
స్మార్ట్ ఫోన్.. ఇది లేనిదే రోజు గడవదేమో.. వింటే అతిశయోక్తిగా ఉన్నా, ఇది నిజం. కాసేపు మన మొబైల్ కంటికి కనిపించకపోతే ఏదో కోల్పోయిన వారిలాగా మారిపోతాం. ఈ ధోరణి పెద్దవాళ్లలోనే కాదు.. చిన్నపిల్లల్లోనూ ఉందట. ఏడాది వయస్సు కూడా నిండని పిల్లలు ఫోన్లు ఇవ్వడం.. అదేంటని అడిగితే ఫోన్ లేనిదే ముద్ద ముట్టరని చెప్పడం పిల్లలను ఫోన్లకు అడిక్ట్ అయ్యేలా చేస్తున్నాయి.
ఎంత చిన్న వయస్సులో సెల్‌ఫోన్ ఇస్తే లాంగ్ పీరియడ్‌లో అది వారి మానసిక ఆరోగ్యంపై అంతే ప్రభావం చూపుతుందని, పిల్లల్లో విపరీత ధోరణిలు పెరిగిపోతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సేపియన్ ల్యాబ్స్అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో పలు ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి.
వయస్సుల వారీగా..
గ్లోబల్మైండ్ప్రాజెక్ట్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా 27,969 మంది 18 నుంచి 24 ఏళ్ల వారి మీద స్టడీ చేశారు. వారు ఏ వయసులో సెల్ ఫోన్ వాడారో, ఎందుకు వాడారో తదితర వివరాలు నమోదు చేసి, వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో పరిశీలించారు. ఆ వివరాల ప్రకారం.. ఆడపిల్లలకు చిన్నతనంలోనే ఫోన్ ఇస్తే వారు యంగ్ ఏజ్‌కి వచ్చే సరికి 74 శాతం ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. అదే 18 ఏళ్ల వయసులో ఫోన్ ఇస్తే ఈ ముప్పు 46 శాతమే ఉంటుందట.
అబ్బాయిలు ఆరేళ్ల వయసులో ఫోన్ వాడటం మొదలెడితే 18 నుంచి 24 ఏళ్ల మధ్యకు వచ్చే సరికి ఆరోగ్యసమస్యలను ఎదుర్కొనే ముప్పు 42 శాతం ఉంటుందని, అదే 18 ఏళ్లకైతే ఆ ముప్పు 36 శాతం ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఎంత చిన్నవయసులో సెల్‌ఫోన్ వాడితే అంత ఎక్కువ మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందట. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందట. సోషల్ మీడియలో కాలం వెల్లదీసే వాళ్లకు ముప్పు ఇంకా ఎక్కువగా ఉంటుందని రిసర్చ్‌లో తేలింది.