు గుది బండగా మారింది. ఈ ప్రాజెక్టు కోసం తెచ్చిన లోన్ల రీ పేమెంట్‌కే రాష్ట్ర ఆమ్దానీలో పదో వంతు ఖర్చు చేయాల్సి వస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ భారం ఇంకింత పెరగనుంది. ప్రాజెక్టు అధికారికంగా ప్రారంభించి నాలుగేండ్లు గడిచినా పైసా ఆదాయం రాలేదు సరికదా ఎత్తిపోసిన నీళ్లు తర్వాత వరదలు వచ్చి సముద్రం పాలయ్యాయి. ఇలా రూ. వెయ్యి కోట్లకు పైగా కరెంట్‌ బిల్లు వృథా అయింది. తెచ్చిన అప్పులో ఇప్పటికే అసలు, వడ్డీ కలిపి రూ. 5 వేల కోట్ల దాకా తిరిగి చెల్లించారు. ఈ మార్చి నెలాఖరుకు ఇంకో రూ.500 కోట్ల వరకు రీ పేమెంట్‌ చేయాల్సి ఉంది. 2023 –- 24 ఆర్థిక సంవత్సరం నుంచి అసలు లెక్క మొదలు కానుంది

కాళేశ్వరం అప్పులు కట్టేందుకే ఫిబ్రవరి 3న ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌‌లో రూ.11 వేల కోట్లు కేటాయించనున్నారు. ఎత్తిపోతల కోసం కరెంట్‌‌ బిల్లులకు తక్కువలో తక్కువ ఇంకో రూ.2 వేల కోట్లు తప్పనిసరి. తెలంగాణను ఈ ప్రాజెక్టుతోనే కోటి ఎకరాల మాగాణం చేశామని సర్కారు గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఇప్పటి వరకు ప్రాజెక్టుతో ఎలాంటి ఉపయోగం చేకూరలేదు.

ఇప్పుడు తీసుకున్న వాటికి 2040 వరకు రీ పేమెంట్లు

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేసీఆర్‌‌ ప్రభుత్వం కాళేశ్వరం ఇరిగేషన్‌‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌‌ లిమిటెడ్‌‌ పేరుతో అప్పట్లో ఓ కార్పొరేషన్‌‌ ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్​ కింద పవర్‌‌ ఫైనాన్స్‌‌ కార్పొరేషన్‌‌ (పీఎఫ్‌‌సీ), రూరల్‌‌ ఎలక్ట్రిఫికేషన్‌‌ కార్పొరేషన్‌‌ (ఆర్‌‌ఈసీ), ప్రభుత్వరంగ బ్యాంకులు, నాబార్డు నుంచి పలు దఫాల్లో రూ.97,447 కోట్ల లోన్‌‌ తీసుకుంది. ఇందులో కాళేశ్వరం ఎత్తిపోతల కోసం రూ.87,447 కోట్లు, పాలమూరు –- రంగారెడ్డి లిఫ్ట్‌‌ స్కీం కోసం రూ.10 వేల కోట్లు తీసుకొని వాటి నిర్మాణానికి ఖర్చు చేసింది. ఈ లోన్ల రీ పేమెంట్‌‌ 2021 –- 22 ఆర్థిక సంవత్సరం నుంచి మొదలు కాగా..2039 –- 40 ఆర్థిక సంవత్సరం వరకు చేయాల్సి ఉంది. 2034 –-35 ఆర్థిక సంవత్సరం దాకా భారీ మొత్తంలో ఈ రీ పేమెంట్‌‌ ఉంటుంది. ప్రస్తుతం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు రీ పేమెంట్లు చెల్లిస్తుండగా.. 2024 నుంచి ఈ ప్రాజెక్టుతో పాటు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు రీ పేమెంట్లు కూడా మొదలవనున్నాయి. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో అదనపు పనుల కోసం ఇంకో రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు అప్పులు అవసరం. వాటిని కలుపుకుంటే రీ పేమెంట్‌‌ భారం 2045 వరకు కొనసాగే అవకాశముంది. 

వరుసగా పదేండ్లు రూ. 13 వేల కోట్లు కట్టుడే

రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రూపాల్లో (స్టేట్‌‌ ఓన్‌‌ రెవెన్యూ) ప్రతి నెలా రూ.10 వేల కోట్ల వరకు ఆమ్దానీ వస్తున్నది. ఏటా రూ.1.20 లక్షల కోట్ల స్టేట్‌‌ ఓన్‌‌ రెవెన్యూ ఉంది. ఇందులో వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.11 వేల కోట్లు, ఆ తర్వాత వరుసగా పదేండ్ల పాటు రూ.13 వేల కోట్లకు పైగా కాళేశ్వరం కార్పొరేషన్​కింద తీసుకున్న అప్పు కోసం తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పటి వరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఖజానాకు ఆదాయం సమకూరేది అనుమానమే. ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చినప్పుడు కాళేశ్వరంతో తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీళ్లు ఇస్తామని, తద్వారా సమకూరే ఆదాయంతో రీపేమెంట్‌‌ చేస్తామని ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. ప్రభుత్వం నీటి తీరువా వసూలు చేయడం లేదు కాబట్టి ఆ మొత్తాన్ని రాష్ట్ర బడ్జెట్‌‌ నుంచే సమకూర్చాల్సి ఉంటుంది. అయితే పరిశ్రమలకు ఇంతవరకు ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వలేదు. మిషన్‌‌ భగీరథకు నీటిని ఇస్తున్నా, దానికీ ప్రజల నుంచి ట్యాక్స్‌‌ వసూలు చేయడం లేదు. ఆ మొత్తాన్ని పంచాయతీరాజ్‌‌, మున్సిపల్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ల నుంచి వసూలు చేయాలని నిర్ణయించినా, అలా కూడా రూపాయి తిరిగి రాలేదు. దీంతో గత్యంతరం లేక రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్‌‌లో నిధులు కేటాయించి అప్పులు చెల్లించబోతుంది. 

రూ. 71,575 కోట్ల వడ్డీ

కాళేశ్వరం కార్పొరేషన్​కింద తీసుకున్న అప్పు ఇప్పటివరకు మొత్తం రూ.97,447 కోట్లు కాగా.. దీనికి రూ.71,575 కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తున్నది. బ్యాంకులు, నాబార్డ్‌‌ తక్కువ వడ్డీకి లోన్‌‌లు ఇవ్వగా పీఎఫ్‌‌సీ, ఆర్‌‌ఈసీ నుంచి ఎక్కువ వడ్డీకి లోన్‌‌లు తీసుకువచ్చారు. ఈ ఏడాది నుంచి చేసే రీపేమెంట్‌‌లో రెండు వంతులు వడ్డీ రూపంలోనే చెల్లిస్తున్నారు. ఒకవంతు మాత్రమే అసలు చెల్లించనున్నారు. ఇలా వరుసగా ఆరేండ్ల పాటు అసలు కన్నా వడ్డీ చెల్లింపులే ఎక్కువగా ఉండనున్నాయి.